ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో 'హత్య' సినిమా రూపొందింది. రవివర్మ .. ధన్యబాలకృష్ణ .. పూజా రామచంద్రన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి శ్రీవిద్య బసవ దర్శకత్వం వహించారు. జనవరి 24వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి, అక్కడ ఆశించినస్థాయి రెస్పాన్స్ దక్కలేదు. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: ఈ కథ 'పులివెందుల' నేపథ్యంలో జరుగుతుంది. అక్కడ దయానంద్ రెడ్డి (రవివర్మ) రాజకీయంగా మంచి పలుగుబడి ఉన్న వ్యక్తి. ముఖ్యమంత్రి జీవన్ రెడ్డి (భరత్ రెడ్డి)కి ఆయన స్వయానా బాబాయ్. అలాంటి వ్యక్తి దారుణంగా హత్యకి గురవుతాడు. ఆ కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ సుధారావు (ధన్య బాలకృష్ణ)ను జీవన్ రెడ్డి రంగంలోకి దింపుతాడు. ఆ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను పరిశీలిస్తూ సుధారావు ముందుకు వెళుతుంది. 

దయానంద్ రెడ్డి ఇతరులకు సాయపడటంలో ముందుండేవారనీ, కుటుంబ సంబంధమైన కొన్ని సమస్యల కారణంగా ఆయన కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారని సుధారావుకు తెలుస్తుంది.
ఆయన బంగ్లాకు సీసీ కెమెరాలు లేవనీ, ఆయనకి గల ఇతర సంబంధాలే అందుకు కారణమని ఆమె వింటుంది. ఆయన సూసైడ్ లెటర్ ఆమెకి మరిన్ని సందేహాలను కలిగిస్తుంది. ఆయన జీవితంలో 'షహీన్' అనే యువతికి కూడా స్థానం ఉందనే విషయాన్ని తెలుసుకుంటుంది.        

ఎంతో శ్రీమంతుడైన దయానంద్ రెడ్డి పెద్ద మొత్తంలో అప్పులు చేశాడని తెలుసుకుని సుధారావు షాక్ అవుతుంది. ఆయన ఎందుకు అప్పులు చేయవలసి వచ్చింది? ఎవరి కోసం చేయవలసి వచ్చింది? అనే ఆలోచనలో పడుతుంది. ఆయన మరణం వలన ఎవరికి ఎక్కువ లాభం జరిగిందనే దిశగా తన విచారణను మొదలుపెడుతుంది. అప్పుడు ఆమెకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అనేది కథ. 

విశ్లేషణ
: తెరపై ఒక హత్య జరగడం .. దానిని తప్పుదారి పట్టించడానికి కొంతమంది రాజకీయనాయకులు ప్రయత్నించడం .. అవినీతి అధికారులు వారికి సహకరించడం వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే ఇది అలా తయారు చేసుకుని వచ్చిన కథగా అనిపించదు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన ఒక ప్రముఖ రాజకీయనాయకుడి హత్యను ఆధారంగా చేసుకునే ఈ సినిమాను తెరకెక్కించారని అనిపిస్తుంది. 

కీలకమైన పాత్ర ముఖ్యమంత్రికి బాబాయ్ గా ఉండటం .. బంగ్లాలో ఒంటరిగా ఉండటం .. బాత్ రూమ్ లో శవమై పడి ఉండటం  .. ముందుగా గుండెపోటు వలన చనిపోయారని వార్తలు రావడం .. ఆయన గదిలోని డాక్యుమెంట్స్ మాయం కావడం .. అక్కడ సూసైడ్ లెటర్ లభించడం .. ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా గతంలో జరిగిన సంఘటనకి దగ్గర పోలికలతో కనిపిస్తూ ఉంటాయి. పాత్రల పేర్లు కూడా కాస్త దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. 

ఈ కథ మర్డర్ తోనే మొదలవుతుంది .. ఇన్వెస్టిగేషన్ తనతో పాటు ఆడియన్స్ ను తీసుకుని వెళుతూ ఉంటుంది. దర్శకుడు తనకి లభించిన సమాచారానికి కొంత కల్పనను జోడించి ఉండొచ్చునని అనిపిస్తుంది. సాధ్యమైనంత వరకూ సహజత్వాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. ఒక పెద్ద కథను చాలా తక్కువ బడ్జెట్ లో సింపుల్ గా చెప్పడానికి ట్రై చేసిన తీరు బాగుంది.

పనితీరు
: దయానంద్ రెడ్డి పాత్రలో రవివర్మ మెప్పించాడు. ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఆత్మీయమైన పలకరింపులేని జీవితం .. తనని నమ్ముకున్నవారికి న్యాయం చేయలేని నిస్సహాయ స్థితి కలిగిన ఈ పాత్రలో ఆయన చూపించిన బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఇంతవరకూ ఆయన చేసిన పాత్రలలో ఈ పాత్రకి ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పొచ్చు. ఇక పోలీస్ ఆఫీసర్ గా ధన్య బాలకృష్ణ, షహీన్ పాత్రలో పూజా రామచంద్రన్ నటన ఆకట్టుకుంటుంది. అభిరాజ్ రాజేంద్రన్ ఫొటోగ్రఫీ .. నరేశ్ కుమరన్ నేపథ్య సంగీతం .. అనిల్ కుమార్ ఎడిటింగ్ ఫరవాలేదు.