చారిత్రక నేపథ్యాన్ని టచ్ చేస్తూ, గతంలో కొన్ని వెబ్ సిరీస్ లు వచ్చాయి. అలా ప్రేక్షకులను పలకరించిందే 'ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్'.  డాక్టర్ రవిప్రకాశ్ కొయాడే రాసిన మరాఠీ నవల 'ప్రతీపశ్చంద్ర' ఆధారంగా రూపొందిన సిరీస్ ఇది. ఆదిత్య సర్పోట్ దార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, నిన్నటి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజీవ్ .. సాయి తమ్హన్కర్ .. ఆశిష్ విద్యార్ధి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఈ కథ 1996లో మొదలై .. ప్రస్తుత కాలంలో నడుస్తూ ఉంటుంది. రవి భట్ ( రాజీవ్) చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కారు ప్రమాదంలో కోల్పోతాడు. బ్రతికి బయటపడిన అతణ్ణి ఒక కుటుంబం చేరదీస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా శివాజీ గురించిన కథలను వింటూ పెరగడం వలన, అతనికి శివాజీ పట్ల ఎంతో గౌరవ భావం ఉంటుంది. అలాంటి అతనికి ఒక రోజున జస్టీస్ కృష్ణ దీక్షిత్ తారసపడటంతో ఆయన జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. 

జస్టీస్ కృష్ణదీక్షిత్ కదలికలను కొంతమంది ఆగంతకులు పసిగడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోను ఆయన ఒక పుస్తకాన్ని రవి భట్ కి అందజేస్తాడు. శివాజీ మహారాజు తదనంతరం ఆయనకి సంబంధించిన నిధిని ఔరంగజేబు సొంతం చేసుకోవాలని అనుకున్నప్పుడు, ఆ నిధిని కొంతమంది మరాఠా వీరులు ఒక చోట దాచారనీ .. అప్పటి నుంచి వారి వారసులే ఆ నిధిని రక్షిస్తూ వస్తున్నారనీ .. వారినే శీలేదార్లు అంటారని కృష్ణదీక్షిత్ చెబుతాడు. 

రవి భట్ కూడా శీలేదార్ల కుటుంబానికి చెందినవాడేనని కృష్ణ దీక్షిత్ చెబుతాడు. అతని తాత .. తండ్రి ఆ నిధిని కాపాడే ప్రయత్నంలోనే ప్రాణాలు కోల్పోయారని అంటాడు. ఇకపై ఆ నిధిని రక్షించవలసిన బాధ్యతను అతనికి అప్పగిస్తున్నట్టు చెబుతాడు. ఆ నిధి ఎక్కడ ఉంటుంది? దాని జాడను రవి భట్ ఎలా కనుక్కుంటాడు? ఆ నిధిని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్న వారెవరు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది. 

విశ్లేషణ: సహజంగానే 'నిధి' అనే ఒక అంశమే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. నిధి తాలూకు రహస్యాలు .. వాటిని కనుక్కోవడంలోని అవాంతరాలు .. సాధించడంలో ప్రమాదాలు ఉత్కంఠను రేకెత్తించేవిలా ఉంటాయి. అందువలన నిధికి సంబంధించిన కథలను చూడటానికి ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూపిస్తూ ఉంటారు. అందునా ఇది శివాజీ మహారాజుకి సంబంధించిన నిధి చుట్టూ తిరిగే కథ కావడం వలన, మరింత కుతూహలాన్ని కలిగిస్తూ ఈ కథ మొదలవుతుంది.         

ఈ సిరీస్ ను 6 ఎపిసోడ్స్ గా రూపొందించారు. నిధి ఎక్కడ ఉందనేది తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలతో మొదటి 3 ఎపిసోడ్స్ కొనసాగుతాయి. ఆ నిధిని దక్కించుకొవడానికి ప్రయత్నించే స్వార్థ శక్తులతో తలపడే సన్నివేశాలతో మిగతా 3 ఎపిసోడ్స్ నడుస్తాయి. సహజత్వానికి దగ్గరగా అనిపించే ఒక బలమైన కథ .. భారీతనం .. ప్రత్యేకమైన సెట్స్ ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

ఇక ఈ తరహా కథల్లో నిధి రహస్యం తెలుసుకునే విధానమే అందరిలో ఆసక్తిని పెంచుతూ ఉంటుంది. ఈ సిరీస్ లోను కొన్ని సంకేతాలను హీరో అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లడం బాగానే అనిపిస్తుంది. అయితే  రహస్యాలను హీరో వెంటనే కనిపెట్టేస్తూ ఉండటం కాస్త నిరాశ పరుస్తుంది. అలాగే ప్రాచీనకాలం నాటి వస్తువులు కూడా కాస్త ఆర్టిఫిషియల్ గా కనిపిస్తూ ఉంటాయి. బాదామీ గుహల నేపథ్యంలోని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. 

పనితీరు
: రాజీవ్ కథానాయకుడిగానే ఈ సిరీస్ కొనసాగుతుంది. అతనితో పాటు మిగతా వాళ్లంతా బాగానే చేశారు. ప్రతాపచంద్ర వంటి పాత్రలు ఆశిష్ విద్యార్ధి బాగా చేస్తాడు. కానీ ఆ పాత్రను ఆశించినస్థాయిలో డిజైన్ చేయలేదని అనిపిస్తుంది. నిర్మాణం పరంగా చూసుకుంటే ఈ సిరీస్ కి మంచి మార్కులే పడతాయి. కథకి తగిన భారీతనం కనిపిస్తుంది. 

శివాజీ మహారాజు కాలం నాటి నిధి అనే ఒక ప్రత్యేకత తప్ప, ఎలాంటి కొత్తదనం ఈ కథలో కనిపించదు. నిధి నేపథ్యంలో గతంలో వచ్చిన కథలనే ఫాలో అవుతుంది. దర్శకుడు ఈ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. బిజేష్ జయరాజన్  స్క్రీన్ ప్లే అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. చివర్లో మినహా ఎలాంటి ట్విస్టులు లేకుండా కథ ముందుకు వెళుతూ ఉంటుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకి తాగినట్టుగానే కనిపిస్తాయి. 

ముగింపు: భారీతనం విషయంలో ఈ సిరీస్ కి వంకబెట్టవలసిన అవసరం లేదు. ఎంచుకున్న లైన్ కూడా కుతూహలాన్ని రేకెత్తించేదే. అయితే ఆయా పాత్రలను డిజైన్ చేయడంలో .. కథనాన్ని నడిపించే విషయంలో మరింత కసరత్తు చేస్తే బాగుండేదని అనిపిస్తుంది.