కమెడియన్‌గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి ఇటీవల 'కోర్టు' సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. కమెడియన్‌గా నటిస్తూనే మరోవైపు హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న ప్రియదర్శి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'సారంగపాణి జాతకం'. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జాతకం ఎలా ఉందో..సారంగపాణి జాతకం ఎలాంటి కథాంశం? ఈ చిత్రంలో ప్రేక్షకులను మెప్పించే అంశాలున్నాయా? లేదా తెలుసుకోవాలంటే ఈ చిత్రం జాతకంలోకి అదేనండి.. రివ్యూలోకి వెళ్లాల్సిందే..

కథ: చిన్నప్పటి నుంచి జాతకాలను నమ్మే సారంగపాణి  (ప్రియదర్శి) ఓ కార్ల షోరూమ్‌లో సేల్స్‌మేన్‌గా పనిచేస్తుంటాడు. అక్కడే పనిచేస్తున్న షోరూమ్‌ మేనేజర్‌ మైథిలి (రూపా కొడవయార్‌) ని ప్రేమిస్తాడు. ఇరువైపుల పెద్దలు అంగీకరించడంతో నిశ్చితార్థం జరుపుకుంటారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే అనుకోకుండా జిగేశ్వరనంద్‌ (శ్రీనివాస్‌ అవసరాల) సారంగపాణి చేతి రేఖలు చూసి నీచేతి రేఖల్లో 'నువ్వు ఓ వ్యక్తిని మర్డర్‌ చేస్తావని ఉంది'  అని చెబుతాడు.

పెళ్లి తరువాత తన వల్ల తన ప్రేయసికి ఎలాంటి సమస్యలు రాకూడదని పెళ్లి వాయిదా వేస్తాడు? అంతేకాదు పెళ్లికి ముందే తన ప్రమేయంతో తను ఈజీగా తప్పించుకునేలా ఓ మర్డర్‌ చేసి, దానితో తనకు సంబంధం లేదని అనిపించుకున్న తరువాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అవుతాడు. అయితే సారంగపాణి ఎవరిని మర్డర్‌ చేయాలనుకుంటాడు? మైథిలికి, సారంగపాణికి మధ్య జరిగిందేమిటి? వ్యాపారవేత్త అయినా అహోబిల్‌ రావు (తనికెళ్ల భరణి)ను సారంగపాణి ఎందుకు కలవాల్సి వచ్చింది? సారంగపాణి మర్డర్‌ చేశాడా? అసలు జరిగిందేమిటి తెలుసుకోవాలంటే సినిమా చూసి తెలుసుకోవాలి... 

విశ్లేషణ: జీవితం మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది అంటూ జాతకాలు నమ్మే యువకుడి కథ చుట్టూ, ఓ మర్డర్‌ థ్రిల్లర్‌ అంశాన్ని జోడించి ఈ కథను అల్లుకున్నారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అయితే వినోదాన్ని ఆకట్టుకునేలా రాసుకోవడంలో మోహనకృష్ణలో ఉన్న ప్రతిభ ఈ సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. ఆయన మార్క్‌ ఆఫ్‌ కామెడీతో ప్రతి సన్నివేశాన్ని ఎంతో జనరంజకంగా తీర్చిదిద్దాడు. ప్రతి సన్నివేశంలో ఎంతో హిలేరియస్‌ ఫన్‌ను క్రియేట్‌ చేయగలిగాడు. ముఖ్యంగా సినిమాలో సంభాషణలు హిలేరియస్‌గా ఉంటాయి. ప్రతి పంచ్‌కు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. ముఖ్యంగా కథలోని క్యారెక్టర్లు పండించే కామెడీని రాసుకోవడంలో ఆయన ఎంతో సక్సెస్‌ అయ్యాడు. 

