నవీన్ చంద్ర హీరోగా రూపొందిన హారర్ థ్రిల్లర్ చిత్రమే '28 డిగ్రీస్ సెల్సియస్'. కరోనా ముందు రావలసిన ఈ సినిమా, ఆ తరువాత కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 4వ తేదీన థియేటర్లకు వచ్చింది. అయితే పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, ఆడియన్స్ ఫోకస్ లోకి ఈ సినిమా రాలేదు. అలాంటి ఈ సినిమా నెల తిరగక ముందే సైలెంట్ గా 'అమెజాన్ ప్రైమ్' లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా కథేమిటనే సమీక్షలోకి ఒకసారి వెళదాం. 

కథ: కార్తీక్ (నవీన్ చంద్ర) అంజలి ( షాలిని) మెడికల్ కాలేజ్ లో చదువుతూ ఉండగానే వాళ్ల పరిచయం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ కి చేరుకునే సరికి వారి పరిచయం కాస్తా ప్రేమగా మారిపోయి, పెళ్లివరకూ వెళుతుంది. కార్తీక్ అనాథ కావడం వలన .. అతని కులం వేరు కావడం వలన షాలినీ పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకోరు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా ఆమె అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. 

అదే సమయంలో ఆమెకి గల ఒక అరుదైన వ్యాధి బయటపడుతుంది. 28 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలోకి ఆమె వెళితే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసి కూడా కార్తీక్ ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమెకి సంబంధించిన మెరుగైన ట్రీట్మెంట్ 'జార్జియా'లో ఉందని తెలిసి అక్కడికి తీసుకుని వెళతాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఒక ఇంట్లో అద్దెకి దిగుతారు. అంజలికి సంబంధించిన టెస్టులు జరుగుతూ ఉంటాయి. 

అంజలికి పక్కింటి అమ్మాయి 'గీత'తో పరిచయం ఏర్పడుతుంది. కార్తీక్ కి 'సమీరా'తో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే కార్తీక్ ఇంట్లో ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? అందుకు కారకులు ఎవరు? ఆ సంఘటనతో అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: అరుదైన వ్యాధితో బాధపడే హీరోయిన్ .. అయినా ఆమెను పెళ్లాడిన హీరో. ఆమె ట్రీట్మెంట్ కోసం ఫారిన్ ప్రయాణం. అక్కడ వారికి ఎదురైన అనూహ్యమైన సంఘటనల చుట్టూ అల్లుకున్న కథ ఇది. హీరోయిన్ కి గల అరుదైన వ్యాధిని గురించి ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది. కాకపోతే ఇలా కథ మొదలుకాగానే అలా ఆ విషయం చెప్పేశారు. దాంతో ఇక హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్ ను ప్రేక్షకుడు ఎంజాయ్ చేయలేడు. 

ఇక చాలామందికి హాస్పిటల్ వాతావరణం అంటే ఒక తెలియని భయం ఉంటుంది. ఏదైనా ఒక వ్యాధి లక్షణం గురించి టీవీలో డాక్టర్ చెబుతూ ఉంటేనే, 'ఆల్రెడీ ఈ లక్షణాలన్నీ మనకి ఉన్నాయే' అనుకునేవారు ఎక్కువగా ఉంటారు. ఆ స్వభావం కారణంగా, హాస్పిటల్ .. స్ట్రెచర్స్ .. ఆపరేషన్ థియేటర్స్ .. స్కానింగులు .. రిపోర్టులు వంటి వాటిపట్ల పెద్దగా ఆసక్తిని కనబరచరు. అయితే ఈ సినిమాలో ఈ తంతు ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది.

ఇక సెకండాఫ్ చివర్లో దర్శకుడు సస్పెన్స్ ను .. హారర్ ను కలిపి అందించడానికి ప్రయత్నించాడు. నిజం చెప్పొద్దూ .. వైవా హర్ష .. ప్రియదర్శి ద్వారా కామెడీ టచ్ ఇవ్వడానికి కూడా ట్రై చేశాడుగానీ కుదరలేదు. చివర్లో ఒక ట్విస్ట్ ఉంటుంది .. అది ఫరవాలేదు. కాకపోతే అప్పటివరకూ నడిచిన కథను ఓపికతో చూడటమే కొంచెం కష్టం. తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో రూపొందించిన సింపుల్ కంటెంట్ గానే ఈ సినిమాను గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది.        

పనితీరు: బడ్జెట్ పరంగా .. పాత్రల పరంగా చూసుకుంటే దర్శకుడు ఎంచుకున్న లైన్ ఆసక్తికరమైనదే. అయితే లవ్ .. రొమాన్స్ విషయంలో ఫీల్ వర్కౌట్ చేయకపోవడం, సస్పెన్స్ - హారర్ ఎలిమెంట్స్ విషయంలో ఉత్కంఠను రేకెత్తించకపోవడం ఆడియన్స్ కి నిరాశను కలిగిస్తుంది. సన్నివేశాలన్నీ కూడా తేలిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగనుందా అనే ఒక ఉత్కంఠను ప్రేక్షకులు మిస్సవ్వుతూ ఉంటారు.  

లైన్ కాస్త కొత్తగానే అనిపించినా టేకింగ్ .. స్క్రీన్ ప్లే నిరాశపరుస్తాయి. వంశీ పచ్చిపులుసు ఫొటోగ్రఫీని ప్రత్యేకమైన ఆకర్షణగానే చెప్పుకోవచ్చు. శ్రావణ్ భరద్వాజ్ బాణీలు .. శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రంగా సాగుతాయి. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ ఫరవాలేదు.  ప్రధానమైన పాత్రలలోని ఆర్టిస్టులంతా బాగా చేశారు.

ముగింపు: కథ ఆరంభంలోనే హీరోయిన్ జబ్బుపడటం .. హాస్పిటల్ వాతావరణం మైనస్ అనే చెప్పాలి. సస్పెన్స్ .. హారర్ తో కూడిన సన్నివేశాలు ఆశించిన స్థాయిలో ఆసక్తిని రేకెత్తించలేకపోయాయి. ఫైనల్ ట్విస్ట్ కి కాసిన్ని ఎక్కువ మార్కులు ఇచ్చి చూసుకుంటే, ఈ సినిమా ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.