అజిత్ కథానాయకుడిగా తమిళంలో రూపొందిన సినిమానే 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యాక్షన్ కామెడీ జోనర్లో ప్రేక్షకులను పలకరించింది. త్రిష కథానాయికగా నటించిన ఈ సినిమా, ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: ఏకే (అజిత్ కుమార్) ఒక గ్యాంగ్ స్టర్. అందరూ కూడా అతణ్ణి 'రెడ్ డ్రాగన్' అని పిలుస్తూ ఉంటారు. ఇతర దేశాలకు చెందిన గ్యాంగ్ స్టర్స్ కి సైతం అతనంటే భయం. అలాంటి అతను రమ్య (త్రిష) ప్రేమలో పడతాడు .. పెళ్లి చేసుకుంటాడు. వాళ్లిద్దరికీ ఒక బాబు పుడతాడు. అయితే తన బిడ్డను తాకాలంటే, మాఫియాను వదిలేయవలసి ఉంటుందని రమ్య తేల్చి చెబుతుంది. ఆమె మాటకు కట్టుబడి అతను 16 ఏళ్లు జైలు శిక్షను అనుభవిస్తాడు.
ఏకే తనయుడు విహాన్ ( కార్తికేయన్) టీనేజ్ లోకి అడుగుపెడతాడు. అతని తండ్రి ఓ గ్యాంగ్ స్టర్ అనే విషయం విహాన్ కి తెలియకుండా రమ్య జాగ్రత్తపడుతుంది. విదేశాలలో అతను పెద్ద బిజినెస్ మేన్ అని చెప్పుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే జైలు నుంచి ఏకే విడుదలవుతాడు. తన తండ్రిని కలుసుకోవడానికి విహాన్ (కార్తికేయ) ఆరాటపడుతూ ఉంటాడు. ఈ బర్త్ డేను తండ్రితో కలిసి జరుపుకోవాలని అతను ఆశపడుతూ ఉంటాడు.
కొడుకును కలుసుకోవడానికి ఎంతో ఆత్రుతగా ఏకే బయల్దేరతాడు. అయితే ఏకే జైలు నుంచి బయటికి వచ్చాడనే విషయం శత్రువులకు తెలిసిపోతుంది. వాళ్లంతా మార్గమధ్యంలోనే అతనిని అడ్డగిస్తారు. తీరా విహాన్ దగ్గరికి వెళ్లేసరికి 'డ్రగ్స్' కేసులో పోలీసులు అతనిని అరెస్టు చేసి జైలుకు తీసుకుని వెళతారు. అతనిని ఆ కేసులో ఇరికించినదెవరో తెలుసుకోవాలని ఏకే నిర్ణయించుకుంటాడు. బర్త్ డే లోగా అతన్ని జైలు నుంచి బయటికి తీసుకొస్తానని ప్రామిస్ చేస్తాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? అతని కొడుకును ఆ కేసులో ఇరికించింది ఎవరు? కొడుక్కి ఇచ్చిన మాటను ఏకే నిలబెట్టుకుంటాడా? అనేది కథ.
విశ్లేషణ: తన భార్య బిడ్డలతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకున్న ఏకే, మాఫియాను పక్కన పెట్టేసి ఆయుధాలు వదిలేస్తాడు. అదే ఫ్యామిలీని రక్షించుకోవడం కోసం తిరిగి అతను ఆయుధాలు చేతపట్టడమే ఈ సినిమా కథ. హీరోగా అజిత్ .. హీరోయిన్ గా త్రిష .. ప్రతినాయకుడిగా అర్జున్ దాస్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇక హీరో ఫ్రెండ్స్ గా సునీల్ - ప్రసన్న, హీరో కొడుకుగా కార్తికేయన్ ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తారు.
ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు .. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు అనే విషయం మనకి తెరపై అర్థమైపోతూనే ఉంటుంది. దర్శకుడు యాక్షన్ కి .. ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళ్లాడు. తుపాకుల కాల్పులు .. బాంబ్ బ్లాస్టింగ్స్ .. ఛేజింగులతో దర్శకుడు హోరెత్తించాడు. మాస్ ఆడియన్స్ ముందు మందుపాత్రలాంటి కంటెంట్ ను ఉంచాడు. వసూళ్ల సంగతి అలా ఉంచితే, ఈ సినిమా చూస్తుంటే మనలను ఒక డౌట్ వెంటాడుతూ ఉంటుంది. అజిత్ ఈ కథ విన్నాడా అనేదే ఆ డౌట్.
