వరలక్ష్మి శరత్ కుమార్ - ఆనంది ప్రధానమైన పాత్రలను పోషించిన 'శివంగి' సినిమా, మార్చి 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. నరేశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకి భరణి ధరన్ దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: సత్యభామ ( ఆనంది) హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో జాబ్ చేస్తూ ఉంటుంది. రవీంద్రతో ఆమె వివాహం జరుగుతుంది. ఇద్దరూ ఒక ఖరీదైన ఫ్లాట్ లో వేరు కాపురం పెడతారు. ఫస్టునైట్ రోజునే రవీంద్రకి ప్రమాదం జరుగుతుంది. అప్పటి నుంచి అతని పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. రవీంద్ర సంసారానికి పనికి రాడని తెలిసినా, అతని బాగోగులు చూసుకుంటూ అతనితోనే సత్యభామ ఉండిపోతుంది.

వైవాహిక జీవితంలో తొలి వార్షికోత్సవం రోజునే తన భర్తకి సర్జరీ చేయించడానికి సత్యభామ సన్నాహాలు చేసుకుంటుంది. అతనికి ఇన్సూరెన్స్ ఉండటంతో, సర్జరీకి అయ్యే 20 లక్షల విషయంలో సత్యభామకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఆమె అత్తమామలు హాస్పిటల్ కి చేరుకుంటారు. సత్యభామ తల్లిదండ్రులు అల్లుడి ఆపరేషన్ సక్సెస్ కావాలని కోరుకోవడానికి తిరుపతి బయల్దేరతారు. సత్యభామ కూడా హాస్పిటల్ కి చేరుకోవడానికి సిద్ధమవుతుంది. 

ఆ సమయంలోనే ఆమె ఆఫీస్ బాస్ కిరణ్ నుంచి కాల్ వస్తుంది. కొంతకాలంగా అతను ఆమెను లైంగికంగా వేధిస్తూ ఉంటాడు. అతను ఇన్సూరెన్స్ నుంచి రవీంద్ర ఆపరేషన్ కి కావలసిన డబ్బు రాకుండా చేస్తాడు. అదే సమయంలో గతంలో సత్యభామకు దూరమైన ప్రేమికుడు 'అర్జున్' లైన్లోకి వస్తాడు. తిరుపతి నుంచి తిరిగి బయల్దేరిన సత్యభామ తల్లిదండ్రులు వరదల్లో చిక్కుకుంటారు. అదే సమయంలో ఆమె ఇంటికి పోలీస్ ఆఫీసర్ 'చారు కర్షి' (వరలక్ష్మి శరత్ కుమార్) వస్తుంది.   అప్పుడు సత్యభామ ఏం చేస్తుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆమె ఇంటికి పోలీసులు ఎందుకు వస్తారు? అనేది కథ.        

విశ్లేషణ
: 'శివంగి' ఈ టైటిల్ చూసినప్పుడు . వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర వైపునుంచి పెట్టి ఉంటారేమోనని అనిపిస్తూ ఉంటుంది. టైటిల్ రోల్ పోషించింది 'ఆనంది' అని అర్థమయ్యేసరికి ఒకరకమైన నిరాశ అలుముకుంటుంది. ఎందుకంటే అందంగా .. నాజూకుగా కనిపించే ఆనందిలో 'సివంగి' లక్షణాలు పొరపాటున కూడా కనిపించవు కాబట్టి.

ఇక 'సివంగి' అన్నప్పుడు ఆ పాత్ర డైలాగ్స్ పవర్ఫుల్ గా ఉండాలి. బాలకృష్ణ రేంజ్ లో .. ఆయన బాడీ లాంగ్వేజ్ తో కొన్ని డైలాగ్స్ చెప్పించారు కూడా. అయితే పట్టుచీర కట్టించి .. పద్ధతిగా చూపిస్తూ ఆమెతో పలికించిన డైలాగ్స్ ఎంతమాత్రం పొంతన లేనట్టుగా అనిపిస్తాయి. సత్యభామకు తల్లిదండ్రులు ఉంటారు .. అత్తమామలు ఉంటారు .. ఫ్రెండ్ శృతి ఉంటుంది .. అయితే వీళ్లెవరూ తెరపైకి రారు. సత్యభామతో ఫోన్లో మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. 

సత్యభామ భర్త హాస్పిటల్లో సర్జరీ కోసం బెడ్ పై సిద్ధంగా ఉంటాడు. ఆమె మాత్రం ఆయన దగ్గర లేకుండా ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటుంది. ఎందుకలా అంటే అందుకు బలమైన కారణం లేదు.  అందరినీ ఫోన్లోనే కవర్ చేస్తూ .. అలా హాల్లో తిరుగుతూ ఉంటుంది. అంటే సినిమాలో 90 శాతం తెరపై ఆమె పాత్ర మాత్రమే కనిపిస్తూ ఉంటుందన్న మాట. అదీ ఫోన్లో మాట్లాడుతూ. ఫస్టు టైమ్ థియేటర్లో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.     

పనితీరు: ప్రధానమైన సత్యభామ పాత్రను మాత్రమే తెరపై చూపిస్తూ 90 శాతం కథను లాగారు. సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించేది వినోదమే. అలాంటి వినోదానికి దూరంగా నడిచే కథ ఇది. ఒక ముద్దూ ముచ్చట .. ప్రేమ గీమా ఏమీ లేకుండా నాలుగు గోడల మధ్య నడిచే కథ. ఆనంది చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఆమె ఒక్కదానినే చూస్తూ ప్రేక్షకులు ఎంతసేపు కూర్చుంటారు? 

ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర వైపు నుంచి ప్రేక్షకులు గట్టి కంటెంట్ నే ఆశిస్తారు. అలాంటివారిపై నీళ్లు చల్లేసి ఆమె తాపీగా వెళ్లిపోతుంది. భరణి ధరన్ ఫొటోగ్రఫీ .. కాషిఫ్ నేపథ్య సంగీతం .. సంజిత్ మొహ్మద్ ఎడిటింగ్ గురించి చెప్పుకునేంతగా ఈ కథలో ఏమీ లేదు. సినిమా మొత్తం చూసిన తరువాత, ఇది నాలుగు గోడల మధ్య గర్జించే 'సివంగి' అనిపిస్తుందంతే.