సాధారణంగా సినిమాల్లో చివరికి 'శుభం' కార్డు పడుతుంది.. కానీ అదే శుభంను టైటిల్‌గా ఓపెనింగ్‌ కార్డ్‌గా తీసుకొస్తూ.. ప్రముఖ కథానాయిక సమంత తొలిసారిగా సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతూ ఓ చిత్రాన్ని నిర్మించారు. నూతన నటీనటులతో ఆమె ఈ చిత్రాన్ని హారర్‌ కామెడీ జోనర్‌లో నిర్మించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హారర్‌ కామెడీగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించింది? నిర్మాత సమంతకు 'శుభం' సక్సెస్‌నిచ్చిందా? 'శుభం'లో ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఎంత వరకు ఉన్నాయి? రివ్యూలో తెలుసుకుందాం. 

కథ: భీమునిపట్నానికి చెందిన శ్రీను (హర్షిత్‌ మల్లిరెడ్డి) ఆ ఊరిలో కేబుల్‌ టీవీ కనెక్షన్‌లు ఇస్తుంటాడు. కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ను నడిపిస్తుంటాడు. అతని స్నేహితులు (గవిరెడ్డి శ్రీనివాస్‌, చరణ్‌ పెరి)తో కలిసి హాయిగా సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే అప్పుడప్పుడే ఆ రోజుల్లో డీటీహెచ్‌ డిష్‌లు వస్తుంటాయి. ఇక శ్రీను కేబుల్‌ వ్యాపారానికి డిష్‌ కుమార్‌ ( వంశీధర్‌ గౌడ్‌) పోటీగా డిటీహెచ్‌ల కనెక్షన్‌ల వ్యాపారం ప్రారంభిస్తాడు. ఊరిలో జనాలకు ఆ డీటీహెచ్‌లను అలవాటు చేయడం మొదలుపెడతాడు. 

ఈ తరుణంలోనే శ్రీనుకు బ్యాంక్‌లో జాబ్‌ చేసే శ్రీవల్లి (శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన తొలిరోజు రాత్రే శ్రీనుకు వింతగా, భయంకరంగా అనిపించే అనుభవం ఎదురవుతుంది. భార్య శ్రీవల్లి టీవీలో వచ్చే డైలీ సీరియల్స్‌ చూస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. శ్రీనుతో పాటు ఇద్దరూ స్నేహితుల ఇళ్లలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. వాళ్ల ఇంట్లో కూడా వాళ్ల భార్యలు కూడా రాత్రి 9 గంటలు గడవగానే టీవీ సీరియల్‌ చూస్తూ తమలో ఏవో ఆత్మలు ప్రవేశించినట్లుగా వింతగా బిహేవ్‌ చేస్తారు. 

ఈ ఆత్మల సమస్యల పరిష్కారం కోసం వాళ్లు మాయ మాతాశ్రీ (సమంత) దగ్గరికి వెళతారు. అయితే  అసలు ఎందుకిలా జరగుతోంది? జన్మ జన్మల బంధం అనే టీవీ సీరియల్‌కి ఆత్మలకు ఉన్న రిలేషన్‌ ఏమిటి? ఈ ఆత్మల సమస్య కోసం మాయ మాతా శ్రీ ఎలాంటి సలహా ఇచ్చింది? అసలు ఆత్మల నుంచి ఆ ఊరి మహిళలకి విముక్తి లభించిందా? అసలు ఏం జరిగింది? అనేది మిగతా కథ.  

విశ్లేషణ: హారర్‌ కామెడీ జోనర్‌లు అనేవి ఎవర్‌గ్రీన్‌ కాన్సెప్ట్‌లు. ఈ కాన్సెప్ట్‌ల్లో ఆసక్తి రేకెత్తించే కథాంశానికి హిలేరియస్‌ కామెడీని జత చేసి  కొంచెం భయపెడితే చాలు తప్పకుండా ఆ సినిమాలకు ఆదరణ ఉంటుంది. ఈ కోవలోనే ఈ చిత్రం విషయంలో దర్శకుడు ఓ హారర్‌ కామెడీకి కావాల్సిన హంగులు అన్నిసమపాళ్లలో రెడీ చేసుకున్నాడు. సాదారణంగా మహిళలు ఎక్కువగా కనెక్ట్‌ అయ్యే టీవీ సీరియల్‌ నేపథ్యం  తీసుకోవడం ఈ చిత్రానికి మంచి ప్లస్‌ అయ్యింది. 

