తమిళంలో కామెడీ డ్రామా జోనర్లో రూపొందిన సినిమానే 'పెరుసు'. ఇళంగో రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మార్చి 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. వైభవ్ .. సునీల్ రెడ్డి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. తమిళంతో పాటు ఇతర భాషలలోను అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం. 

కథ: పరంధామయ్య ఓ మధ్య తరగతి కుటుంబీకుడు. ఆయన సంతానమే దొరబాబు (వైభవ్) స్వామి (సునీల్ రెడ్డి). దొరబాబుకు 'శాంతి'తో .. స్వామికి 'రాణి'తో వివాహం జరుగుతుంది. ఉమ్మడి కుటుంబమే అయినా వాళ్ల మధ్య పెద్దగా సఖ్యత ఉండదు. పరంధామయ్యకి కావలసినవన్నీ ఆయన భార్య 'భాగ్యం' దగ్గరే ఉండి చూసుకుంటూ ఉంటుంది. తన వయసువారైన స్నేహితులతో పరంధామయ్య కాలక్షేపం చేస్తూ ఉంటాడు. 

ఒక రోజున పరంధామయ్య హఠాత్తుగా చనిపోతాడు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులంతా ఇంటికి చేరుకుంటారు. ఆయన చనిపోయిన విషయం బంధు మిత్రులకు తెలియపరచాలనే అనుకుంటారు. కానీ పరంధామయ్య శవం ఇతరులు చూడటానికి ఇబ్బంది కలిగించేలా ఉంటుంది. అలా ఎందుకు జరిగిందనేది ఎవరికీ అర్థం కాదు. విషయం తెలిస్తే అందరూ ఆక్షేపిస్తారని ఆందోళన చెందుతారు. 

తమ కుటుంబ పరువు ప్రతిష్ఠలు దెబ్బతినకుండా శవానికి అంత్యక్రియలు జరిపించాలని నిర్ణయించుకుంటారు. అయితే శవం విషయంలో కుటుంబ సభ్యులు ఏదో దాస్తున్నారని భావించిన కొందరు, అదేమిటనేది కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్లతో పరంధామయ్యకి ఉన్న పరిచయం ఏమిటి? ఆ సమస్య నుంచి ఆ కుటుంబ సభ్యులు ఎలా బయటపడతారు? అనేది కథ. 

విశ్లేషణ: ఇది ఒక ఉమ్మడి కుటుంబం చుట్టూ తిరిగే కథ .. ఒక పెద్దాయన మరణం చుట్టూ తిరిగే కథ. శవం చుట్టూ ఒక ఆసక్తికరమైన కథను అల్లుకుని దానిని వినోదభరితంగా ఆవిష్కరించడం అప్పుడప్పుడు జరుగుతూ వస్తోంది. అలాంటి ఒక కథనే ఇది. సాధారణ స్థితిలో చనిపోతే ఫరవాలేదు .. కానీ ఏ మాత్రం అభ్యంతరకర స్థితి ఉన్నా అది ఇక ఆ కుటుంబ సభ్యులను నానా ఇబ్బంది పెట్టేస్తుంది. అలాంటి ఒక కథాంశం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. 

దర్శకుడు ఎంచుకున్న వినోదప్రధానమైన అంశం కొంతవరకూ నవ్వు తెప్పిస్తుంది. అయితే అందరూ కలిసి కూర్చుని చూస్తూ నవ్వుకోలేని పరిస్థితి ఉంటుంది. అదే ఈ సినిమా విషయంలో ఒక లోపంగా కనిస్తుంది. ఎవరికివారుగా చూస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడక్కడా నవ్వుకోవచ్చు. అయితే కథ మొత్తాన్ని ఒకే అంశం చుట్టూ తిప్పడం వలన, ఒకే విషయంపై సాగదీయడం వలన ఆడియన్స్ కి కాస్త అసహనం కలుగుతుంది.       

పనితీరు
: దర్శకుడు పూర్తి స్థాయిలో ఈ కథకు కామెడీని కనెక్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ప్రతి విషయంలో కామెడీ రాబట్టడానికి ప్రయత్నించడం మనకి తెలిసిపోతూనే ఉంటుంది. అయితే ఆ హాస్యాన్ని ఒక అభ్యంతరకరమైన అంశంతో .. అందుకు సంబంధించిన సన్నివేశాలతో ముడిపెట్టడం వలన అందరూ కలిసి చూసే అవకాశం లేకుండా పోయిన కంటెంట్ గా ఇది మిగిపోయింది. సత్యతిలకం కెమెరా పనితనం .. అరుణ్ రాజ్ నేపథ్య సంగీతం .. సూర్య కుమారగురు ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. 

ముగింపు
: హాస్యభరితమైన కథల ప్రధానమైన ప్రయోజనం, కుటుంబ సమేతంగా వాటిని చూడగలిగినప్పుడే. అయితే ఆ హాస్యాన్ని ఏదైనా ఒక ఇబ్బందికరమైన అంశంతో ముడిపెట్టినప్పుడు, ఆ ప్రయోజనం నెరవేరకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి ఒక ప్రయత్నంగానే ఈ కంటెంట్ కనిపిస్తుంది.