ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అందువలన ఓటీటీ సంస్థలు అటు సినిమాలు .. ఇటు వెబ్ సిరీస్ లు ఈ జోనర్లో ఉండేలా చూసుకుంటున్నాయి. అలా ఈ వారం ఓటీటీకి వచ్చిన వెబ్ సిరీస్ గా 'బ్లాక్ వైట్ అండ్ గ్రే .. లవ్ కిల్స్' కనిపిస్తోంది. 6 ఎపిసోడ్స్ గా ఫస్టు సీజన్ ఈ నెల 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. పుష్కర్ సునీల్ మహాబల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో,  క థ ఏమిటనే సమీక్షలోకి ఒకసారి వెళదాం. 

కథ: 'నాగ్ పూర్'లో ఒక రాజకీయనాయకుడి దగ్గర ఒక వ్యక్తి కారు డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన తన కొడుకును ఇంజనీరింగ్ చదివించాలని అనుకుంటాడు. అందుకోసం తన ఓనర్ సహాయం తీసుకోవాలని భావిస్తాడు. అయితే ఆ ఓనర్ కూతురు 'సోను'తో డ్రైవర్ కొడుకు ప్రేమలో ఉంటాడు. సోను తండ్రికారులో ఓ రాత్రివేళ ఇద్దరూ పారిపోతారు. ఓ లాడ్జ్ లో రూమ్ తీసుకుంటారు. అయితే ఆ లాడ్జ్ పై పోలీస్ రైడ్ జరుగుతుంది. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సోను గాయపడుతుంది. 

సోను చనిపోయిందని భావించిన ఆమె లవర్, శవాన్ని కారు డిక్కీలో పెట్టేసి కారుతో పాటు వెళ్లిపోతాడు. శవాన్ని ఏం చేయాలా అని అతను ఆలోచన చేస్తూ ఉండగా, సన్నీ అనే క్యాబ్ డ్రైవర్ ఆ కారు ఆపుతాడు. తన క్యాబ్ లో పోలీస్ ఆఫీసర్ ఉన్నాడనీ, అతని చూపు సరిగ్గా లేదని చెబుతాడు. తన క్యాబ్ ట్రబుల్ ఇచ్చిందనీ, ఆ పోలీస్ ఆఫీసర్ ను నాగ్ పూర్ తీసుకెళ్లమని రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు సోను లవర్ అంగీకరిస్తాడు.

అయితే ఆ మరుసటి రోజు వార్తలలో 'సోను'లవర్, ఆమెతో పాటు పోలీస్ ఆఫీసర్ ని .. క్యాబ్ డ్రైవర్ ను .. ఓ పశువుల కాపరిని కూడా చంపేసినట్టుగా వార్తలు వస్తాయి. వాళ్లను అతను ఎందుకు చంపుతాడు? అతణ్ణి పట్టుకోవడానికి ఆ రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? నిజంగానే 'సోను'లవర్ ఆ హత్యలు చేశాడా? లేదంటే అనుకోకుండా ఆ కేసులలో చిక్కుకున్నాడా? అనేది మిగతా కథ. 

 విశ్లేషణ: కంట్లో నలుసు పడనంతవరకే, అప్పటివరకూ మనం ఎంత హాయిగా ఉన్నామో తెలుస్తుంది. అలాగే ఏ నేరంలోనైనా చిక్కుకోకముందు వరకే, మనం ఎంత సుఖంగా .. స్వేచ్ఛగా బ్రతికామనేది అర్థమవుతుంది. ఈ ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడానికి ఒక చిన్న తప్పు సరిపోతుంది. అది తుపానుగా మారడానికి ఎంతోసేపు పట్టదు అనే నిజాన్ని నిరూపించే కథ ఇది.

ఒక అబద్ధం ఆడితే దానిని కప్పిపుచ్చడానికి వంద అబద్ధాలు ఆడవలసి వస్తుంది. ఒక తప్పు చేస్తే, దాని నుంచి బయటపడాలనే కంగారులో వరుస తప్పులు చేయవలసి వస్తుంది అనే నానుడికి తగినట్టుగా ఈ కథ నడుస్తుంది. దర్శకుడు కథకి తగిన పాత్రలను .. లొకేషన్స్ ను ఎంచుకుని, ఒక్కో ఎపిసోడ్ కి ఉత్కంఠను పెంచుతూ వెళ్లిన తీరు మెప్పిస్తుంది. మొదటి ఎపిసోడ్ చూసినవారెవరూ, చివరి ఎపిసోడ్ వరకూ చూడకుండా లేవరు. 

దర్శకుడు ఈ కథను రెగ్యులర్ గా కాకుండా, డాక్యుమెంటరీ స్టైల్ ను టచ్ చేస్తూ నడిపించిన విధానం కొత్తగా అనిపిస్తుంది. ఇది యథార్థ సంఘటనేమో అనే ఒక సందేహం కలిగేలా చేస్తుంది. సంబంధం లేని ఒక్కో పాత్రను సందర్భాను సారం కలుపుతూ, ఆసక్తిని రేకెత్తించే స్క్రీన్ ప్లే, ఈ సిరీస్ కి ప్రధానమైన బలమని చెప్పాలి. 

పనితీరు: ఈ సిరీస్ లో ప్రధానమైన పాత్రలు అరడజనుకి మించి ఉండవు. ఈ పాత్రలను మలచిన విధానం .. ఆ పాత్రలను పరిగెత్తించిన పద్ధతి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. రెండో ఎపిసోడ్ నుంచి మొదలైన టెన్షన్, చివరివరకూ తగ్గకుండా చూసుకోవడం దర్శకుడి గొప్పతనంగానే భావించాలి. కథ .. కథనం .. టేకింగ్ కి మంచి మార్కులు పడతాయి. 

ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా, ఈ సిరీస్ కి సహజత్వాన్ని తీసుకొచ్చారు. సాయి భోపే కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఫారెస్టు నేపథ్యం .. నేపాల్ బోర్డర్ దృశ్యాలను ఆవిష్కరించిన తీరు బాగుంది. మేఘదీప్ భోసే నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి ఒక పిల్లర్ గా నిలిచిందని చెప్పచ్చు. దర్శకుడైన పుష్కర్ సునీల్, ఎడిటర్ గా కూడా వ్యవహరించాడు. కంటెంట్ టైట్ గా నడవడానికి ఇది ఒక కారణంగా అనుకోవచ్చు. 

ముగింపు: ఈ మధ్య కాలంలో చాలా క్రైమ్ థ్రిల్లర్లు వచ్చాయి. అయితే డాక్యుమెంటరీ స్టైల్ ను టచ్ చేస్తూ ఆవిష్కరించిన కారణంగా, ఈ సిరీస్ కొత్తగా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అనూహ్యమైన మలుపులతో సాగుతూ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. హింస .. రక్తపాతం పాళ్లు తక్కువే. ఇబ్బందికరమైన శృంగార సన్నివేశాలు కూడా లేవు. మొదటి నుంచి చివరివరకూ ఇంట్రెస్టింగ్ గా సాగే ఈ సిరీస్ ను మిస్ కాకపోవడం మంచిది.