ఆ మధ్య హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చిన 'హార్ట్ బీట్' సిరీస్ 100కి పైగా ఎపిసోడ్స్ తో అలరించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆ సిరీస్ విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలో సీజన్ 2 రావడానికి రెడీ అవుతోంది. ఆ సిరీస్ కి దర్శకత్వం వహించిన అబ్దుల్ కబీజ్ నుంచి వచ్చిన మరో సిరీస్ 'ఆఫీస్'. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, ఈ నెల 9వ తేదీ నుంచి తెలుగులో అందుబాటులోకి వచ్చింది. 48 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కథ: అది టౌనుకు కాస్త దూరంగా ఉన్న ఒక ఊరు. అక్కడి తాశీల్దారు ఆఫీసులో తాశీల్దారు రాఘవన్ .. డిప్యూటీ తాశీల్దారుగా నెపోలియన్ పనిచేస్తూ ఉంటారు. ఇందూ .. ముత్తు .. షమ్మీ .. సన్నీ అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇక తమ ప్రాజెక్టు పనిలో భాగంగా ఐటీ నుంచి పారి .. మూర్తి .. ప్రకాశ్ అక్కడికి వస్తారు. తాశీల్దారు నుంచి మొదలుపెడితే, అక్కడున్న వాళ్లందరికీ ఒక్కొక్కరికి ఒక్కో బలహీనత ఉంటుంది. దాంతో పని తక్కువ .. వ్యాపకాలు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది.
ఇక ఆ ఊరు వాళ్లు మద్యం గురించి తప్ప మరిదేని గురించిన ఆలోచన చేయరు. పైగా ప్రతి చిన్న విషయానికి తాశీల్దారు ఆఫీసుకి వచ్చి గొడవపడుతూ ఉంటారు. దాంతో సాధ్యమైనంత త్వరగా ఐటీలో జాబ్ సంపాందించి వెళ్లిపోవాలని ఇందూ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యలోనే తరచూ ఆమె 'పారి'తో గొడవపడుతూ ఉంటుంది. పారి కూడా ఆమెతో గొడవపడుతున్నా, ఆమె పట్ల ఆరాధనాభావం మాత్రం పెరుగుతూ పోతుంటుంది.
'పారి'కి దూరంగా ఉండటానికి ఇందూ ప్రయత్నిస్తూ ఉంటే, అతనికి దగ్గరవడానికి 'ముత్తు' ట్రై చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆఫీసులో నెపోలియన్ నిద్రపోతుండటాన్ని వీడియో తీసిన షమ్మీ దానిని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంది. అది కాస్త పై అధికారుల దృష్టిలో పడుతుంది. అదే సమయంలో తాశీల్దార్ ఆఫీసుకి వచ్చిన ఓ వృద్ధురాలు అనుకోకుండా క్రిందపడిపోతుంది. ఉలుకూ పలుకు లేకపోవడంతో అక్కడి వాళ్లంతా ఏం చేస్తారు? ఫలితంగా ఏం జరుగుతుంది? వృద్ధురాలి విషయంలో స్టాఫ్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? ఇందూ పట్ల పారి ప్రేమకథ వర్కవుట్ అయ్యేనా? అనేది కథ.
విశ్లేషణ: కామెడీని .. లవ్ .. ఎమోషన్స్ ను కలుపుతూ, వర్క్ ప్లేస్ లో ఆసక్తికరమైన డ్రామాను నడిపించడంలో దర్శకుడిగా అబ్దుల్ కబీజ్ కి మంచి అనుభవం ఉంది. ఆ విషయం గతంలో వచ్చిన 'హార్ట్ బీట్' సిరీస్ నిరూపించింది. కార్పొరేట్ హాస్పిటల్ నేపథ్యంలో ఆ కథ నడుస్తుంది. ఇక ఈ సిరీస్ విషయానికి వస్తే, తాశీల్దారు ఆఫీసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 'హార్ట్ బీట్'లోని కొంతమంది ఆర్టిస్టులు కూడా ఈ సిరీస్ లో కనిపిస్తారు.