ఒకసారి నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన తరువాత, ఇక ప్రశాంతంగా బ్రతడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ కడిగిన ముత్యంలా మారిపొమ్మని కథానాయిక అనడం .. శిక్షను అనుభవించి తాను మంచివాడిగా మారిపోయానంటూ హీరో జైలు నుంచి రావడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బిజినెస్ చేస్తూ తండ్రి బిజీగా ఉన్నాడనీ, అందువలన తమని కలుసుకోవడం లేదని కొడుక్కి టీనేజ్ వచ్చేవరకూ ఒక తల్లి నమ్మించడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
పనితీరు: విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోను కొత్త కథలో కొత్తగా చూపిస్తే ఆ మజా వేరేగా ఉంటుంది. కథ పాతదే అయినా హీరోకి గల క్రేజ్ తో వసూళ్లు రాబట్టేయొచ్చు అనే కోణంలో ఆలోచన చేయడం మరో పద్ధతి. ఆ రెండో పద్ధతిని ఫాలో కావడం మనకి కనిపిస్తుంది. ఒక్కో మలుపుతో కథ నెక్స్ట్ లెవెల్ కి వెళితే బాగుంటుంది. కానీ ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వెళ్లడం వలన మాత్రం కథ పైకి లేవదు. పరిచయమైన ప్రతి పాత్ర వెంటనే బలహీనపడిపోయి పక్కకి వెళ్లిపోతుంటే, ఇక ఆ కథకు ఎన్ని జాకీలు పెట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు.
హీరోగా అజిత్ కి ఈ పాత్రను చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఈ తరహా పాత్రలనే కాదు, సినిమాలను కూడా ఆయన చేసే ఉన్నాడు. ఈ మధ్య కాలంలో త్రిష అందం గురించే చాలామంది చాలా రోజులుగా మాట్లాడుకున్నారు. కానీ ఎందుకో ఈ సినిమాలో ఆమె అంత గ్లామరస్ గా అనిపించలేదు. అర్జున్ దాస్ మంచి ఆర్టిస్ట్. విలన్ రోల్స్ లో అతను విజృంభిస్తాడు. కానీ ఆయన డ్యూయెల్ రోల్ ను సరిగ్గా డిజైన్ చేయకపోవడం వలన, ఆయన కూడా ఏమీ చేయలేకపోయాడు. అభినందన్ రామానుజం ఫొటోగ్రఫీ .. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం ..విజయ్ వేల్ కుట్టి ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.
ముగింపు: ఈ సినిమాను గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, పాత కథకు కొత్తగా చేసిన హడావిడి అని చెప్పచ్చు. సాధారణంగా హీరోయిజం ఎలివేట్ కావాలంటే, అందుకు సమానమైన బలం కలిగిన పాత్రలు అతని చుట్టూ ఉండాలి. ఈ సినిమాలో కూడా కొన్ని పాత్రలు హీరో చుట్టూ కనిపిస్తాయి. కానీ అవన్నీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా హీరోను పొగడ్తలతో ముంచెత్తుతూ ఆడియన్స్ కి చిరాకు పుట్టిస్తాయి. ఆ చిరాకును బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది.రొటీన్ కథకు అతి యాక్షన్ ను జోడించడమే ఈ సినిమాకి మైనస్.
'గుడ్ బ్యాడ్ అగ్లీ' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

Good Bad Ugly Review
- అజిత్ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ
- ఏప్రిల్ 10న థియేటర్లకు వచ్చిన సినిమా
- మరో మాఫియా మార్క్ మూవీ
- విషయం లేని పాత్రలే ఎక్కువ
- ఎక్కడా పేలని కామెడీ
Movie Name: Good Bad Ugly
Release Date: 2025-05-08
Cast: Ajith Kumar, Trisha Krishnan, Arjun Das, Sunil, Prasanna
Director: Adhik Ravichandran
Music: GV Prakash Kumar
Banner: Mythri Movie Makers
Review By: Peddinti
Good Bad Ugly Rating: 2.50 out of 5
Trailer