'హిట్' ఫ్రాంఛైజీలో భాగంగా నాని కథానాయకుడిగా నటించిన చిత్రం 'హిట్-3'. పూర్తి మాస్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్‌గా మాస్ అవతార్‌లో కొత్త కోణంలో నటించాడు. మాస్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతూ, రక్తపాతం, హింసను అధికంగా జత చేస్తూ నాని హీరోగా రూపొందిన 'హిట్-3' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? అర్జున్ సర్కార్‌గా నాని మెప్పించాడా? లేదా తెలుసుకుందాం.
కథ: అర్జున్ సర్కార్ (నాని) సీన్సియర్ పోలీస్ అధికారి. ఎస్పీగా పనిచేస్తున్న ఆయన కశ్మీర్ నుండి వైజాగ్‌కు బదిలీతో వస్తాడు. కానీ అత్యంత క్రూరంగా కొన్ని హత్యలు చేస్తూ వాటిని వీడియోలుగా షూట్ చేస్తుంటాడు అర్జున్ సర్కార్. అంతేకాదు తను చేసిన హత్యలను తనే ఇన్వేస్టిగేషన్ కూడా చేస్తుంటాడు. గతంలో జమ్మూ కాశ్మీర్‌లో ఎస్‌పీగా విధులు నిర్వర్తించిన అర్జున్ సర్కార్‌కు అక్కడ ఓ భయంకరమైన హత్య కేసు వెలుగులోకి వస్తుంది. అంతేకాదు అదే విధంగా దేశవ్యాప్తంగా మరో 13 హత్యలు జరుగుతాయి.
ఇక ఈ హత్య కేసును చేధించడానికి జరిగిన ఇన్విస్టిగేషన్‌లో అతనికి ఊహించని నిజాలు తెలుస్తాయి. వారిని పట్టుకోవడం కోసం అర్జున్ సర్కార్ కూడా అదే తరహా హత్యలు చేస్తుంటాడు. అయితే ఈ క్రూరమైన మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేదుకు అతనికి సహాయకురాలుగా మృదుల ( శ్రీ నిధి శెట్టి) ఉంటుంది. అయితే ఈ కేస్‌ను ఛేదించడానికి అర్జున్ సర్కార్ ఏం చేశాడు? ఈ హత్యల వెనుక దాగి ఉన్న రహస్యలేమిటి? అర్జున్ సర్కార్ కూడా హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అనేది మిగతా కథ.
విశ్లేషణ: 'హిట్' ఫ్రాంఛైజీలో వచ్చిన తొలి రెండు సినిమాలు విజయం సాధించడంతో హిట్-3 పేరిట అందులో భాగంగానే ఈ కథను రెడీ చేసుకున్నాడు శైలేష్ కొలను. అయితే ఈ కథలో నాని హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం, అతనికి మాస్ ఇమేజ్‌ను ఆపాదించే క్రమంలో ఈ కథలో మితిమీరిన హింసను, ఓ డార్క్ వరల్డ్‌ను సృష్టించాడు దర్శకుడు. అయితే ఇక్కడే దర్శకుడు కథను విస్మరించి, కేవలం హీరోయిజం కోసం సన్నివేశాలు రాసుకున్నాడు. నాని లాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాలో ఇలాంటి ఓ కోణాన్ని పరిచయం చేయాలనుకోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్. అంతేకాదు ఎవరూ చూడలేనంత, భరించలేనంత హింసాత్మక సన్నివేశాలను ఈ చిత్రం కోసం దర్శకుడు చిత్రీకరించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
సమాజంలో కొంత మంది నేరస్థులకు కొత్త ఐడియాలను, చంపండంలో సలహాలను ఇచ్చే విధంగా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రంలో సన్నివేశాలు ఖచ్చితంగా సమాజంలో హింసాత్మక ధోరణి పెంచే విధంగానే ఉన్నాయి. రక్తం ఏరులై పారిన ఈ చిత్రంలోని సన్నివేశాలు, సున్నిత మనస్కులు, చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు మింగుడు పడవు. అసలు దర్శకుడు ఏ వర్గం ప్రేక్షకులను టార్గెట్ చేసి ఇలాంటి సన్నివేశాలు రాశాడనే ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఈ సినిమాను ప్రేరణగా తీసుకుని, సమాజంలో ఇలాంటి హత్యలు జరిగితే పరిస్థితి ఏమిటి అనే భయం కూడా కలుగుతుంది.
