బాడీ హారర్ జోనర్లో రూపొందిన న్యూజిలాండ్ ఇంగ్లిష్ మూవీనే 'గ్రాఫ్టెడ్'. క్రితం ఏడాది సెప్టెంబర్ 12వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. శాషా రెయిన్ బో దర్శకత్వం వహించాడు.   జెయేనా సన్ .. జెస్ హాంగ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, కొన్ని రోజుల క్రితం వరకూ రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ సినిమా సాధారణ స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

కథ: వి (జోయెనా సన్) తండ్రి ఒక సైంటిస్ట్. పుట్టుకతోనే అతని ముఖంపై ఒక రకమైన మచ్చలు ఉంటాయి. ఆ మచ్చల కారణంగా అతను కాస్త అందవికారంగా కనిపిస్తూ ఉంటాడు. తన మాదిరిగానే తన కూతురు ముఖంపై మచ్చలు రావడమే అతనికి బాధను కలిగిస్తూ ఉంటుంది. అందువల్లనే ఆ మచ్చలు పూర్తిగా కనిపించకుండా పోయేలా చేయాలనుకుంటాడు. అందుకోసం అనేక పరిశోధనలు చేస్తూ ఉంటాడు. ఆ పరిశోధన వికటించడం వల్లనే అతను చనిపోతాడు. 

తనని అందంగా చూడాలనుకున్న తన తండ్రి కోరికను ఆమె నిజం చేయాలనుకుంటుంది. తన తండ్రి రాసిన బుక్ ను భద్రంగా దాచుకుంటుంది. ఏ మాత్రం సమయం చిక్కినా దానిని పరిశీలిస్తూ ఉంటుంది. తనకి ఆశ్రయం ఇచ్చినవారి ఇంట్లో ఉంటూనే, తన పరిశోధనలు రహస్యంగా కొనసాగిస్తూ ఉంటుంది. తనకి ఆశ్రయం ఇచ్చినవారి అమ్మాయి ఏంజిలాతో పాటు ఆమె ఫ్రెండ్స్ తరచూ 'వి' రూపాన్ని అవమానిస్తూ ఉంటారు.

దాంతో వాళ్లందరిపై ఆమె కసి పెంచుకుంటుంది. తాను అందగత్తెగా మారాలనే పట్టుదల ఆమెలో పెరిగిపోతూ వస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఫలితంగా ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అందగత్తెగా మారిపోవాలనే ఆమె ప్రయత్నం ఫలిస్తుందా?  అనేది మిగతా కథ 

విశ్లేషణ: సాధారణంగా హారర్ థ్రిల్లర్ సినిమాలు అనగానే దెయ్యాలు .. భూతాలు భయపడతాయేమోనని భావించడం జరుగుతూ ఉంటుంది. ప్రేతాత్మలు ఆవహించడం .. వాటిని బంధించడానికి ప్రయత్నించడం .. మంత్రాలు - తంత్రాలు వంటి ఒక రకమైన హడావిడి కనిపిస్తుంది. కానీ ఇది బాడీ హారర్ జోనర్ నుంచి వచ్చిన సినిమా. ఒకే మనిషి తాను అనుకున్నవారిని చంపేసి వారి ముఖాలను ధరించడమే ఈ కథలోని ముఖ్యమైన అంశం.

అందంగా లేకపోవడం వలన అవమానాల పాలుకావడం .. తండ్రి కనిపెట్టిన 'సీరమ్' ఆధారంగా అందంగా మారాలనుకోవడం .. అందుకోసం ఇతరులను చంపేసి, వారి ముఖాలను తీసుకోవడం వంటి ఒక కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. కానీ అందుకు సంబంధించిన సన్నివేశాలు చాలా దారుణంగా చిత్రికరించారు. ఎదుటివ్యక్తి ముఖ చర్మాన్ని ఒక తొడుగులా లాగేయడం మరీ చిత్రంగా అనిపిస్తుంది. 

పనితనం: ఈ లైన్ ను ఒక జానపద కథగా చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ తెరపై చూపించవలసి వచ్చేసరికి, హింస - రక్తపాతం ఏ స్థాయిలో ఉంటాయనేది ఊహించుకోవచ్చు. కెమెరా పనితనం  .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఈ జోనర్ కి తగినట్టుగానే సాగుతాయి. 

ముగింపు: బాడీ హారర్ గా వచ్చిన ఈ సినిమా భయపెట్టిందా అంటే .. భయానికంటే ఎక్కువగా జుగుప్స కలిగించిందని చెప్పాలి. దెయ్యాల సినిమాలనైనా ముఖాన్ని చేతులతో దాచుకుని, చేతి వ్రేళ్ల సందులలో నుంచి చూసేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ ఇలా ముఖాలను ఒలిచేసే సన్నివేశాలను అస్సలు చూడలేరు. చూసి తట్టుకునే అలవాటు ఉన్నవారు చూడొచ్చు.