ఫస్ట్‌హాఫ్‌ హిలేరియస్‌ కామెడీతో కొనసాగితే.. సెకండాఫ్‌ మిడిల్‌లో కాస్త తడబడినట్లుగా అనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్‌, పతాక సన్నివేశాల్లో నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండటంతో సినిమా హిలేరియస్‌ కామెడీతోనే ఎండ్‌ అవుతుంది. చాలా రోజుల తరువాత సిట్యుయేషనల్‌ కామెడీతో, డీసెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ చిత్రంలో చూడొచ్చు. ముఖ్యంగా చైనీస్‌ వంటకాలు, మింగ్‌ చావ్‌, చెడిపో వంటి పద ప్రయోగాలు ఆడియన్స్‌ను నవ్వించాయి. అయితే జాతకాన్ని మరీ అంత గుడ్డిగా నమ్ముతూ ఓ వ్యక్తిని చంపాలని, ఈ కారణంతో తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని హీరో అనుకోవడం అనేది పెద్దగా కన్వీన్సింగ్‌ అనిపించదు. 

అయితే ఇలాంటి వాళ్లు కూడా ఉంటే అనే ఊహ నుంచి అల్లుకున్న కల్పితకథతో ఇంద్రగంటి నుంచి పుట్టిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. దాదాపు ఈ చిత్రంలో ప్రతి ఏపిసోడ్‌ ఆడియన్స్‌ను నవ్విస్తుంది. సెకండాఫ్‌లో హోటల్‌లో జరిగే సన్నివేశాలు, చావు ఇంట్లో చిన్న పిల్ల చేతిలో హీరో కేకు లాక్కునే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. యూత్‌ కనెక్ట్‌ అయ్యే వినోదం కూడా ఈ చిత్రంలో ఉండటం మరో ఎస్సెట్‌. 

నటీనటుల పనితీరు: ఇటీవల కోర్టు సినిమాలో లాయర్‌గా సీరియస్‌ పాత్రలో  కనిపించిన ప్రియదర్శి, ఈ చిత్రంలో సారంగపాణిగా చక్కని నటన కనబరిచాడు. తన నటనతో నవ్వులు పూయించాడు. వెన్నెల కిషోర్‌ పంచ్‌లు, ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌ అలరిస్తాయి. హర్ష చెముడు కూడా హోటల్‌ చెఫ్‌గా, స్నేహితుడిగా వినోదాన్ని పంచాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో దర్శకుడు ప్రతి పాత్రను డిజైన్‌ చేసిన విధానం బాగుంది. 

హీరోయిన్‌గా రూపా కొడువాయిర్‌ తన నటనతో ఆకట్టుకుంది. తనికెళ్ల భరణి అవసరాల శ్రీనివాస్‌, నరేష్‌, శ్రీనివాస్‌, వడ్లమాని రూప లక్ష్మీ తమ పాత్రలో రాణించారు. పీజీ విందా ఫోటోగ్రఫీ కథ మూడ్‌ను క్యారీ చేసింది. నేపథ్య సంగీతం సన్నివేశానికి ప్లస్‌ కాకపోయినా, ఆ సీన్‌ను ఇబ్బందిపెట్టే విధంగా మాత్రం లేదు. 

జాతకాలు నమ్మే ఓ యువకుడి పాత్ర చుట్టూ అల్లుకున్న కథతో ఇంద్రగంటి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాడు. ప్రతి సన్నివేశంలో కడుపుబ్బ నవ్వించే కామెడీ ఉన్న ఈ చిత్రం ఈ వేసవికి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునే ఆడియన్స్‌కు 'సారంగపాణి జాతకం' పూర్తి స్థాయిలో సంతృపినిస్తుంది. తప్పనిసరిగా అందరూ కుటుంబంతో చూసి ఎంజాయ్‌ చేయాల్సిన సినిమా ఇది. వేసవి సెలవులు కావడం కూడా  కమర్షియల్‌గా సారంగపాణి జాతకం సినిమాకు కలిసొచ్చే అంశం. సారంగపాణి జాతకం వసూళ్ల పరంగా కూడా దివ్యంగా ఉన్నట్లే...