కోలీవుడ్ కూడా హారర్ థ్రిల్లర్ జోనర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడంలో పోటీ పడుతూ ఉంటుంది. కథాపరంగా .. సాంకేతిక పరంగా ఎంతమాత్రం తగ్గకుండా ఆడియన్స్ ను అలరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా తమిళంలో రూపొందిన సినిమానే 'అకాలి'. క్రితం ఏడాది మే 31వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ ఆడియన్స్ ను ఎంతవరకూ భయపెట్టిందనేది చూద్దాం. 

కథ: ఈ కథ 2016 - 2023 మధ్య కాలంలో నడుస్తుంది. హజామ్ రెహ్మాన్ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. ఆ సిటీలోని సమాధులను రాత్రి వేళలో తవ్వుతున్నారనీ, శవాలు మాయం చేస్తున్నారనే కేసులు ఎక్కువవుతూ ఉంటాయి. ఇక మరో వైపున డ్రగ్స్ .. చేతబడులు ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మంత్రాలు .. యంత్రాలు .. పుర్రెలు పోలీసులను సైతం భయపెడుతూ ఉంటాయి. 

ఈ నేపథ్యంలోనే అనిత అనే యువతి దెయ్యం పట్టినట్టుగా చిత్రంగా ప్రవహిస్తూ ఉంటుంది. జాన్స్  అనే యువతి అదృశ్యమవుతుంది. పోలీస్ ఆఫీసర్ సెల్వన్ కూడా ఏదో ఆవహించినట్టుగా ప్రవర్తిస్తూ, తన భార్యను హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు. నగరంలో జరిగిన 6 హత్యలతో, కనిపించకుండా పోయిన జాన్స్ ప్రమేయం ఉందని తెలిసి హజామ్ షాక్ అవుతాడు. ఈ విషయంలో ఫాదర్ (నాజర్) ను కలుసుకున్న అతనికి సరైన సమాధానం మాత్రం దొరకదు.

జాన్స్ తో పరిచయమైన దగ్గర నుంచే అనిత ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆమె ఫ్రెండ్స్ యాస్మిన్ .. ఇజా .. గౌతమ్ పోలీస్ ఆఫీసర్ తో చెబుతారు. జాన్స్ వెనుక బలమైన హస్తం ఉందనీ, అతను ఎవరో .. అతని ఉద్దేశమేమిటో తెలుకోవాలని హజామ్ భావిస్తాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? జరుగుతున్న సంఘటనల వెనకున్న నేరస్థులు ఎవరు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: సమాధులు .. శవాలు మాయం కావడం .. డ్రగ్స్ అంటూ ఈ కథ చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఈ మూడు అంశాలు ఇంట్రెస్టింగ్ గా అనిపించేవే గనుక, ఏ పాయింట్ పై నడిచినా ఫాలో అయిపోదామని ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు. ఆ తరువాతనే అతనికి అర్థమవుతుంది .. ఈ కథలో 'చేతబడి- నరబలి' అనే మరో అంశం కూడా ఉందని. దాంతో ఆడియన్స్ ఈ కథేదో కాస్త గట్టిగానే ఉండేలా ఉందని ఉత్సాహం తెచ్చుకుంటారు. 

ఈ కథలో ప్రేక్షకులకు దొరికిన ఒకే ఒక ఆధారం ఒక పోలీస్ ఆఫీసర్. అసలేం జరుగుతుందనేది తెలుసుకోవడానికి అతను పరిగెడుతూ ఉంటాడు. ఏదో ఒకటి కనుక్కోలేకపోతాడా అని అతణ్ణి ఆడియన్స్ ఫాలో అవుతూ ఉంటారు. డ్రగ్స్ .. మర్డర్లు .. చేతబడి .. నరబలులు అనే అంశాలు తెరపైకి వచ్చి మాయమవుతూ ఉంటాయి. ఏది నిజం? దేనిని నమ్మాలి? అనే విషయంలో ఒక క్లారిటీ మాత్రం రాదు. పాత్రలు మాత్రం తెరపై నానా గందరగోళం చేస్తూ ఉంటాయి. 

కథ ఏదైనా .. అది ఏ కాలంలో జరుగుతున్నా సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా క్లారిటీగా చెప్పడమే ముఖ్యం. పాత్రల సంఖ్య పెంచేస్తూ .. సన్నివేశాల నిడివి పెంచేస్తూ వెళ్లడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. గందరగోళంలో నుంచి అసలు కథను వెతికి పట్టుకునే టాస్క్ ప్రేక్షకులకు ఇవ్వకూడదు. సరిగ్గా డిజైన్ చేయని పాత్రలు డీలాపడేలా చేస్తుంటే, పాతకాలం నాటి ట్విస్టులు మరింత నీరుగారుస్తాయి. 

పనితనం: ఈ కథలో నాజర్ .. జయకుమార్ .. స్వయం సిద్ధ ప్రధానమైన పాత్రలలో కనిపిస్తారు. ముఖ్యమైన పాత్రలు కొన్ని ఉన్నాయి. కానీ వాటిని సరిగ్గా రిజిస్టర్ కూడా చేయలేదు. ఆ పాత్రలను గురించే మిగతా పాత్రలు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాయి. కానీ ఆ పాత్రలు తెరపై కనిపించింది .. ప్రభావం చూపించింది చాలా తక్కువ. 

గిరి ఫోటోగ్రఫి .. అనీష్ మోహన్ నేపథ్య సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఇనయవన్ పాండియన్ ఎడిటింగ్ విషయానికి వస్తే, క్లైమాక్స్ తో సహా ట్రిమ్ చేయవల్సిన సన్నివేశాలు చాలానే కనిపిస్తాయి.
అలాగే కీలకమైన సందర్భాలకు సంబంధించిన సంభాషణలు అనువాదంలో సెట్ అయ్యేలా .. అర్థమయ్యేలా లేకపోతే కలిగే ఇబ్బంది, ఈ సినిమా విషయంలోను ఫేస్ చేయవలసి వస్తుంది.  

ముగింపు: అన్నిరకాల ఇంట్రెస్టింగ్ అంశాలు కలగలసిన కథ అనుకుంటా .. ఏదో ఒక లైన్ పట్టుకుని వెళ్లిపోదామని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ చివరికి వచ్చేసారి 1980ల నుంచి చూస్తూ వచ్చిన ఒక ట్విస్ట్ ఇచ్చేసి, పాత్రలన్నీ మాయమైపోతాయి. ప్రేక్షకుడి పాత్ర మాత్రం తేరుకోవడానికి  .. కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందంతే.