మలయాళంలో బాసిల్ జోసెఫ్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ మధ్య కాలంలో ఆయన అక్కడ కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు. అలాంటి ఆయన ప్రధాన పాత్రధారిగా రూపొందిన సినిమానే 'మరణ మాస్'. శివప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమా, ఈ రోజు నుంచే ' సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ బ్లాక్ కామెడీ ఎంతవరకూ నవ్వించిందనేది చూద్దాం. 

కథ: కేరళలోని ఓ గ్రామంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. చీకటిపడితే చాలు, బయటికి రావడానికి జనాలు భయపడుతూ ఉంటారు. కిల్లర్ హత్య చేసిన అనంతరం శవాల నోట్లో 'అరటిపండు' పెడుతూ ఉంటాడు. దాంతో అందరూ అతనిని 'బనానా కిల్లర్' అని పిలుచుకుంటూ ఉంటారు. అదే గ్రామానికి చెందిన ల్యూక్ (బాసిల్) జెస్సీ (అనీష్మా)ని లవ్ చేస్తూ ఉంటాడు. ల్యూక్ లుక్ .. స్టైల్ కాస్త డిఫరెంట్ గా ఉండటంతో, అతనే కిల్లర్ అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. 

'బనానా కిల్లర్' కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ (ఆంటోని) రంగంలోకి దిగుతాడు. ఇక జిక్కు డ్రైవర్ గా పనిచేసే ట్రావెల్స్ బస్ కి అరవింద్ కండక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. 20 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన తన తండ్రి ఎప్పుడు తిరిగి వస్తాడా అనే అరవింద్ ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక జిక్కూ మాత్రం త్వరలో తన పెళ్లి జరగనున్నందుకు హ్యాపీగా ఉంటాడు. సాధ్యమైనంత త్వరగా డ్యూటీ దిగాలని కంగారులో ఉంటాడు. 

ఈ నేపథ్యంలోనే 'కేశవ' అనే ఒక వృద్ధుడిని వెంటబెట్టుకుని ఆ సీరియల్ కిల్లర్ ఈ బస్సు ఎక్కుతాడు. అతను ఆ వృద్ధుడిని చంపాలనే ఆలోచనలో ఉంటాడు. అదే సమయంలో జెస్సీ ఆ బస్సు ఎక్కుతుంది. జీవితం పట్ల సీరియస్ నెస్ లేదనీ, అందువల్లనే ల్యూక్ ను కిల్లర్ గా అనుమానిస్తున్నారని జెస్సీ భావిస్తుంది. అతనికి బ్రేకప్ చెబుతుంది. దాంతో ఆమెను బ్రతిమాలటం కోసం ల్యూక్ కూడా ఆ బస్సు ఎక్కుతాడు.

ఒక వైపున సైకో కిల్లర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ లు హెచ్చరిస్తూ ఉంటే, ప్రధానమైన పాత్రలన్నీ సైకో ఉన్న బస్సులోకి వచ్చి చేరతాయి. ఆ బస్సులో ఏం జరుగుతుంది? ఆ సైకో ఎవరు? కేశవతో ఆ సైకోకి ఉన్న సంబంధం ఏమిటి? లవర్ కోసం బస్సు ఎక్కిన ల్యూక్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? తనపై పడిన కిల్లర్ ముద్రను అతను చెరిపేసుకుంటాడా? అనేది కథ.

విశ్లేషణ: మలయాళ దర్శకులు అతి తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో ఇంట్రెస్టింగ్ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తుంటారు. అలాంటి సినిమాలలో కొన్ని వసూళ్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. అలాంటి సినిమాల జాబితాలో 'మరణ మాస్' చేరిపోయిందనే చెప్పాలి. బాసిల్ జోసెఫ్ మార్క్ సినిమాకి, టోవినో థామస్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

ఈ కథ ఒక 20 శాతం వరకు మాత్రమే బయట జరుగుతుంది. మిగతా కథ అంతా రన్నింగ్ బస్సులోనే నడుస్తుంది. బస్సులోని అరడజను పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఫస్టు పార్టు వరకూ ఈ సినిమా కాస్త సరదాగానే నడుస్తుంది. సెకండాఫ్ లో మాత్రం కథ కాస్త నిదానిస్తుంది. పిండుకోవాల్సినంత కామెడీని పిండుకోలేదేమోనని అనిపిస్తుంది. బాసిల్ స్థాయి కామెడీ వర్కౌట్ కాలేదని అనిపిస్తుంది.

 బాసిల్ పాత్రను ఇంకాస్త వినోదభరితంగా డిజైన్ చేయవలసింది. అలాగే బస్సు డ్రైవర్ .. కండక్టర్ పాత్రల వైపు నుంచి కథను టైట్ చేయవలసింది. ఇక పోలీస్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ పాత్రను కూడా పెద్దగా ఉపయోగించుకోలేదు. ఆయన కుక్క వైపు నుంచి కూడా కామెడీ ట్రాక్ ను సరిగ్గా డిజైన్ చేయలేదు. ఈ కాన్సెప్ట్ ను ఇంకాస్త బాగా తీయవచ్చనే ఒక భావన మాత్రం కలుగుతుంది. 

పనితీరు: బాసిల్ జోసెఫ్ ఎంట్రీ .. హీరో విజయ్ స్టైల్లో గాల్లోకి చేతులు ఊపడం .. సరదాగా అనిపిస్తాయి. కానీ ఆ తరువాత ఆ లుక్ పరంగా తప్ప, మేనరిజం పరంగా ఏమీ చేయలేకపోయింది. సైకో కిల్లర్ రాజేశ్ మాధవన్ నటన కూడా బాగానే ఉంది. మిగతా వాళ్లంతా తమ పాత్రలు మాత్రమే తెరపై కనిపించేలా చేయగలిగారు. కథ అంతా బస్సులోనే నడుస్తుంది గనుక, నిర్మాణ విలువల గురించి మాట్లాడుకోవాల్సిన పనిలేదు. నీరజ్ రవి ఫొటోగ్రఫీ విషయంలోను ఇదే మాటను చెప్పుకోవాల్సి ఉంటుంది. జేకే నేపథ్య సంగీతం ఫరవాలేదు. చమన్ చాకో ఎడిటింగ్ ఓకే. 

ముగింపు
: దర్శకుడు ఎంచుకున్న లైన్ బాగుంది. తక్కువ పాత్రల మధ్యలో .. ఇంట్రెస్టింగ్ డ్రామాను నడిపించాలనే ఆలోచన బాగుంది. కానీ ఆశించినస్థాయిలో పాత్రలను డిజైన్ చేయలేదని అనిపిస్తుంది. ఇంకాస్త వైవిధ్యంగా స్క్రిప్ట్ పై కసరత్తు చేసి ఉంటే, బాసిల్ మార్క్ కామెడీ వర్కౌట్ అయ్యేదేమో.