తమిళంలో 'ష్ .. !' టైటిల్ తో .. రొమాంటిక్ టచ్ తో ఒక ఆంథాలజీ సిరీస్ ను రూపొందించారు. నాలుగు కథలతో కూడిన ఈ సిరీస్, తెలుగు అనువాదంగా 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో డైరెక్టర్ పనిచేశారు. లవ్ .. సెక్స్ .. ఎమోషన్స్ ప్రధానంగా సాగే ఈ కథలు ఎంతవరకూ అలరించాయనేది చూద్దాం.
 
'తరంగిణి' అనే టీచర్ ఒక సంప్రదాయబద్ధమైన ఫ్యామిలీ నుంచి వస్తుంది. స్కూల్ లో సైన్స్ టీచర్ గా ఆమెకి చాలా మంచిపేరు ఉంటుంది. అయితే మారుతున్న కాలానికి తగినట్టుగా, పిల్లలకు 'సెక్స్ ఎడ్యుకేషన్' అవసరమని మేనేజ్ మెంట్ భావిస్తుంది. ఆ సబ్జెక్ట్ ను గురించి చెప్పమని తరంగిణితో అంటారు. ఈ విషయమై ఆమె ఆలోచన చేస్తూ ఉండగానే ఒక సంఘటన జరుగుతుంది. అదేమిటి? అనేది కథ. 

ఇక రెండో కథలో .. ఆర్మీకి సంబంధించిన ఒక ఆపరేషన్ కోసం వెళ్లిన సెల్వరాజ్, ఎంతకాలమైనా తిరిగిరాడు. అతని కోసం భార్య చాలా కాలం పాటు ఎదురుచూస్తుంది. తిరిగిరాని భర్త కోసం ఎదురుచూస్తూ కాలాన్ని వృథా చేయడం కరెక్టు కాదని సన్నిహితులు సలహా ఇస్తారు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ. 

మూడో కథలో ..  శక్తి అనే యువకుడు ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అనుకున్నది సాధించడం కోసం అతను చాలా కష్టపడుతూ ఉంటాడు.  కొన్ని కారణాల వలన 'శిల్ప' అనే దూరపు బంధువుల అమ్మాయి అతనికి వండిపెడుతూ ఉండిపోవలసి వస్తుంది. ఓ పది రోజులలో ఆమె పెళ్లి జరగబోతోంది. ఈ లోగా వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుంది?  ఎలాంటి సన్నివేశాలు చోటుచేసుకుంటాయి? అనేది కథ. 

నాలుగో కథలో ..  6 ఏళ్ల తరువాత అర్జున్ - మీరా ఓ బార్ లో కలుసుకుంటారు. తాము ప్రేమించుకున్న రోజులను గురించి మాట్లాడుకుంటారు. తన వైవాహిక జీవితం అసంతృప్తిగా సాగుతుందని అతనితో ఆమె చెబుతుంది. అప్పుడు అతను ఏమంటాడు? ఆ తరువాత జరిగేదేమిటి? అనే అంశాలతో ఈ కథ నడుస్తుంది.

విశ్లేషణ: టీనేజ్ మొదలు .. వైవాహిక జీవితంలో కొంతదూరం ప్రయాణం చేసిన దంపతుల వరకూ ఈ కథలలో మనకి కనిపిస్తారు. శ్రీ పురుషుల మధ్య 'సెక్స్' పాత్ర అనే అంశాన్ని ప్రధానంగా చేసుకుని కథలను అల్లుకున్నారు. ఈ కథల్లోనే లవ్.. రొమాన్స్ .. ఎమోషన్స్ ను చూపించాలని భావించారు. కానీ ఆ విషయంపై గట్టి కసరత్తు చేయలేకపోయారు.  

ఈ సిరీస్ లోని నాలుగు కథలు కూడా సున్నితమైన భావోద్వేగాలతో ఆవిష్కరించాలని దర్శకుడు అనుకున్నాడు. ఆయా పాత్రల మధ్య ఫీల్ ను వర్కౌట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఫీల్ కోసం కేటాయించిన సమయం సాగతీతలా అనిపిస్తూ అసహనానికి గురించి చేస్తుంది. ఒకటి రెండు కథలలో ట్విస్టులు ఉన్నాయి. కాకపోతే కథలలో బలం లేకపోవడం వలన వాటిని గురించి ఆడియన్స్ పట్టించుకునే పరిస్థితి కనిపించదు. 

పనితీరు:  తేలికపాటి కథలను తీసుకుని .. పలచని సన్నివేశాలు రాసుకోవడం వలన, ఏ ఎపిసోడ్ కూడా  ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాదు. ఈ టైటిల్ .. కంటెంట్ కలర్ చూసి ఇది లస్ట్ స్టోరీస్ తరహా కంటెంట్ కావొచ్చని అనుకొనేవారు ఉండొచ్చు.  కానీ ఆ కాన్సెప్ట్ కీ .. కంటెంట్ కి ఇది చాలా దూరంలో కనిపిస్తుంది. ఆర్టిస్టులంతా పాత్రపరిధిలో నటించారు. 

ఈ నాలుగు కథలకు వాలి మోహన్ దాస్ .. పృథ్వీ ఆదిత్య .. కార్తికేయన్ .. హరీశ్ దర్శకత్వం వహించారు. అలాగే ఒక్కో కథకు ఒకరు చొప్పున నలుగురు కెమెరామెన్లు పనిచేశారు. ఏ కథను పట్టుకున్నా పెద్ద గొప్పగా అయితే అనిపించదు. సుందరమూర్తి నేపథ్య సంగీతం .. సత్యనారాయణన్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. 

ముగింపు: జీవితంలో సెక్స్ అనే అంశానికి గల ప్రాధాన్యతను ప్రధానంగా చేసుకుని కథలు అల్లుకున్నారు. అయితే అందుకు దారితీసే పరిస్థితులను ఇంట్రెస్టింగ్ గా చెప్పలేకపోయారు. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ కి సంబంధించిన అంశాలను పట్టించుకోకపోవడం, దృష్టి పెట్టిన ప్రధానమైన అంశంలో విషయం లేకపోవడం వలన ఈ సిరీస్ నిరాశపరుస్తుంది.