సూర్య కథానాయకుడిగా ఇంతకుముందు థియేటర్స్ కి వచ్చిన 'కంగువా' ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత ఆయన నుంచి వచ్చిన ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పిస్తుందా అనేది అందరిలో కుతూహలాన్ని పెంచింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఈ రోజున థియేటర్స్ కి వచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆడియన్స్ ను ఎంతవరకూ ఆకట్టుకోగలిగిందనేది చూద్దాం. 

కథ: ఈ కథ 1960 - 90కి మధ్య కాలంలో జరుగుతుంది. పారివేల్ కన్నన్ (సూర్య) ఒక అనాథ. అతణ్ణి తిలక్ రాజ్ (జోజు జార్జ్)కి ఇష్టం లేకపోయినా, ఆయన భార్య సంధ్య చేరదీస్తుంది. అతను ఏ మాత్రం నవ్వకపోవడం గురించి ఆమె బెంగపెట్టుకుంటుంది. సంధ్యను పారివేల్ కోల్పోయిన సమయంలోనే, రుక్మిణి (పూజ హెగ్డే) తన తల్లిని పోగొట్టుకుంటుంది. ఆ సమయంలోనే వాళ్లిద్దరి మధ్య పరిచయం జరుగుతుంది. 14 సంవత్సరాల తరువాత కలుసుకున్న వాళ్లిద్దరూ, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. పెళ్లి తరువాత వేరే చోటుకు వెళ్లి ప్రశాంతమైన జీవనం గడపాలని నిర్ణయించుకుంటారు. 

తాను తోడుగా లేకపోతే తన పెంపుడు తండ్రి తిలక్ రాజ్ ప్రాణాలకు ప్రమాదమని భావించిన పారివేల్, 'గోల్డ్ ఫిష్' కోడ్ తో ఉన్న తమ సరుకును దాచేస్తాడు. అయితే ఆ సరుకు ఎక్కడ ఉన్నది తనకి చెప్పవలసిందేనంటూ రుక్మిణి ప్రాణాలు తీయడానికి తిలక్ రాజ్ ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో అతని చేయి నరికిన పారివేల్ జైలుకు వెళతాడు. తనపై కోపంతో అండమాన్ లోని ఒక దీవికి రుక్మిణి వెళ్లిపోయిందని తెలుసుకుని, జైలు నుంచి పారిపోయి ఆ దీవికి చేరుకుంటాడు.

ఆ దీవిలోని ప్రజలు రాజవేల్ (నాజర్), అతని కొడుకు మైఖేల్ (విధు) కనుసన్నలలో నడుచుకోవలసిందే. శరీరంపై 'శూలాయుధం' చిహ్నం కలిగినవాడి వలన తమ గ్రామదేవత గుడి తలుపులు తెరుచుకుంటాయనీ, తమ బ్రతుకులు బాగుపడతాయని తెలిసిన ప్రజలంతా అతని కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి ఒక సమయంలో ప్రమాదకరమైన ఆ దీవిలోకి పారివేల్ అడుగుపెడతాడు. అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఆ దీవిలోని ప్రజలంతా ఎదురుచూసేది ఆయన కోసమేనా? 'గోల్డ్ ఫిష్' కోడ్ లో దాగిన సరుకు ఏమిటి? అనేది కథ. 

విశ్లేషణ: 'మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది' అనే ఒక సామెత ఉంది. ఈ సినిమా చూస్తుంటే ఈ సామెత తప్పకుండా గుర్తొస్తుంది. ఎందుకంటే ఏ కథలోనైనా ఎక్కువ మలుపులున్నా .. ఎక్కువ పాత్రలున్నా లాభం కంటే కూడా నష్టమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకు ఉదాహరణగా చెప్పుకోవాలే గానీ చాలా సినిమాలు ఉన్నాయి. అలా  చెప్పుకునే సినిమాల జాబితాలోకి తాజాగా చేరిపోయిన సినిమానే ఇది. 

