బాలీవుడ్లో యాక్షన్ థ్రిల్లర్ సినిమాల జోరు ఎక్కువ. ఈ జోనర్ నుంచి రీసెంటుగా 'నెట్ ఫ్లిక్స్'కి వచ్చిన సినిమానే 'జువెల్ తీఫ్'. సైఫ్ అలీఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీకి వచ్చింది. ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కుకీ గులాటీ .. రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, సిద్ధార్థ్ ఆనంద్ - మమతా ఆనంద్ నిర్మాతలుగా వ్యవహరించారు.
కథ: రెహాన్ రాయ్ (సైఫ్ అలీఖాన్) కుటుంబ సంబంధమైన కొన్ని కారణాల వలన గజదొంగగా మారతాడు. నిజాయితీపరుడైన తండ్రితో గెంటివేయబడిన కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఉంటాడు. విదేశాలలో ఉంటున్న అతణ్ణి రాజన్ ( జైదీప్ అహ్లావత్) ఇండియాకి రప్పిస్తాడు. 'రెడ్ సన్' అనే డైమండ్ ను దొంగిలించి తనకి అప్పగించవలసిన బాధ్యతను రెహాన్ కి అప్పగిస్తాడు.
'రెడ్ సన్' .. ఆఫ్రీకకి చెందిన అత్యంత ఖరీదైన వజ్రం. దాని విలువ 500 కోట్లకి పైన ఉంటుంది. 18 వ శతాబ్దం నుంచి ఆ డైమండ్ ను రాజవంశీకులు కాపాడుతూ వస్తుంటారు. ఆ డైమండ్ కొన్ని రోజుల పాటు 'ముంబై'లోని మ్యూజియంలో ఉండనుంది. ఆ బిల్డింగ్ లో నుంచి ఆ డైమండ్ ను కాజేయాలని రాజన్ చెబుతాడు. తన ఫ్యామిలీ రాజన్ కారణంగా ప్రమాదంలో ఉందని తెలుసుకున్న రెహాన్ అందుకు అంగీకరిస్తాడు. అయితే అందులో సగం వాటా తనకి దక్కాల్సి ఉంటుందని చెబుతాడు.
ముంబైకి చేరుకున్న ఆ డైమండ్ ను కాజేయడానికి రెహాన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటాడు. తాను ఎలా ఆ డైమండ్ ను కాజేయనున్నది రాజన్ కి చెబుతాడు. చాలా రోజులుగా రెహాన్ ను అరెస్టు చేయాలనే పట్టుదలతో అతనిని గాలిస్తూ ఉన్న పోలీస్ ఆఫీసర్ విక్రమ్, డైమండ్ దొంగతాన్ని ముందుగానే పసిగడతాడు. అది తెలియని రెహాన్, తాను వేసిన ప్లాన్ ప్రకారం ఆ బిల్డింగ్ లోకి అడుగుపెడతాడు. అక్కడ ఏం జరుగుతుంది? అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది మిగతా కథ.
విశ్లేషణ: వందల కోట్ల ఖరీదు చేసే డైమండ్, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆ డైమండ్ చేతులు మారవలసి ఉంటుంది. ఇక్కడి డాన్ ఆ పనిని హీరోకి అప్పగిస్తాడు. హీరో ఆ పనిని ఎలా చేస్తాడు? ఈ విషయంలో తనకి ఎదురైన అవాంతరాలను ఎలా అధిగమిస్తాడు? అనే టెన్షన్ ను ఆడియన్స్ లో రేకెత్తిస్తూ సాగే కంటెంట్ ఇది.
గతంలో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి గదా. ఇందులో ఏదో కొత్తదనం ఉండే ఉంటుంది. కొత్త పాయింట్ లేకుండా పాత కథనే పట్టుకుని వస్తారా? కథలో ఎక్కడో ఓ మలుపు .. ఓ మెలిక ఉండే ఉంటాయి. లేకపోతే ఈ స్థాయిలో ఖర్చు పెడతారా? అని అనుకోవడం సహజం. అయితే కొన్ని సినిమాలను చూస్తూ, పాత సినిమాలను గుర్తుచేసుకోకూడదు. 'గతం గతః' అనుకుంటేనే తప్ప ఈ కథను ఫాలో కాలేము.
అటు చరిత్ర .. ఇటు ఖరీదు కలిగిన డైమండ్ ను కొట్టేయడానికి హీరో వేసే ప్లాన్ .. తప్పించుకునే తీరు ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించే అసలైన అంశాలు. ఇటు తనని తాను కాపాడుకోవడం .. అటు ఫ్యామిలీని హీరో సేవ్ చేయడం, యాక్షన్ కీ .. ఎమోషన్స్ కి మధ్య లో ఘాటైన రొమాన్స్ ను ఆడియన్స్ ఆశిస్తారు. కానీ వీటన్నిటికీ దూరంగా ఈ కథ నడుస్తుంది. అది కూడా నిదానంగా .. నింపాదిగా.. నీరసంగా.
పనితనం: దర్శకుడు ఎంచుకున్న ఈ కథలో బడ్జెట్ కనిపిస్తుంది .. భారీతనం కనిపిస్తుంది. కానీ కనుచూపు మేరలో కొత్తదనం మాత్రం కనిపించదు. లవ్ .. రొమాన్స్ కి తగిన సమయం హీరోకిలేదు. అలాంటప్పుడు యాక్షన్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉండేలా డిజైన్ చేసుకోవాలి. అలాగే ఎమోషన్స్ బలంగా ఉండేలా చూసుకోవాలి. ఆ విషయాలను అంతగా పట్టించుకోకపోవడం నిరాశను కలిగిస్తుంది.
సైఫ్ అలీ ఖాన్ - జైదీప్ అహ్లావత్ .. పాత్రలపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. పోలీస్ ఆఫీసర్ పాత్ర కాస్త హడావిడి చేస్తుంది అంతే. పాత్రలను డిఫరెంట్ గా డిజైన్ చేయకపోవడం వలన, వాటికి కనెక్ట్ కావడానికి ఆడియన్స్ నానా కష్టాలు పడవలసి వస్తుంది. జిష్ణు ఫొటోగ్రఫీ .. సచిన్ - జిగర్ సంగీతం .. ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ ఫరవాలేదు.
ముగింపు: సాధారణంగా భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాల నుంచి ఒక రేంజ్ యాక్షన్ ను .. బలమైన ఎమోషన్స్ ను ఆడియన్స్ ఆశిస్తారు. హీరో చేసే సాహసోపేతమైన పనులు .. వీరోచిత విన్యాసాలను ఊహించుకుంటారు. అలాంటి ఉత్సాహంతో టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులను ఏ మాత్రం థ్రిల్ చేయలేకపోయిన సినిమా ఇది.
'జువెల్ తీఫ్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

Jewel Thief Review
- నేరుగా ఓటీటీకి వచ్చిన 'జువెల్ తీఫ్'
- రొటీన్ గా అనిపించే కథాకథనాలు
- థ్రిల్ చేయలేకపోయిన సన్నివేశాలు
- నిరాశపరిచే కంటెంట్
Movie Name: Jewel Thief
Release Date: 2025-04-25
Cast: Saif Ali Khan, Jaideep Ahlawat, Nikita Dutta,Kunal Kapoor
Director: Kookie Gulati - Robbie Grewal
Music: Sachin–Jigar
Banner: Marflix Pictures
Review By: Peddinti
Jewel Thief Rating: 2.00 out of 5
Trailer