హిందీలో కమింగ్ ఏజ్ ఆఫ్ డ్రామా జోనర్లో రూపొందిన సినిమానే 'సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్'. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఈ సినిమాను థియేటర్లకు తీసుకుని వచ్చారు. రీమా కగ్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆదర్శ్ గౌరవ్ ప్రధానమైన పాత్రను పోషించాడు. 2008 వచ్చిన 'సూపర్ మ్యాన్ ఆఫ్ మాలేగావ్' అనే డాక్యుమెంటరీ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ నెల 25వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: ఈ కథ 1990లలో మొదలవుతుంది. 'మాలేగావ్' అనే టౌన్లో నాసిర్ (ఆదర్శ్ గౌరవ్) వీడియోగ్రఫర్ గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే వీడియో కేసెట్లు కూడా రెంట్ కి ఇస్తూ ఉంటాడు. అయితే అతనికి సినిమా డైరెక్టర్ కావాలనే ఒక కోరిక బలంగా ఉంటుంది. తండ్రి రెంట్ కి తీసుకుని నడిపిస్తున్న థియేటర్ కొన్ని కారణాల వలన మూసివేయవలసి వస్తుంది. అందుకు తానే కారణమవడం అతనికి బాధను కలిగిస్తుంది.  

నాసిర్ మల్లిక (రిద్ధి కుమార్)ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆమెనే పెళ్లిచేసుకోవాలనుకుంటాడు. పెద్దగా చదువుకోని అతనికి మల్లికను ఇవ్వడానికి ఆమె తండ్రి ఒప్పుకోడు. ఆమెకి మరొకరితో వివాహమై పోవడంతో, జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల అతనిలో పెరుగుతుంది. తన ఊళ్లో ఒక సినిమాను తీసి, దర్శకుడిగా తన 'కల'ను నిజం చేసుకోవాలని భావిస్తాడు. తన స్నేహితులలో నటన పట్ల .. రచన పట్ల .. సినిమాల పట్ల ఆసక్తి కలిగినవారు ఉండటం వలన, వాళ్లను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు.

నాసిర్ కి సహకరించడానికి ఫరోగ్ (వినీత్ కుమార్) షఫీక్ (శశాంక్ అరోరా) అక్రమ్ (అనూజ్ సింగ్) అంగీకరిస్తారు. అందుబాటులో ఉన్న పాత వస్తువులనే ఉపయోగించుకుంటూ, 'షోలే' సినిమా కథను స్పూఫ్ కామెడీగా తెరకెక్కిస్తారు. తమ ఊళ్లో మాత్రమే  రిలీజ్ చేస్తారు. ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. నాసిర్ కి డబ్బుతో పాటు పేరు వస్తుంది. అప్పుడు స్నేహతుల మధ్య ఎలాంటి మనస్పర్థలు తలెత్తుతాయి? వాటి ఫలితం ఎలా ఉంటుంది? అనేది కథ.

విశ్లేషణ: జీవితంలో కష్టపడకుండా పైకి వచ్చినవారెవరూ ఉండరు. సక్సెస్ సాధించిన ప్రతి ఒక్కరిలోను ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే విజయాన్ని సాధించిన తరువాత, మూలాలు చాలా తక్కువ మందికి మాత్రమే గుర్తుంటాయి. ఆ మూలలను గుర్తుచేసుకునేవారు విజయాలను కొనసాగిస్తూ వెళతారు. మర్చిపోయినవారు ఏదో ఒక రోజున మళ్లీ వెనక్కివస్తారు. అప్పుడైనా వదిలేసినా మూలలను వెంటబెట్టుకుని వెళ్లమనే కాలం చెబుతూ ఉంటుంది. 

ఇలాంటి ఒక విషయాన్ని సందేశాత్మకంగా రూపొందించిన సినిమానే ఇది. డబ్బు .. పేరు ఈ రెండూ కూడా, అప్పటివరకూ కలిసి ప్రయాణం చేసినవారి నుంచి వేరు చేస్తాయి. విజయాన్ని సాధించినవారు అహంభావంతో తనవారికి దూరమైతే, ఆ విజయానికి అసూయ చెందినవారు తమంతట తాముగా దూరమవుతూ ఉంటారు. ఎవరి స్థాయిని వారు తెలుసుకుని .. ఎవరి టాలెంట్ ను వారు గుర్తించడంలోనే నిజమైన సక్సెస్ ఉంటుందని నిరూపించిన కంటెంట్ ఇది. 

పనితీరు: దర్శకుడు ప్రధానమైన పాత్రలను తీర్చిదిద్దిన తీరు బాగుంది. సహజత్వానికి చాలా దగ్గరగా ఆయన ఈ పాత్రలను తీసుకుని వెళ్లగలిగాడు. స్నేహితుల మధ్య మనస్పర్థలు .. గొడవలు .. రాజీలు మొదలైన సన్నివేశాలు కంటెంట్ ను మరింత వేగంగా ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తాయి. యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన కథ కావడం వలన, మన కళ్లముందు జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు జీవం పోశారు. స్వప్నిల్ ఫొటోగ్రఫీ .. సచిన్ - జిగర్ సంగీతం .. ఆనంద్ ఎడిటింగ్ కథకు తగినట్టుగానే కనిపిస్తాయి.
 
ముగింపు: విజయం వలన పేదరికం దూరం కావాలి .. అప్పటివరకూ ఉన్న అనుబంధాలు కావు. ఒకవేళ అలాంటి పరిస్థితులు తలెత్తితే, సామరస్యంతో పరిష్కరించుకోవాలి. విజయం వలన తలెత్తే అహంభావానికి వినయానికి మించిన విరుగుడు లేదు అనే సందేశాన్ని అందించే సినిమా ఇది. 1990లలో మొదలయ్యే కథ .. స్ఫూర్తిని కలిగించే కథ కావడం వలన ఓ లుక్కు వేయవచ్చు.