ధన్వీర్ గౌడ హీరోగా కన్నడలో రూపొందిన సినిమానే 'వామన'. శంకర్ రామన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. చేతన్ కుమార్ నిర్మించిన ఈ యాక్షన్ సినిమా, ఈ నెల 9వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే నిన్నటి నుంచే తెలుగులో అందుబాటులోకి వచ్చింది. 'వామన' గురించి దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడనేది మనం ఇప్పుడు చూద్దాం.

కథ: పాపన్న ( సంపత్ రాజ్) పేరు వింటేనే ఆ ఊళ్లో అందరికీ హడల్. అతనికి భయపడని ఒకే ఒక్క వ్యక్తి పేరు 'గుణ' ( ధన్వీర్ గౌడ). పాపన్నను తన శత్రువుగా భావిస్తున్న కరమ్ లాల్ (ఆదిత్య మీనన్ ), అతనిని దెబ్బకొట్టడానికి 'గుణ'ను ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంటాడు. తల్లి పార్వతి పెంపకంలో పెరిగిన గుణ, ఆ సిటీలోని ఓ శ్రీమంతుడి కూతురైన నందిని ( రీష్మా నానయ్య)ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె కూడా అతనిని ఇష్టపడుతూ ఉంటుంది.

'గుణ'కు తన కూతురు నందినీని ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేని ఆమె తండ్రి, పాపన్నను కలుస్తాడు. గుణను లేపేయమని చెబుతాడు. ఈ లోగానే పాపన్న అనుచరుడైన  'మ్యాంగో'ను గుణ చంపేస్తాడు. ఆ కోపంతో గుణ ఆత్మీయుడైన రవిని పాపన్న హత్య చేయిస్తాడు. దాంతో పాపన్నను అంతం చేయాలని గుణ నిర్ణయించుకుంటాడు. ఆవేశంతో అతని దగ్గరికి బయల్దేరతాడు. 

ఆ సమయంలోనే పాపన్నకు .. గుణకు సంబంధించిన ఒక రహస్యం కరమ్ లాల్ కి తెలుస్తుంది. కరమ్ లాల్ కి తెలిసిన ఆ రహస్యం ఏమిటి?  పాపన్నకు .. కరమ్ లాల్ కి మధ్య శత్రుత్వం ఎలా ఏర్పడింది? గుణకి .. పాపన్నకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? గుణ ఎందుకు అలా మారిపోయాడు? నందినితో గుణ వివాహం జరుగుతుందా? అనే ఆసక్తికరమైన అంశాలను టచ్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది. 

విశ్లేషణ: ఒక యవకుడు భయం అంటే ఏమిటో తెలియకుండా పెరుగుతాడు. అతను అలా పెరగడానికి ప్రధానమైన కారకురాలు అతని తల్లి. కావాలనే ఆమె అతన్ని ఒక ఆయుధంగా మారుస్తుంది. అందుకు కారణం ఏమిటి? ఆ తల్లీకొడుకుల ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? అనే అంశం చుట్టూ తిరిగే కథ ఇది.

ఈ కథలో ఇద్దరు విలన్లు .. వాళ్ల  అనుచరులు, హీరో .. అతని స్నేహితులు, హీరోయిన్ తో హీరో లవ్ ట్రాక్. ఇలా ఈ నాలుగు వైపుల నుంచి ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఈ కథకు విలన్ రోల్స్ చాలా కీలకం. అయితే విలన్ పాత్రలు బలంగా .. వైవిధ్యంగా ఉన్నప్పుడే, హీరోయిజం ఎలివేట్ అవుతూ ఉంటుంది. అంతటి బలంగా .. పవర్ఫుల్ గా విలన్ పాత్రలను మలచలేకపోయారు. హడావిడి తప్ప అసలు విషయం కనిపించదు.

విలన్ రోల్స్ చేసిన ఆదిత్య మీనన్ .. సంపత్ రాజ్ ఇద్దరూ తక్కువ వాళ్లేమీ కాదు. కానీ వాళ్ల బాడీ లాంగ్వేజ్ కి తగిన విలనిజాన్ని రాసుకోలేకపోయారు. వీక్ గా ఉన్న విలన్స్ ఎంతమంది ఉంటే మాత్రం ఏం ప్రయోజనం అనే అనిపిస్తుంది. ఇక హీరోకి హీరోయిన్ లేకపోతే ఫ్యాన్స్ ఫీలవుతారని సెట్ చేసినట్టుగానే అనిపిస్తుంది తప్ప, ఎలాంటి ప్రయోజనం లేదు.  ఎలాంటి ఫీల్ లేకుండా  ఆ ట్రాక్ చాలా చప్పగా నడుస్తుంది. ఇక కొడుకుని ఒక ఆయుధంగా తల్లి మార్చడం వెనుక ఒక పర్పస్ అయితే ఉంది .. కాకపోతే అలాంటి కారణాలు చూస్తూనే ఆడియన్స్ పెరిగి పెద్దవాళ్లవుతూ వచ్చారు.   

పనితీరు: దర్శకుడు యాక్షన్ జోనర్లో ఈ కథను రెడీ చేసుకున్నాడు .. అదే చూపించడానికి ప్రయత్నించాడు. మొదటి నుంచి చివరివరకూ యాక్షన్ సీన్స్ పైనే దృష్టి పెట్టడం వలన, ఆ యాక్షన్ వెనకున్న లవ్ .. ఎమోషన్స్ పక్కకి వెళ్లిపోయాయి. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా నడుస్తుంది. ఉండటానికి మంచి ఆర్టిస్టులు ఉన్నారు .. కానీ వాళ్ల పాత్రలపైనే కసరత్తు జరగలేదు. 

మహేంద్రసింహా ఫొటోగ్రఫీ .. అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం .. సురేశ్ ఆర్ముగం ఎడిటింగ్ ఈ సినిమాకి కొంత సపోర్ట్ చేశాయి. అయితే వీరి పనితీరును గురించి మాట్లాడుకునే స్థాయి కంటెంట్ మనకి కనిపించదు. 

ముగింపు: ఇది మచ్చుకైనా కొత్తదనం కనిపించని ఒక రొటీన్ యాక్షన్ సినిమా. 'వామన' అనే టైటిల్ పవర్ఫుల్ గానే అనిపిస్తుంది. సినిమా చూసిన తరువాత అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టరబ్బా అని ఆశ్చర్యపోకుండా ఉండలేం. అదేదో సినిమాలో కమెడియన్ సుధాకర్ డైలాగ్ మాదిరిగా వర్డ్ బాగుందని వాడేశారేమో.