ఇక ఏ కథలోనైనా హీరో పరిష్కరించే సమస్య ప్రధానంగా ఒకటే అయ్యుండాలి. అలా కాకుండా హీరో కోసం ఒక నాలుగైదు సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నట్టుగా చూపించడం .. కథను అన్ని వైపులకు పరిగెత్తించడానికి ప్రయత్నించడం వలన దేనికీ సరైన న్యాయం జరగదు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. హీరో నవ్వితే చూడాలని హీరోయిన్ అనుకుంటుంది .. అతను నవ్వడు. హీరోయిన్ ను నమ్మించాలని హీరో అనుకుంటాడు .. కానీ ఆమె నమ్మదు .. ఇదీ తంతు.  

హీరోపై అలిగి హీరోయిన్ అండమాన్ లోని ఒక దీవికి వెళ్లిపోవడం .. లాఫింగ్ డాక్టర్ గా అక్కడికి హీరో వెళ్లడం .. మైఖేల్ కల్ట్ ఫైట్ పైత్యం .. ఇవన్నీ కూడా సహజత్వానికి చాలా దూరంగా అనిపిస్తాయి. ముఖ్యంగా లాఫింగ్ క్లాస్ లకి సంబంధించిన సన్నివేశాల కంటే, హింసతో కూడిన యాక్షన్ సీన్స్ బెటర్ అనిపిస్తాయి. ఏ పాత్రను సరిగ్గా డిజైన్ చేయకుండా ఎక్కడిక్కడ తేల్చిపారేస్తూ ముందుకు వెళ్లడమే ప్రధానమైన మైనస్ గా అనిపిస్తుంది. 

పనితీరు: కార్తీక్ సుబ్బరాజ్ రాసుకున్న ఈ కథలో ఎక్కడ కొత్తదనం కనిపించదు. స్క్రీన్ పై వెంటవెంటనే సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి. దాంతో ప్రస్తుతం కథ ఏ కాలంలో నడుస్తుందనే విషయంలో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. జోజు జార్జ్ విలన్ అనుకునే లోగా తెరపైకి ప్రకాశ్ రాజ్ వస్తాడు. ఆయన విలన్ అనుకునేలాగా నాజర్ ప్రత్యక్షమవుతాడు. ఓహో మెయిన్ విలన్ ఈయనేనా అనుకునేలోగా ఆయన కొడుకు ఎంట్రీ ఇస్తాడు. ఇంతమంది విలన్స్  నుంచి హీరో గాబట్టి ఆయన తప్పించుకోగలుగుతాడు .. మనం మాత్రం అడ్డంగా దొరికిపోతాం. 

సూర్య పాత్ర విషయానికి వస్తే, నవ్వుకు దూరంగా ఉండేపాత్ర. ఎందుకు నవ్వడు అంటే, ఏదో రీజన్ చెబుతారు. కానీ అదేమిటో మనకు అర్థం కాదు. అతను నవ్వకపోవడం వలన కథకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే అదీ లేదు. పూజ హెగ్డే ను గ్లామరస్ గా చూపించలేదు. ఈ కథ 1990లలో జరుగుతుంది కాబట్టి సర్దుకుపోవాలంతే. చెప్పుకుంటూ పోతే చాలా పాత్రలున్నాయి .. కాకపోతే వాటిని గురించి చెప్పుకోవడానికే ఏమీ లేదంతే. 

సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. బాణీలు ఓ మాదిరిగా ఉన్నాయి .. సాహిత్యం విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. ఒక డబ్బింగ్ సినిమాలో పాటలు ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. శ్రేయాస్ కృష్ణ ఫోటోగ్రఫి ఫరవాలేదు. షఫీక్ మహ్మద్ అలీ ఎడిటింగ్ విషయానికి వస్తే, ట్రిమ్ చేయవసిన సన్నివేశాలు చాలానే కనిపిస్తాయి.        

 ముగింపు: అవసరానికి మించిన పాత్రలు .. అనవసరమైన హడావిడి .. కథ తక్కువ సోది ఎక్కువ.
సూర్య .. పూజ హెగ్డే .. ప్రకాశ్ రాజ్ .. నాజర్ .. జోజు జార్జ్ .. జయరామ్ వంటి స్టార్స్  ఉన్న ఈ సినిమాలో కథ ఇంత గందరగోళంగా ఉండటం ఆశ్చర్యం. ఈ సినిమా చివర్లో తెరపై అంతా కలిసి ఒక వెర్రినవ్వు నవ్వుతారు. నిజం చెప్పొద్దూ .. ప్రేక్షకులది కూడా అదే పరిస్థితి.