మొదటి నుంచి కూడా విక్రమ్ ఎప్పటికప్పుడు తెరపై కొత్తగా కనిపించడానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. తన ప్రతి సినిమా ఒక ప్రయోగమని చెప్పుకోవడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడతాడు. అలా ఆయన చేసిన మరో ప్రయోగమే 'వీర ధీర సూరన్ 2'. దుషారా విజయన్ .. పృథ్వీ రాజ్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి అరుణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. మార్చి 27వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకసారి ఈ సినిమా కథలోకి వెళ్లొదాం.

కథ: కాళీ (విక్రమ్) టౌనుకు కాస్త దగ్గరలో ఉన్న ఓ గ్రామంలో కిరాణా షాపు పెట్టుకుని జీవన కొనసాగిస్తూ ఉంటాడు. భార్య వాణి (దుషారా విజయన్) ఇద్దరు పిల్లలు .. ఇదే అతని ఫ్యామిలీ. ఆ ఏరియాలో రవి (పృథ్వీ రాజ్)కి రాజకీయంగా మంచి పలుకుబడి ఉంటుంది. అందువలన తన కనుసన్నలలో వ్యవహారాలు నడుపుతుంటాడు. కొడుకు కన్నన్ (సూరజ్ వెంజరమూడు) తండ్రికి కుడిభుజంలా ఉంటాడు. 

తల్లీబిడ్డలు కనిపించకుండా పోయిన ఒక కేసులో కన్నన్ ఇరుక్కుంటాడు. ఆ ఏరియాకి ఎస్పీగా ఉన్న అరుణ్ గిరి (ఎస్ జె సూర్య)ను అనేక చోట్లకు బదిలీలు చేయిస్తూ రవి నానా ఇబ్బందులు పెడతాడు. అది మనసులో పెట్టుకున్న అరుణ్ గిరి, ఈ కేసులో రవి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని  నిర్ణయించుకుంటాడు. అవసరమైతే కనిపించకుండాపోయిన స్త్రీని లేపేసి, ఆ కేసులో కన్నన్ ను ఎన్ కౌంటర్ చేయాలనే పట్టుదలతో ఉంటాడు. 

ఈ విషయం తెలియగానే రవి కంగారుపడిపోతాడు. తన కొడుకును అక్కడి నుంచి తప్పించాలని ప్లాన్ చేస్తాడు. గతంలో తన దగ్గర పనిచేసిన కాళీని కలుసుకుని, ఎస్పీ అరుణ్ గిరిని అంతం చేయమని చెబుతాడు. అతని మాట కాదనలేక కాళీ ఒప్పుకుంటాడు. రవితో కాళీకి గల సంబంధం ఏమిటి? ఎస్పీ ని చంపడానికి అతను ఎందుకు అంగీకరిస్తాడు? కన్నన్ ను ఎన్ కౌంటర్ చేయాలనే ఎస్పీ అరుణగిరి కోరిక నెరవేరుతుందా? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ ముందుకు వెళుతుంది. 

విశ్లేషణ: 'వీర ధీర సూరన్' ఈ టైటిల్ ను బట్టే కథానాయకుడి పాత్రను ఎంత పవర్ఫుల్ గా డిజైన్ చేసి ఉంటారోనని అనుకోవడం సహజం. యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉంటాయని అనుకోవడం కూడా అంతే సహజం. టైటిల్ కి తగినట్టుగానే ఈ కథలో హీరో వీరుడు .. ధీరుడు .. శూరుడు. మంచుపర్వతంలా కనిపించే హీరో, తన ఫ్యామిలీ జోలికి ఎవరొచ్చినా అగ్నిపర్వతంలా మారిపోయి ఉతికి ఆరేసి క్లిప్పులు కూడా పెట్టేస్తాడు. 

'మరింకేం .. అంతా బాగానే ఉంది కదా .. ఈ సినిమా చూసేయవచ్చు' అనిపించడంలో తప్పులేదు. హీరో ఫైట్స్ చేస్తూనే ఉంటాడు. కాకపోతే ఎందుకు చేస్తున్నాడు? ఎవరి కోసం చేస్తున్నాడు? అనే క్లారిటీ ఆడియన్స్ కి రాదు. 'ఓహో చివర్లో ఏదో ట్విస్ట్ ఉంటుందన్న మాట .. అక్కడ చెబుతారులే' అని అనుకుంటూనే కథను ఫాలో అవుతారు. కానీ చివరికి వచ్చిన తరువాత ఇక చెప్పేదేముందిలే అనుకుని ఉండొచ్చు. ఇలా ఒక క్లారిటీ లేకుండానే ఈ కథ శుభం కార్డు వేసుకుంటుంది. 

ఈ కథకి హీరో విక్రమ్ ఒక్కడే అనే విషయం చెప్పక్కర్లేదు. కానీ విలనిజం దగ్గరికి వచ్చేసరికి ఇటు పృథ్వీ రాజ్ .. అటు ఎస్ జె సూర్య విలన్స్ గా చెప్పుకోవాలి. ఈ ముగ్గురి మధ్య దాగుడుమూతల ఆట నడుస్తూ ఉంటుంది. ఎవరి స్కెచ్ ఏమిటి? ఎవరు ఎవరిని ఆడుకుంటున్నారు .. వాడుకుంటున్నారు అనేది మాత్రం, బయటికి వచ్చి తీరుబడిగా ఒక 'టీ' తాగుతూ ఆలోచించినా అంతుబట్టదు. ఈ పరిస్థితి మనకి మాత్రమేనా .. అందరిదీ ఇదే పరిస్థితా అనేది కూడా అర్థం కాదు.      

పనితీరు: ఈ కథలో ప్రధానమైన పాత్రలు మూడు. విక్రమ్ .. పృథ్వీ రాజ్ .. ఎస్ జె సూర్య ఆ వరుసలో కనిపిస్తారు. ఈ ముగ్గురు పాత్రలపై కసరత్తు జరిగినట్టుగా మనకి కనిపించదు. కథలోని అయోమయం .. స్క్రీన్ ప్లే లోని గందరగోళం ప్రేక్షకులను కాస్త ఇరకాటంలో పడేస్తాయి. తెరపై దృశ్యాలు మారుతూ పోతుంటాయి .. ఇంకా ఏమైనా జరగకపోతుందా అనే ఒకే ఒక్క ఆశతో ప్రేక్షకులు చివరివరకూ చూస్తారు.

విక్రమ్ .. పృథ్వీ రాజ్ .. ఎస్ జె సూర్య .. సీనియర్ ఆర్టిస్టులు. వాళ్ల నటన గురించి ఆడియన్స్ కి తెలుసు. కాకపోతే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఆ పాత్రలలో విషయం లేదు. థేని ఈశ్వర్ ఫొటోగ్రఫీ .. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. ప్రసన్న ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది.