కల్యాణ్ రామ్ - విజయశాంతి ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమానే 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. తల్లీకొడుకుల ఎమోషన్స్ ప్రధానంగా సాగే కథ ఇది. చాలా కాలం తరువాత విజయశాంతి పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించిన సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. 'బింబిసార' తరువాత హిట్ కోసం వెయిట్ చేస్తున్న కల్యాణ్ రామ్ కి ఈ సినిమా హిట్ తెచ్చిపెడుతుందేమో చూద్దాం. 

కథ: ఈ కథ 2007లో .. విశాఖలో మొదలవుతుంది. పోలీస్ కమిషనర్ వైజయంతి (విజయశాంతి) చాలా సిన్సియర్ ఆఫీసర్. ఆమె భర్త విశ్వనాథ్ (ఆనంద్) తీర రక్షకదళంలో పనిచేస్తూ ఉంటాడు. వారి సంతానమే అర్జున్ (కల్యాణ్ రామ్). తనలాగే అతను ఐపీఎస్ చేయాలని వైజయంతి భావిస్తుంది. అందుకు అవసరమైన శిక్షణ కోసం అర్జున్ ఢిల్లీ కూడా వెళతాడు. అయితే సముద్రం మీదకి వెళ్లిన విశ్వనాథ్ చనిపోయాడని తెలిసి, వైజయంతి - అర్జున్ డీలాపడిపోతారు. 

ముంబైకి చెందిన పఠాన్ (సోహెల్ ఖాన్) గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. అక్కడి నుంచి అతను అక్రమ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాడు. పఠాన్ ప్రధాన అనుచరుడు 'తంగవేల్'.. పఠాన్ ఇద్దరు కొడుకులు అతనికి అన్నిరకాలుగా సహకరిస్తూ ఉంటారు. పఠాన్ మనిషిగా 'మహంకాళి'.. అతని తమ్ముడు 'పైడితల్లి' విశాఖలో పనిచేస్తూ ఉంటారు. తన తండ్రి చనిపోవడానికి కారణం పైడితల్లి అని అర్జున్ అనుకుంటాడు. అతనికి శిక్ష పడుతుందని భావిస్తాడు. 

అయితే ఆనంద్ శవం దొరకకపోవడం వలన, పైడితల్లి ఆ శిక్ష నుంచి తప్పించుకుంటాడు. తన తల్లి ఎదురుచూసిన న్యాయం జరగలేదని భావించిన అర్జున్, కోర్టు ఆవరణలోనే పైడితల్లిని అంతం చేసి, నేరస్థుడిగా మారతాడు. ఆ హత్యకి తానే ప్రత్యక్ష సాక్షినంటూ, కొడుకుకి వ్యతిరేకంగా వైజయంతి కోర్టులో చెబుతుంది. ఫలితంగా ఏం జరుగుతుంది? తల్లికోసం అర్జున్ చేసే త్యాగం ఏమిటి? పఠాన్ వెనుకున్న అదృశ్య వ్యక్తి ఎవరు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: తన మాదిరిగానే తన కొడుకు కూడా పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్న ఓ తల్లి .. తండ్రిని హత్య చేసినవారిపై పగ తీర్చుకోవడం కోసం నేరస్థుడిగా మారిన ఒక కొడుకు కథ ఇది. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' పేరు విన్నప్పుడు, '90స్'లో వచ్చిన సినిమా టైటిల్స్ కి దగ్గరగా అనిపిస్తుంది. సినిమాకి వెళ్లిన తరువాత కథాకథనాలు కూడా అదే తరహాలో సాగినట్టుగా అనిపిస్తుంది. 
          
కథాకథనాల సంగతి అలా ఉంచితే దర్శకుడు ఇటు హీరో .. అటు విలన్ ఇంట్రడక్షన్ సీన్స్ పై ప్రత్యేక దృష్టిపెట్టాడు. ఆడియన్స్ కంగారు పడేలా విలన్ ఇంట్రడక్షన్ ను .. రౌడీలు తలచుకుని తలచుకుని భయపడేలా  హీరో ఎంట్రీని డిజైన్ చేసుకున్నాడు. తల్లినీ .. తన భార్య (సైయీ మంజ్రేకర్) ను కాపాడుకుంటూ హీరో చేసే ఫైట్లు బాగానే అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది .. క్లైమాక్స్ కూడా కాస్త షాక్ ఇస్తుంది. 

నిర్మాణ పరంగా ఈ సినిమాకి వంకబెట్టవలసిన పనిలేదు. బ్యానర్ కి తగిన భారీతనం కనిపిస్తూనే ఉంటుంది. అంతా బాగానే ఉంది కదా అంటే .. ఉంది .. కాకపోతే అది రొటీన్ గా అనిపిస్తుంది. గతంలో ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. అదే కథను దర్శకుడు మరొకసారి గుర్తుచేసినట్టుగా అనిపిస్తుంది. కొత్తదనం కోసం ప్రయత్నించినట్టు ఎక్కడా కనిపించదు. 

పనితీరు: కల్యాణ్ రామ్ .. విజయశాంతి .. శ్రీకాంత్ .. సోహెల్ ఖాన్ ఇలా అంతా కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. కల్యాణ్ రామ్ హెయిర్ స్టైల్ విషయంలో .. విజయశాంతి లుక్ విషయంలో మరికాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. సైయీ మంజ్రేకర్ అందంగా మెరిసింది గానీ, ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. 

రామ్ ప్రసాద్ కెమెరా పనితనం బాగుంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం మెప్పిస్తుంది. అజనీశ్ లోక్ నాథ్ బాణీలు అంతంత మాత్రంగానే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం సినిమాకి చాలా హెల్ప్ అయిందనే చెప్పాలి. ఎడిటింగ్ విషయానికి వస్తే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో అయినా కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేదని అనిపిస్తుంది. శ్రీకాంత్ విస్సా రాసిన డైలాగ్స్ కాస్త పదును పెంచాయి. 

ముగింపు: యాక్షన్ కి .. ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు, లవ్ .. రొమాన్స్ .. కామెడీకి ఎక్కడా చోటు ఇవ్వలేదు. పాత్రల సంఖ్య ఎక్కువైపోవడం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. భారీతనంతో చూస్తున్నంత సేపు కథ బాగానే అనిపిస్తుంది. కాకపోతే రొటీన్ కి భిన్నంగా లేకపోవడమే అసహనాన్ని కలిగిస్తుంది అంతే.