విలేజ్ వాతావరణం .. అక్కడివారి స్వభావాలు .. పెద్దగా చదువుకోని కారణంగా అక్కడివారితో తాశీల్దార్ ఆఫీసు సిబ్బందికి ఎదురయ్యే తలనొప్పులు .. సిబ్బంది చాదస్తాలను .. బద్ధకాలను టచ్ చేస్తూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. అలకలు .. బుజ్జగింపులు .. అసహనాలతో ఎపిసోడ్స్ నడుస్తాయి. కథ ఏ దిశగా పరిగెడుతూ ఉన్నప్పటికీ అందుకు తగిన కామెడీ కోటింగ్ కనిపిస్తూనే ఉంటుంది.
దర్శకుడు కొన్ని పరిమితమైన పాత్రలను ఎంచుకుని .. కామెడీ టచ్ తో వాటిని డిజైన్ చేసుకుని .. సహజత్వంతో ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఆరంభంలో కథ కాస్త నిదానంగా నడుస్తున్నట్టుగా అనిపించినా, బోర్ మాత్రం కొట్టదు. గ్రామీణ నేపథ్యం .. వివిధ రకాల మనస్తత్వాలు .. బలహీనతలు .. మేనరిజమ్స్ సరదాగా నవ్విస్తూనే ఉంటాయి.
పనితీరు: తాను ఎంచుకున్న కథపై అబ్దుల్ కబీజ్ గట్టి కసరత్తు చేస్తాడనే విషయం, ఇంతకుముందు వచ్చిన 'హార్ట్ బీట్' సిరీస్ ను చూసినవారికి తెలుస్తుంది. అదే కసరత్తు ఈ కంటెంట్ ప కూడా చేశాడనే విషయం మనకి అర్థమైపోతుంది. కథ - స్క్రీన్ ప్లే .. పాత్రలను డిజైన్ చేసిన విధానం ఈ సిరీస్ కి ప్రధానమైన బలం అని చెప్పచ్చు.
ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా చాలా సహజంగా చేశారు. ఎవరూ కూడా కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపించదు. తాశీల్దారు ఆఫీసులో మనం ఓ మూలాన కూర్చుని ఈ సిరీస్ చూస్తున్న భావం కలుగుతుంది. సూర్య థామస్ - సంతోష్ పాండి ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. శరణ్ రాఘవన్ నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా సాగుతుంది. విజయ్ కృష్ణన్ ఎడిటింగ్ కూడా బాగుంది.
ముగింపు: ఒక తాశీల్దారు ఆఫీస్ చుట్టూ తిరిగే కథ ఇది. ఆ ఆఫీసులో పనిచేసేవారి బలహీనతలకు కామెడి టచ్ ఇస్తూ, వారి ఫ్యామిలీ ఎమోషన్స్ ను ఆవిష్కరిస్తూ .. ఆ ఊరుతో ఆఫీస్ ను కనెక్ట్ చేసిన విధానం వినోదభరితంగా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి సరదాగా ఈ సిరీస్ ను చూడొచ్చు.
'ఆఫీస్' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

Office Review
- తమిళంలో రూపొందిన 'ఆఫీస్'
- 48 ఎపిసోడ్స్ గా జరుగుతున్న స్ట్రీమింగ్
- ఈ నెల 9 నుంచి తెలుగులో అందుబాటులోకి
- హైలైట్ గా నిలిచే కథ - స్క్రీన్ ప్లే - లొకేషన్స్
Movie Name: Office
Release Date: 2025-05-09
Cast: Guru Lakshman, Sneha manimeghalai, Keerthivel, Vyshali Kemkar, Thamizhvani
Director: Abdul Kabeez
Music: Saran Raghavan
Banner: BOX Office Studios
Review By: Peddinti
Office Rating: 3.00 out of 5
Trailer