మలయాళంలో 2021లో 'ఇరుళ్' అనే ఒక సినిమా వచ్చింది. మిస్టరీ హారర్ థ్రిలర్ జోనర్లో నిర్మితమైన సినిమా ఇది. నజీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఫహాద్ ఫాజిల్ .. సౌబిన్ షాహిర్ .. దర్శన రాజేంద్రన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. అలాంటి ఈ సినిమా, ఈ నెల 8వ తేదీ నుంచి, 'అపరాధి' పేరుతో 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం. 

కథ
: అలెక్స్ (సౌబిన్ షాహిర్) ఒక నవలా రచయిత. అతను ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. వకీల్ గా పనిచేస్తున్న అర్చన ( దర్శన రాజేంద్రన్)తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. మూడు నెలలలోనే వారి పరిచయం ప్రేమగా మారుతుంది. వీకెండ్ లో ఇద్దరూ కలిసి సరదాగా కార్లో ఓ ట్రిప్ కి ప్లాన్ చేస్తారు. ఎవరి వలనా తమ ఏకాంతానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతో, ఇద్దరి ఫోన్లు ఇంటిదగ్గరే వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటారు .. అలాగే చేస్తారు కూడా. 

కార్లో ఎక్కడికి తీసుకుని వెళుతున్నది అర్చనతో అలెక్స్ చెప్పడు. కారు ఫారెస్టు ప్రాతంలో .. కొండల మీదుగా వెళుతున్నప్పుడు వర్ష మొదలవుతుంది. ఆ వర్షంలో ఒక చోట కారు ట్రబుల్ ఇస్తుంది. దూరంగా ఒక చోటున ఒక ఇల్లు కనిపిస్తూ ఉండటంతో, సాయం అడగడం కోసం ఆ ఇంటికి వెళతారు. ఆ ఇంట్లో ఉన్ని ( ఫహాద్ ఫాజిల్) కనిపిస్తాడు. అతను కొంచెం తేడాగా ఉండటాన్ని  వాళ్లు గమనిస్తూ ఉండగానే, లోపలికి రమ్మంటాడు. 

ఆ ఇంటి అండర్ గ్రౌండ్ లో అమ్మాయిగా శవాలు ఉండటం చూసిన అలెక్స్, వాళ్లను 'ఉన్ని' చంపాడని అర్చనతో చెబుతాడు. అయితే ఆ హత్యలు చేసింది అలెక్స్ యే నని ఉన్ని అంటాడు. ఆ ఇల్లు తనదేనని అలెక్స్ చెప్పడం .. తన ఫోన్ ను అలెక్స్ తెచ్చుకోవడం అర్చనకి అతనిపై అనుమానాన్ని కలిగిస్తాయి. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అమ్మాయిలను మర్డర్ చేసింది ఎవరు? అనేది మిగతా  కథ. 

విశ్లేషణ
: బడ్జెట్ తక్కువ .. కథాబలం ఎక్కువ కలిగిన సినిమాలు మలయాళంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. థ్రిల్లర్ నేపథ్యానికీ ..  సహజత్వానికి వాళ్లు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. అలా మిస్టరీ హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమానే 'అపరాధి'. కేవలం మూడు పాత్రలతో రూపొందించిన ఈ సినిమా, ఒక ప్రయోగమేనని చెప్పాలి.

ఒక నిర్జన ప్రదేశంలోని ఇల్లు .. ఆ ఇంటికి తన లవర్ ను తీసుకొచ్చిన అలెక్స్ .. ఆ ఇంట్లోకి దూరిన ఉన్ని అనే దొంగ .. ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్న ఓ శవం. హంతకుడు  'ఉన్ని'నా? అలెక్స్ నా? అనేది అర్చన డౌటు.  హత్యలు  చేసింది తాను కాదంటే తాను కాదంటూ, ఒకరిపై ఒకరు వాళ్లిద్దరూ ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. అర్చనను అయోమయంలోకి నెట్టేస్తూ ఉంటారు.   

అప్పుడు ఆమె ఎవరిని నమ్ముతుంది? ఆ తరువాత ఏం చేస్తుంది? అనే కథను దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. మూడే పాత్రల మధ్య పట్టుగా కథను నడిపించడంలో, సంభాషణలతోనే ఉత్కంఠను పెంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తక్కువ పాత్రలతో .. తక్కువ నిడివిలో బలమైన కంటెంట్ తో పలకరించిన సినిమా ఇది. 

పనితీరు: కథ .. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి.  తొంభై శాతం సినిమా ఒకే ఇంట్లో జరుగుతుంది. ఫొటోగ్రఫీ పరంగా చేయవలసిందేమీ కనిపించదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా చూసుకుంటే మంచి మార్కులు ఇవ్వొచ్చు. నటన పరంగా చూసుకుంటే, మూడు ప్రధానమైన పాత్రలను  పోషించిన ఆర్టిస్టులంతా పోటీపడి నటించారనే చెప్పాలి.