కొన్ని సినిమాలు థియేటర్ కి వచ్చి నెల తిరక్కుండానే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ప్రత్యక్షమవుతున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం, ఆయా కారణాల వలన ఓటీటీలో అడుగుపెట్టడం ఆలస్యమవుతోంది. అలా థియేటర్ కి వచ్చిన 11 నెలల తరువాత ఓటీటీకి వచ్చిన సినిమానే 'లక్ష్మీ కటాక్షం'. సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 4 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: ధర్మా (సాయికుమార్) ఈ సారి ఎలాగైనా ఎమ్మెల్యే గా గెలవాలనే పట్టుదలతో ఉంటాడు. అందుకోసం కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి అతను సిద్ధపడతాడు. అందుకు అవసరమైన 100 కోట్లను ధర్మా స్థావరానికి తరలించడానికి 'లక్ష్మీ కటాక్షం' అనే కోడ్ తయారు చేయబడుతుంది.
ఎలక్షన్స్ దగ్గరపడుతూ ఉండటంతో. ఓటుకు 5 వేలు పంచాలని ధర్మా నిర్ణయించుకుంటాడు. అందుకు అవసరమైన సన్నాహాలు మొదలుపెడతాడు.

ఎమ్మెల్యేగా తాను గెలిచిన తరువాత ఒక ప్రాజెక్టు ద్వారా 500 కోట్లు వచ్చే అవకాశం ఉండటం వల్లనే, ఆ పదవిని చేజిక్కుంచుకోవాలనే బలమైన పట్టుదలతో ధర్మా ఉంటాడు. అవినీతినీ .. అన్యాయాన్ని నమ్ముకునే ఆయన సర్పంచ్ స్థాయి నుంచి ఎదుగుతూ వస్తాడు. ఆయన తీరును మొదటి నుంచి చూస్తూ అనాథగా పెరిగిన అర్జున్, పోలీస్ ఆఫీసర్ గా అదే ఊరుకు వస్తాడు. ధర్మా ఎలాంటి పరిస్థితుల్లోను డబ్బులు పంచడకుండా చేయాలి. అతను ఎమ్మెల్యేగా గెలవకూడదనే పట్టుదలతో  అర్జున్ ఉంటాడు.

ఎలక్షన్స్ లో ధర్మా పంచాలనుకున్న 100 కోట్లు రహస్యంగా ఎక్కడ ఉంచారో తెలుసుకోవడానికి అర్జున్ గట్టి నిఘా పెడతాడు. ఇక అదే ఊళ్లో 'చింటూ' అతని స్నేహితుడు ఫుడ్ డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూ ఉంటారు. పెద్దగా కష్టపడకుండానే కోట్లకు అధిపతులు కావాలనేది వారి కోరిక. వాళ్ల ఆశనే వాళ్లను ధర్మా ట్రాప్ లో పడేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ధర్మాపై అర్జున్ కోపంతో ఉండటానికి కారణం ఏమిటి? చివరికి ఆ 100 కోట్లు ఎవరికి దక్కుతాయి? అనేది మిగతా కథ.

విశ్లేషణ: అవినీతిపరుడు .. స్వార్థపరుడు అయిన ఒక రాజకీయనాయకుడు, అదే మార్గంలో తాను సంపాదించిన డబ్బును వెదజల్లి .. మరింత పై స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకు అడ్డుపడినవారిని తాను పెంచి పోషిస్తూ వస్తున్న రౌడీయిజంతో భయపెడుతూ ఉంటాడు. దురాశ .. పదవీ వ్యామోహం కారణంగా ఆ రాజకీయనాయకుడికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

విలాసవంతమైన జీవితం పట్ల ఆశతో ఉన్న ఇద్దరు యువకులు .. దురాశతో ఉన్న రాజకీయనాయకుడు .. ఆశయంతో ఉద్యోగాన్ని సాధించిన ఒక పోలీస్ ఆఫీసర్ ఈ కథలోని ప్రధానమైన పాత్రలు. మిగతా పాత్రలు నామ మాత్రంగానే కనిపిస్తూ ఉంటాయి. 100 కోట్ల చుట్టూ తిరిగే కథ కావడంతో, ఇక ఆ దాగుడుమూతల ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని  ప్రేక్షకులు అనుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ల పప్పులుడకవ్.  

ఈ కథలో కీలకమైన అంశం 100 కోట్లు .. దానిని దక్కించుకునే కోడ్. అయితే అసలు ఈ డబ్బు ఎవరి అధీనంలో ఉంది? .. ఎవరికి ఆ కోడ్ చూపించాలి? అనే విషయంలో క్లారిటీ లోపించింది. ఇక ధర్మా దగ్గర నుంచి ఆ డబ్బును కొట్టెయ్యడానికి ప్రయత్నించే గ్యాంగ్ ఎవరు? అనే విషయంలోను క్లారిటీ రాదు. సాధారణంగా డబ్బు చుట్టూ తిరిగే కథలు కామెడీని కాస్త ఎక్కువగానే టచ్ చేస్తూ ఉంటాయి. ఈ కథలోను ఆ ప్రయత్నం జరిగింది. కానీ అది కామెడీగా అనిపించదు.          

పనితీరు:సామాన్యుడి చేతిలో 'ఓటు' ఒక అస్త్రం లాంటిది . బలహీనతలకు దానిని బలి చేయవద్దు అనే ఒక సందేశాన్ని ఇవ్వడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం అభినందనీయమే. అయితే ఈ అంశం చుట్టూ అల్లుకున్న కథ బలంగా లేదు. ఆ కథలో ఆకట్టుకునే వినోదపరమైన అంశాలు లేవు. సన్నివేశాలన్నీ పైపైన తీసేసినట్టుగా .. జీవం లేకుండా సాగిపోతాయి. లక్ష్మీదేవితో సాయికుమార్ సంభాషణ మరీ హాస్యాస్పదంగా అనిపిస్తుంది. 

ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా బాగానే చేశారు. కొత్త ఆర్టిస్టుల నుంచి సరైన అవుట్ పుట్ తీసుకోలేదనే విషయం తెలుస్తోంది. నాని అయినవిల్లి ఫొటోగ్రఫీ .. అభిషేక్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. ప్రదీప్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. కథాకథనాలపై సరైన కసరత్తు జరగకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంటెంట్ గా ఇది కనిపిస్తుంది.