ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాలు చిన్న సినిమాల కథలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాయి. ఒక మంచి కథను పట్టుకుని .. ఒక మంచి పల్లెటూరిని లొకేషన్ గా మార్చుకోవడం ఎక్కువగా కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందించడానికి అవసరమైన వనరులుగా ఇప్పుడు పల్లెటూళ్లు కనిపిస్తున్నాయి. అలా రూపొందిన 'మధుశాల' .. నిన్నటి నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: అది ఒక మారుమూల గ్రామం .. ఎమ్మెల్యే సత్యనారాయణ (గోపరాజు రమణ) అధికారం అక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిగా వెంకట్రావ్ (బెనర్జీ) కూడా అదే ఊళ్లో ఉంటాడు. సత్యనారాయణ తన కొడుకు ప్రేమించాడని చెప్పి .. పేదింటి అమ్మాయి పల్లవి (యానీ)ని కోడలిగా తీసుకుని వస్తాడు. ఆయన ఆదర్శాన్ని గురించి అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. పల్లవి తల్లిదండ్రులు తమ అదృష్టానికి మురిసిపోతారు. 

అదే గ్రామంలో దుర్గా ( మనోజ్ నందం) కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతూ ఉంటాడు. రాములు (తనికెళ్ల భరణి) కూతురు 'కనక' (ఇనయా)ను అతను ప్రేమిస్తూ ఉంటాడు. ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఇక ఆ గ్రామానికే అందగత్తెగా అందరూ 'మధురవాణి' (వరలక్ష్మి శరత్ కుమార్) పేరు చెబుతూ ఉంటారు. ఎలాగైనా ఆమెను పొందాలనే ఉద్దేశంతో రవి 'గెటప్ శ్రీను) ఆమె ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు.  

ఈ నేపథ్యంలోనే పల్లవిని కిడ్నాప్ చేసి ఓ నాలుగు రాజుల పాటు రహస్యంగా ఉంచమని నాయుడమ్మ (రఘుబాబు) చెప్పడంతో 'దుర్గ' అలాగే చేస్తాడు. దాంతో పల్లవి కోసం వెతుకులాట మొదలవడంతో ఊళ్లో వాతావరణం అంతా కూడా గందరగోళంగా మారిపోతుంది. ఆ సమయంలోనే పల్లవిని చంపేయమనే ఆదేశం దుర్గకి అందుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? పల్లవిని చంపించడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? మధురవాణి పాత్ర ఏమిటి? అనేది మిగతా కథ.   

విశ్లేషణ
: గ్రామీణ ప్రాంతాలలో సహజంగానే స్థానిక రాజకీయాలపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. అక్కడ రాజకీయనాయకుల అనుచర గణాలుగా .. వర్గాలుగా ప్రజలు విడిపోవడం కనిపిస్తూ ఉంటుంది. అలాగే 'ఈజీ మనీ'  కోసం పల్లెటూరి కుర్రాళ్లు ఇబ్బందుల్లో పడటం గురించిన కథనాలను కూడా వింటూనే ఉంటాము. ఇక గ్రామాల పరిధి చాలా తక్కువగా ఉంటుంది గనుక, అక్కడ ఒకరిని ఒకరు గమనించడం తేలిక. అలాంటి అంశాలను కలుపుకుంటూ తయారు చేసిన కథ ఇది.
 
ప్రేమ .. రాజకీయాలు .. కాస్తంత కామెడీ మిక్స్ చేసిన విలేజ్ కథలు చాలావరకూ ఆకట్టుకునే మాదిరిగానే అనిపిస్తూ ఉంటాయి. అలా ఈ కథ ఆకట్టుకుందా? అంటే లేదనే చెప్పాలి. పల్లవిని కోడలిగా చేసుకునే తొలి సన్నివేశమే తేలిపోతుంది. స్క్రిప్ట్ పై .. చిత్రీకరణపై సరైన కసరత్తు జరగలేదనే విషయం అప్పుడే అర్థమైపోతుంది. ఒక వ్యక్తిని మర్డర్ చేయాలంటూ ఆ వ్యక్తికి సంబంధించిన ఫొటో చేతులు మారడం చూస్తే, సిటీ బస్సులో కండక్టర్ నుంచి ప్యాసింజర్ వరకూ టికెట్ చేతులు మారడం గుర్తొస్తుంది. 

ప్రధానమైన కథలో ఎమ్మెల్యే .. మధురవాణి .. దుర్గా పాత్రలు ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. అయితే ఈ మూడు పాత్రలను పవర్ఫుల్ గా మలచలేకపోయారు. ముఖ్యంగా 'మధురవాణి' పాత్రను సరిగ్గా డిజైన్ చేయకపోవడం వలన ఆ పాత్ర డీలాపడిపోతుంది. రఘుబాబు - తనికెళ్ల భరణి పాత్రలు సిల్లీ కామెడీకి పరిమితం కావడం ఇబ్బంది పెడుతుంది. సినిమా ఆరంభంలో 'మధుశాల' అనే వైన్ షాపును చూపిస్తారు. మిగతా కథనంతా వదిలేసి ఆ వైన్ షాపు పేరును సినిమాకి టైటిల్ గా సెట్ చేయడం ఆశ్చర్యం.   

పనితీరు
: ఈ సినిమాలో కాస్త క్రేజ్ ఉన్న ఆర్టిస్టులే ఉన్నారు. అయితే వారి పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం వలన, సహజత్వం లోపించింది. ఏ ట్రాక్ వైపు నుంచి కూడా ఫీల్ తో కూడిన సీన్స్ ను ప్లాన్ చేసుకోలేపోయారు. అందువలన పేలవమైన సన్నివేశాలతో కథ చివరి వరకూ సాగుతుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ పనితీరు ఓ మాదిరిగా అనిపిస్తాయంతే.