అంతేకాదు కథలో ట్విస్టులు కూడా ఉత్కంఠను కలిగించే విధంగా ఉన్నాయి. అయితే ఈ కాన్సెప్ట్‌ను డీల్ చేయడం కూడా అంతా ఈజీ కాదు. కథ అనుకున్నప్పుడు ఉన్న విజువలైజేషన్‌కు అది తెరమీదికి తీసుకొచ్చే సమయానికి ఉన్న కంటెంట్‌కు తేడా ఉంటుంది. ఈ సినిమా విషయంలో కూడా దర్శకుడు స్క్రీన్‌ప్లేను మరింత బలంగా రాసుకుంటే సినిమా మరింత రక్తికట్టేది. కామెడీని పండించినంత తేలికగా హారర్‌ సన్నివేశాలను స్క్రీన్‌ మీద ప్రజెంట్‌ చేయలేకపోయాడు. అందుకే సినిమా అక్కడక్కడ స్లోగా నత్తనడకన సాగుతుంది. 

ముఖ్యంగా పాత్రల పరిచయ సన్నివేశాలు చాలా లెంగ్తీగా అనిపించాయి. శ్రీను ఫస్ట్‌ నైట్‌ దగ్గర్నుంచీ మాత్రమే కథ ఊపందుకుంటుందని అందరూ భావిస్తారు. అయితే ఆ తరువాత కూడా  చూపించిన సన్నివేశాలే మళ్లీ మళ్లీ చూపించిన ఫీల్‌ కలగడంతో సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సినిమాకు ప్లస్ అయ్యే విధంగా రాసుకున్నారు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం వల్లే సెకండాఫ్‌కు ఇంట్రెస్ట్‌ కలిగిస్తుంది. 

అయితే ఈ సినిమా కాన్సెప్ట్‌ పరిధి చాలా తక్కువగా ఉండటంతో కొన్ని సన్నివేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో సాగదీసిన ఫీల్‌ కలుగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథ అక్కడక్కడే, ఒకే సన్నివేశం చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆల్పా మేల్‌  అనే అంశాన్ని మరింత వాడుకుంటే సినిమాను ముందుకు నడిపించడంలో వేగం కనిపించేది. అయితే ఓవరాల్‌గా ఈ చిత్రం ఫ్యామిలీతో కాస్త నవ్వుతూ.. భయపెడుతూ చూసి ఎంజాయ్‌ చేసే విధంగా ఉండటం సినిమాకు కలిసొచ్చే అంశం. 

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
నూతన నటీ నటులు ఫర్వాలేదనే స్థాయిలో మాత్రమే నటించారు. అయితే కొన్ని సన్నివేశాల్లో  వాళ్ల నటన మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మాయా మాతాశ్రీ పాత్రలో సమంత తనదైన శైలిలో వినోదం పండించారు.టెక్నికల్‌గా  సినిమా ఉన్నతంగా ఉంది. పాటలు కూడా సిట్యువేషనల్‌గా ఉన్నాయి. దర్శకుడు కొన్ని సన్నివేశాలను మరింత బలంగా రాసుకుంటే, వాటిని  ప్రభావవంతంగా తెరపైకి తీసుకొస్తే సినిమా స్థాయి ఖచ్చితంగా మరో మెట్టు పైనే ఉండేది. రెగ్యులర్‌ హారర్‌ కామెడీ సినిమాలు చూసే వారికి, కొత్త ప్రయత్నాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ సినిమా సంతృప్తినిస్తుంది.  ఎటువంటి అంచనాలు లేకుండా ఈ వేసవిలో టైమ్‌పాస్‌ కోసం అయితే 'శుభం'ను చూడొచ్చు.