హన్సిక గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అయితే ఆమె హారర్ థ్రిల్లర్ జోనర్ లోను ఆడియన్స్ ను మెప్పించే పాత్రలను పోషించింది. అలా ఆమె తమిళంలో చేసిన మరో సినిమానే 'గార్డియన్'. క్రితం ఏడాది మార్చి 8వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అలాంటి ఈ  సినిమా నిన్నటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆశించిన స్థాయిలో ఈ సినిమా భయపెట్టిందా లేదా? అనేది ఒకసారి చూసేద్దాం. 

కథ: అపర్ణ (హన్సిక) చిన్నప్పటి నుంచి తాను చాలా దురదృష్టవంతురాలినని అనుకుంటూ ఉంటుంది. అందుకు కారణం ఆమెకి ఎదురవురవుతూ వచ్చిన సంఘటనలే. ఆమె ఏది అనుకున్నా అది జరగకుండా పోతుంటుంది. ఏది ఇష్టపడినా అది దక్కకుండా పోతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకి ఒక రోజున ఒక అరుదైన 'రాయి' దొరుకుతుంది. అప్పటి నుంచి ఆమె ఏది కోరుకుంటే అది జరుగుతూ ఉంటుంది. 

మంచి అయినా .. చెడు అయినా అపర్ణ కోరుకోగానే ఆమె కళ్లముందే అది జరిగిపోతూ ఉంటుంది. అందుకు కారణం ఏమై ఉంటుందా అని తీవ్రంగా ఆలోచించిన ఆమెకి ఆ 'రాయి' సంగతి గుర్తుకు వస్తుంది. ఆ రాయికి .. ఒక ప్రేతాత్మకి సంబంధం ఉందనే విషయం ఆమెకి తెలియదు. ఆ ప్రేతాత్మ కూతురు ప్రమాదంలో ఉందనే విషయం కూడా అపర్ణకి తెలియదు. నలుగురు వ్యక్తులపై పగ తీర్చుకునే అవకాశం కోసం ఆ ప్రేతాత్మ ఎదురుచూస్తుందనే సంగతి కూడా ఆమెకి తెలియదు. 

ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, ఎవరైతే ఆ రాయిని పగలగొడతారో వారు మరణిస్తారు. ఈ విషయం తెలియని అపర్ణ ఆ రాయిని పగలగొడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రేతాత్మగా మారింది ఎవరు? ప్రేతాత్మచే తరమబడుతున్న నలుగురు వ్యక్తులు ఎవరు? తన కూతురును కాపాడుకోవడానికి ప్రేతాత్మ చేసే ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని అలా పక్కన పెడితే, దెయ్యాల సినిమాలు చూడటానికి మాత్రం చాలామంది ఆసక్తిని చూపుతుంటారు. ఎవరు ఎలా దెయ్యంగా మారినా వారి అంతిమ లక్ష్యం ప్రతీకారం తీర్చుకోవడమే. తాము బ్రతికి ఉన్నప్పుడు ఇబ్బందిపెట్టినవారిని భయపెట్టి చంపేసి .. వాళ్లని కూడా దెయ్యాలుగా మార్చడమే. ఈ కాన్సెప్ట్ కి ఏ మాత్రం ఇటు అటు కాని సినిమానే ఇది.

సాధారణంగా దెయ్యాలను గాజు సీసాలలో బంధించడమే ఇంతకాలంగా చూస్తూ వచ్చాము. ఈ సినిమాలో ప్రేతాత్మను రంగురాయిలో బంధిస్తారు. అదే ఈ సినిమాలోని కొత్తదనం అనుకుని ఉంటారు. కానీ అక్కడే ఈ సినిమా కనెక్ట్ కాకుండాపోయింది. ప్రేతాత్మగా మారడం .. కథానాయికను ఆవహించడం .. రివేంజ్ తీర్చుకోవడం ఇవన్నీ కూడా ఇంతకుముందు వచ్చిన సినిమాలలో మనం చూసినవే. కాకపోతే ఆర్టిస్టులు వేరుగదా అని సరిపెట్టుకోవాలి అంతే.   
 
 సాధారణంగా కథలో ఏదైతే కీలకమైన అంశంగా ఉంటుందో .. దానిని ఆధారంగా చేసుకుని టైటిల్ ను సెట్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడో సినిమా చివర్లో వచ్చే ఒక చిన్న సీన్ ను దృష్టిలో పెట్టుకుని టైటిల్ ను సెట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. బహుశా టైటిల్ కి తగినంత మేటర్ కథలో లేదని వాళ్లకి కూడా అనిపించేదేమో. 

పనితనం: దెయ్యం పాత్రకి హన్సికను ఎందుకు తీసుకున్నారు అంటే, ఇంతకుముందు ఒకటి రెండు సినిమాలు ఈ జోనర్లో చేయడం వలన అనే చెప్పుకోవాలి. ఆ అనుభవం వలన ఈ సినిమాలోను బాగానే చేసింది. మిగతా పాత్రలన్నీ భయపడటమే కాబట్టి .. అందుకు పెద్దగా నటన అవసరం లేదనే అనుకోవలసి ఉంటుంది. 

హారర్ సినిమాలలో ప్రధానంగా భయపెట్టేవి ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. శక్తివేల్ ఫొటోగ్రఫీ .. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం ఆ స్థాయిలో లేవు గానీ .. ఫరవాలేదని మాత్రం చెప్పచ్చు. త్యాగరాజన్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది అంతే.

ముగింపు: రొటీన్ గా అనిపించే కథాకథనాలతో కూడిన ఈ సినిమాను హన్సిక ఎలా ఓకే చేసిందో తెలియదు. భయపడే ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ అన్నట్టుగా అక్కడక్కడా కాస్త కామెడీ టచ్ కూడా ఇచ్చారు. కాకపోతే దానికంటే భయపడటమే బాగుందనిపిస్తుంది. కథలో దెయ్యం భయపెట్టడం వేరు .. కానీ బలహీనమైన కథనే భయపెట్టడానికి ప్రయత్నిస్తే .. ఇలాగే ఉంటుంది మరి.