తమిళంలో అరుళ్ నిధి ప్రధానమైన పాత్రగా 'ఆరత్తు సీనం' సినిమా తెరకెక్కింది. అరివాజగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2016లో థియేటర్లకు వచ్చింది. అప్పట్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు 'గరుడ 2.0' టైటిల్ తో తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఐశ్వర్య రాజేశ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమా కథేమిటనేది చూద్దాం. 

కథ: ఒకప్పుడు ఏసీపీ అరవింద్ (అరుళ్ నిధి) అంటే నేరస్థులకు .. వాళ్లకి సహకరించే అవినీతి అధికారులకు హడల్. అలాంటి అరవింద్ ఇప్పుడు తన ఉద్యోగానికి దూరమవుతాడు. 'బార్' లోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. తాగుడికి బానిసైన అతని గురించి తల్లి ఆందోళన చెందుతూ ఉంటుంది. అరవింద్ ధోరణి పట్ల అతని తమ్ముడు అర్జున్ అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. 

అరవింద్ అలా ఉండటానికి కారణం, అతని భార్యాబిడ్డలు అత్యంత దారుణంగా హత్య చేయబడటమే. వాళ్లని తలచుకుంటూ .. నిరాశ నిస్పృహల మధ్య అతను కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ కేసును అరవింద్ కి అప్పగించడం వలన, అతను గతాన్ని మరిచిపోవడం జరుగుతుందని పై అధికారిగా జేసీ (రాధారవి) భావిస్తాడు. మొత్తానికి అరవింద్ ను ఒప్పిస్తాడు. 

సీరియల్ కిల్లర్ కేవలం మగవారిని మాత్రమే టార్గెట్ చేయడం .. శుక్రవారం మాత్రమే కిడ్నాప్ చేయడం .. ఆదివారం రోజున శవం బయటపడేలా చేయడం అరవింద్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందరినీ ఒకేలా చంపేసి వ్రేళ్లాడదీయడం .. అర్థంకాని 'లిపి'లో వారి వంటిపై గాయాలు చేయడం ఆలోచింపజేస్తుంది. చనిపోయినవారి భార్యలపై పగతో హంతకుడు ఈ హత్యలకు పాల్పడుతున్నాడని గ్రహించిన అరవింద్, ఆ దిశగా కదులుతాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ. 

విశ్లేషణ: మంచివాడికి ఎక్కువమంది శత్రువులు ఉంటారనే ఒక సామెత ఉంది. నిజాయితీ పరులైన పోలీస్ ఆఫీసర్లకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పోలీస్ ఆఫీసర్ తన నిజాయితీ కారణంగా .. తన భార్యాబిడ్డలను కోల్పోవలసి వస్తుంది. అయినా ఆ బాధను పక్కన పెట్టి కొంతమంది అమాయకులను కాపాడటం కోసం అతను చేసే పోరాటమే ఈ కథ. చాలా రొటీన్ గా ఈ కథ మొదలవుతుంది. అయితే అంతే రొటీన్ గా ఎండ్ మాత్రం కాదు. మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ను ఈ కథ టచ్ చేస్తుంది. 

సాధారణంగా సీరియల్ కిల్లర్లు ఎవరి వలన తమకి అన్యాయం జరిగిందో వారిని వరుసగా చంపుకుంటూ వెళుతుంటారు. అలా కాకుండా కొంతమంది భార్యలపై ద్వేషంతో వారి భర్తలను టార్గెట్ చేయడం ఈ కథలోని కొత్త అంశం. హత్యకి గురైనవారి భార్యలతో హంతకుడికి గల పరిచయం ఏమిటి? వారిపై అతను ద్వేషం పెంచుకోవడానికి కారణం ఏమిటి? అనే అంశాలు ఈ కథలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. చివర్లోని ట్విస్ట్ ఈ కథకి ఇంకాస్త బలాన్ని చేకూర్చుతుంది.

పనితీరు: జీతూ జోసెఫ్ తయారు చేసుకున్న కథ ఇది. ఆయన తయారు చేసుకున్న ఈ కథలో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది. అయితే ఆ ఎపిసోడ్ వరకూ నడిచే కథ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. హీరో దిగాలుపడిపోయి తాగుతూ ఉండటం .. ఫ్లాష్ బ్యాక్ షాట్స్ అతణ్ణి తాగుడికి మరింత బానిసను చేయడం అసహనాన్ని కలిగిస్తుంది. ఫస్టాఫ్ లో ఈ నిడివి తగ్గిస్తే బాగుండేదని అనిపిస్తుంది.

అరవింద్ సింగ్ కెమెరా పనితనం .. రాజేశ్ కన్నన్ ఎడిటింగ్ ఫరవాలేదు. తమన్ అందించిన నేపథ్య సంగీతం, కథకి తగినట్టుగానే సాగుతుంది. అరుళ్ నిధి పాత్ర చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఆయన నటన హైలైట్ గా నిలుస్తుంది. మిగతా పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతూ ఉంటాయి.

ముగింపు: ఫస్టాఫ్ చాలా రొటీన్ గా కొనసాగుతుంది. సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. తొమ్మిదేళ్ల క్రితం థియేటర్లకు వచ్చిన సినిమా ఇది. అప్పుడు ఈ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా అనిపించవచ్చు. ఇప్పుడు మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ నుంచి చివరివరకూ మాత్రం బోర్ లేకుండా నడుస్తుంది.