ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కథా పరంగా పల్లెబాట పడుతున్నాయి. పల్లె మనుషుల ఎమోషన్స్ చుట్టూ ఈ కథలు తిరుగుతున్నాయి. అలాంటి ఒక కథతో రూపొందిన సినిమానే 'ముత్తయ్య'. 'బలగం' సుధాకర్ రెడ్డి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 1వ తేదీ నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన సమీక్షలోకి ఒకసారి వెళదాం. 

కథ: అది వనపర్తి జిల్లా పరిధిలోని ఒక మారుమూల గ్రామం. అక్కడ ముత్తయ్య (సుధాకర్ రెడ్డి) నివసిస్తూ ఉంటాడు. కొడుకు నర్సింగ్ .. కోడలు జయమ్మ  .. మనవడు .. ఇదే ఆయన కుటుంబం. తనకున్న కొద్దిపాటి పొలాన్ని కాపాడుకుంటూ .. పెన్షన్ డబ్బులతో రోజులు గడుపుతూ ఉంటాడు. కొడుకు దగ్గర కాకుండా ఒక చిన్న గుడిసె వేసుకుని అతను వేరే ఉంటూ ఉంటాడు. అనాథ అయిన మల్లి (అరుణ్ రాజ్), పంచర్ షాపు నడుపుతూ, ముత్తయ్యతో పాటే రోజులు గడుపుతూ ఉంటాడు. 

ముత్తయ్యకి చాలాకాలం నుంచి సినిమాలలో నటించాలనే కోరిక ఉంటుంది. వయసులో ఉండగా కుటుంబ సమస్యల వలన తీర్చుకోలేకపోయిన ఆ కోరికను, ఇప్పుడు తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. సినిమాలలో నటుడిగా మంచి పేరును సంపాదించుకోవాలని ఆశపడతాడు.  అలాగే ఆ ఊళ్లోని మద్దిలేటి కూతురును మల్లి ప్రేమిస్తూ ఉండటాన్ని ముత్తయ్య గమనిస్తాడు. ఆ అమ్మాయితో అతని పెళ్లి జరిపిస్తే బాగుంటుందని భావిస్తాడు. 

సినిమాలలో అవకాశం రావాలంటే ముందుగా షార్ట్ ఫిల్మ్ లో నైనా తమ టాలెంట్ చూపించుకోవాలనీ, ఆ షార్ట్ ఫిల్మ్ చేయడానికి లక్ష రూపాయలు అవుతాయని ముత్తయ్యకి తెలుస్తుంది. ఆ డబ్బుకోసం ముత్తయ్య ఏం చేస్తాడు? నటుడిగా పేరు తెచ్చుకోవాలనే ఆయన కోరిక నెరవేరుతుందా? మానసిచ్చిన అమ్మాయితో మల్లి పెళ్లి జరుగుతుందా? అనేది కథ. 

విశ్లేషణ: జీవితంలో ఏదైనా ఒక కోరిక .. ఆశ .. ఆశయం బలంగా ఉంటాయి. అయితే కొన్ని కారణాల వలన వాటిని నిజం చేసుకునే అవకాశం లేకుండా పోతుంటుంది. బాధ్యతలన్నీ తీర్చుకునే సరికి వయసైపోతుంది. కానీ నిజం చేసుకోలేకపోయిన 'కల' .. నిద్రలేకుండా చేస్తూనే ఉంటుంది. అలాంటి 'కల'ను నిజం చేసుకోవడానికిగాను 70 ఏళ్లు పైబడిన ఒక వృద్ధుడు చేసిన ప్రయత్నమే ఈ సినిమా.

'సివరపల్లి' సిరీస్ దర్శకుడిగా భాస్కర్ మౌర్యకి మంచిపేరు తెచ్చిపెట్టింది. ఆయన దర్శకత్వం వహించిన సినిమానే ఇది. అందువలన ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడటం సహజం. ఈ సినిమాలో ఆయన మార్క్ కొంతవరకూ కనిపించింది. సహజత్వంతో కూడిన గ్రామీణ దృశ్యాలతో ఆయన ఈ కథకు కొంత బలాన్ని తీసుకురాగలిగాడు. ఒక సినిమా చూస్తున్నట్టుగా కాకుండా, ఒక విలేజ్ లో తిరుగుతున్న ఫీల్ ను తెప్పించగలిగాడు. 

అయితే ముత్తయ్య సినిమా పిచ్చి ..  కెమెరా ముందు ఆయన నటించే తీరుకు సంబంధించి .. మల్లి లవ్ ట్రాక్ కి సంబంధించిన సన్నివేశాలలో మంచి కామెడీని రాబట్టడానికి స్కోప్ ఉంది. ఆ అవకాశాన్ని దర్శకుడు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయినట్టు అనిపిస్తుంది. మిగతా కోణాల వైపు నుంచి కూడా మరికాస్త శ్రద్ధపెట్టి ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదేమో అనిపిస్తుంది. 

పనితీరు: 'ముత్తయ్య'గా సుధాకర్ రెడ్డి .. 'మల్లి'గా అరుణ్ రాజ్ నటన ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఈ కథను ఎంచుకోవడంలో 50 శాతం సక్సెస్ అయితే, విలేజ్ ను ఎంచుకోవడంలో వందకి వందశాతం సక్సెస్ అయ్యాడు. ఈ కథకు మరింత బలాన్ని ఇచ్చింది .. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని అందించింది ఈ విలేజ్ లొకేషన్స్ అని చెప్పచ్చు. 

దివాకర్ మణి కెమెరా పనితనానికి మంచి మార్కులు ఇవ్వొచ్చు. గ్రామీణ నేపథ్యంలో సన్నివేశాలను ఆయన ఆవిష్కరించిన విధానం బాగుంది. కార్తీక్ సంగీతం సందర్భానికి తగినట్టుగా సాగుతుంది. సాయిమురళి ఎడిటింగ్ విషయానికి వస్తే, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయవచ్చని అనిపిస్తుంది. 

ముగింపు: అందమైన పల్లెటూరు నేపథ్యంలో సాగే ఒక సాధారణమైన కథ ఇది. ఈ కథలో ఎలాంటి ట్విస్టులు .. అద్భుతాలు జరగవు. 'కల'ను నిజం చేసుకోవడానికి ఉండవలసింది తపన .. పట్టుదల, అందుకు వయసు అడ్డుకాదు అనే సందేశం ఈ కథలో కనిపిస్తుంది. అయితే అక్కడక్కడా ఉండే వినోదపరమైన వెలితిని కూడా భర్తీచేసి ఉంటే, ఆడియన్స్ కి 'ముత్తయ్య' మరింత దగ్గరయ్యేవాడేమో.