కేవలం హీరోయిజం ఎలివేట్ చేయడానికి సరైన కథ, ఎమోషన్ లేకుండా చిత్రీకరించిన ఈ సినిమా ప్రథమార్థం చాలా స్లోగా కొనసాగుతుంది. సినిమాలో ఊహించని ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఏమీ లేకపోవడంతో ద్వితీయార్థంపై పెద్దగా ఆసక్తి కలగదు. ఇక సెకండాఫ్‌లో నరకడం, రక్తం ఏరులై పారటం మినహా సినిమాలో చెప్పుకోదగ్గ అంశమేమీ లేదు.హాలీవుడ్ తరహా సినిమాలో ఉండే ఓ గేమ్‌ను పోలీన ఓ వికృతమైన గేమ్‌ను నడపడంతోనే ద్వితీయార్థం మొత్తం ఉంటుంది. ఇక ఈ గేమ్ కోసం సృష్టించిన రక్తపాతం అంతా ఇంతా కాదు. బ్లడ్‌తో హీరో తడిసి ముద్ధైపోతాడు. ఇలాంటి సన్నివేశాలు చూడటానికి ఇష్టపడని వారిని సెకండాఫ్ ఎంతో విసుగు పుట్టిస్తుంది.
ఇక హీరోయిన్, హీరోకు మధ్య ఉండే పాటలు, కొన్ని సన్నివేశాలు సినిమాను మరింత నత్తనడకన సాగేవిధంగా చేశాయి. కథలో ఎలాంటి ఎమోషన్ లేకుండా, లాజిక్స్ లేకుండా కేవలం హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కించాలని చూసిన దర్శకుడి ఆలోచన 'హిట్-3' రూపంలో విఫలమైంది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో విలన్ నానితో 'క్లాస్‌గా ఉన్నావు' అంటాడు. దానికి నాని ' ఇన్నాళ్లు అందరూ అదే అనుకొని మోసపోయారు. ఇక నా వర్జినల్ చూపిస్తా' అంటాడు. అంటే నానికి స్వతహాగా మాస్‌హీరోగా నటించడం అంటే ఎంత ఇష్టమో అర్థమవుతోంది.
నటీనటుల పనితీరు: అర్జున్ సర్కార్‌గా నాని నటన ప్రశంసించే స్థాయిలో ఉన్న ఈ తరహా సినిమాలు, ఇలాంటి పాత్రలు నాని ఇమేజ్‌కు సరిపోవు. అర్జున్ సర్కార్ పాత్రకు నాని న్యాయం చేసిన ప్రేక్షకులు నానిని ఈ తరహా పాత్రలో ఊహించుకోవడం, ఆదరించడం కష్టమే. శ్రీ నిధి శెట్టి పాత్ర ఫర్వాలేదు.
ఫానుదత్ కెమెరా పనితనం సినిమాకు వన్నెతెచ్చింది. కొన్ని సన్నివేశాల్లో కెమెరా వర్క్ ఎలివేట్ అయ్యింది. మిక్కి జే.మేయర్ నేపథ్య సంగీతం ఓకే ఓకే..గా ఉంది. దర్శకుడు శైలేష్ కొలను కథను మరింత బలంగా రాసుకుని, సినిమాలో హింస, రక్తపాతంను తగ్గిస్తే నాని సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఆకట్టుకునేది.
అయితే మొదట్నుంచీ చిత్ర కథానాయకుడు నాని చెబుతున్నట్టుగానే ఈ చిత్రాన్ని చిన్న పిల్లలు, సున్నిత మనస్కులు చూడకపోవడమే మంచింది. మితిమీరిన హింస, రక్తపాతంతో కూడిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ కూడా సందేహమే. అయితే నాని తన ఇమేజ్‌కు భిన్నంగా చేసిన ప్రతిసారి పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక శృతిమించిన హింస, కొరవడిన భావోద్వేగాలు, విసుగు పుట్టించే కథ, కథనాలతో ఉన్న ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల ఆదరణ కష్టమే.
కథానాయకుడు నాని సినిమాలకు బిగ్గెస్ట్ ప్లస్ అయిన కుటుంబ ప్రేక్షకులు నచ్చే అంశాలు కూడా ఈ సినిమాలో లేకపోడం బిగ్గెస్ట్ మైనస్. ఓవరాల్‌గా మూడో సారి హిట్-3 పట్టు తప్పింది.
'హిట్ 3 ది థర్డ్ కేస్ 'మూవీ రివ్యూ

HIT 3 Review
- 'అర్జున్ సర్కార్'గా ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని
- మితిమీరిన హింస, రక్తపాతంతో 'హిట్-3'
- కొరవడిన భావోద్వేగాలు, విసుగు పుట్టించిన కథనం
Movie Name: HIT 3
Release Date: 2025-05-01
Cast: Nani, Srinidhi Shetty
Director: Sailesh Kolanu
Music: Mickey J Meyer
Banner: Wall Poster Cinema
Review By: Madhu
HIT 3 Rating: 2.50 out of 5
Trailer