కోలీవుడ్ దర్శకులలో సుందర్ సి. తనదైన ఒక మార్క్ వేశాడు. నటుడిగా కూడా తనదైన ప్రత్యేకతను చాటుతూ వెళుతున్నాడు. హారర్ కామెడీ .. యాక్షన్ కామెడీ సినిమాలు చేయడంలో ఆయనకి మంచి అనుభవం ఉంది. అలాంటి సుందర్ నుంచి వచ్చిన సినిమానే 'గ్యాంగర్స్'. ఏప్రిల్ 24వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్షన్ కామెడీ ఎంతవరకూ అలరించిందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: అది ఒక విలేజ్ .. ఆ ఊరును మల్లేశ్ (మైమ్ గోపీ) కోటేశ్ (అరుళ్ దాస్) అనే అన్నదమ్ములు, తమ కనుసన్నలలో నడిపిస్తూ ఉంటారు. ఆ ఊరును వాళ్లు తమ అక్రమ వ్యాపారాలకు  అడ్డాగా చేసుకుంటారు. అయితే ఈ విషయాలేవీ బయట ప్రపంచానికి తెలియదు. చెప్పడానికి ప్రయత్నించే సాహసం కూడా ఎవరూ చేయరు. అక్కడి గవర్నమెంట్ స్కూల్ నుంచి 'రమ్య' అనే ఒక స్టూడెంట్ కనిపించకుండా పోతుంది. ఆ స్కూల్లో సుజిత (కేథరిన్) టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది.

'రమ్య' అనే టీనేజ్ అమ్మాయి కనిపించకుండా పోయిన విషయాన్ని సుజిత పోలీస్ అధికారుల దృష్టికి తీసుకుని వెళుతుంది. దాంతో ఆ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోమని పోలీస్ డిపార్టుమెంటువారు ఒక అధికారిని ఆ ఊరు పంపిస్తారు. ఆ సమయంలోనే ఆ స్కూల్లో పీఈటీ టీచర్ గా శరవణన్ ( సుందర్) చేరతాడు. అప్పటికే పీఈటీ టీచర్ గా ఉన్న సింగరం (వడివేలు), సుజితపై మనసు పారేసుకుంటాడు.

 పీఈటీ టీచర్ గా పనిచేస్తూనే, ఆ ఊరును .. ఆ స్కూల్ ను అడ్డుపెట్టుకుని మల్లేశ్ - కోటేశ్ చేస్తున్న అక్రమాలను శరవణన్ గమనిస్తాడు. వాళ్లను నడిపిస్తున్న పెద్ద తలకాయ ఒకటి ఉందని గ్రహిస్తాడు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? రమ్య కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రభుత్వం ఆ ఊరికి పంపించిన పోలీస్ అధికారి ఎవరు? శరవణన్ ఆ ఊరికి రావడానికి కారణం ఏమిటి? ఆయన ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది? అనేది కథ.
 
విశ్లేషణ: ఒక ఊళ్లో ఒక సమస్య .. ఆ సమస్యను పరిష్కరించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. అలా వచ్చిన హీరోను చూసి హీరోయిన్ మనసు పారేసుకుంటుంది .. అనేవి చాలా కథల్లో కామన్ గా  కనిపించే సన్నివేశాలు. అయితే  సమస్య ఏమిటి? దానిని హీరో ఎలా సాల్వ్ చేశాడు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కున్నాడు? అనే అంశాలే ఆ కథను రక్తి కట్టేలా చేస్తాయి. మరి ఈ కథ ఎంతవరకూ రక్తి కట్టించింది? అంటే, కొంతవరకూ అని చెప్పచ్చు.

ఈ కథలో ఓ మూడు ట్విస్టులు ఉన్నాయి. వాటిని ఆడియన్స్ గెస్ చేయలేరనే చెప్పాలి. ఆ ట్విస్టుల కారణంగా ఈ కథ బలం పెరిగింది. అవి లేకపోతే ఇది రొటీన్ స్టోరీ అయ్యుండేది. సుందర్ రాసుకున్న ఈ కథలోని ట్విస్టులు, రచయితగాను ఆయనకి గల అనుభవాన్ని చెబుతాయి. బలమైన విలనిజాన్ని డిజైన్ చేయడంలోను ఆయన తనదైన స్టైల్ ను ఫాలో అయ్యాడు.

ఈ సినిమా ఫస్టాఫ్ అంతా ఇంట్రెస్టింగ్ గానే నడుస్తుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ తరువాత మరింత బలం పుంజుకోవలసిన ఈ కథ .. బలహీనపడటం మొదలవుతుంది. ఫస్టాఫ్ లో తన పాత్రతో సమానంగా వడివేలు పాత్రను నడిపిస్తూ వచ్చిన ఆయన, సెకండాఫ్ ను వడివేలుకు వదిలేశాడు. గందరగోళంలో నుంచి కామెడీని బయటికి తీసే ప్రయత్నం చేశాడు. 'అతి కామెడీ అనర్థం' అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదుగా.     

పనితీరు
: సుందర్ సి. దర్శకత్వం వహించిన ఈ సినిమా, యాక్షన్ కామెడీ జోనర్ కి చెందినదే. అయితే గతంలో తాను తెరకెక్కించిన హారర్ కామెడీ కథల పద్ధతిలోనే ఆయన ఈ కథను రాసుకున్నాడు. దెయ్యాలు లేవనేగానీ ఆ ఫార్మేట్ లోనే ముందుకు వెళుతుంది. సెకండాఫ్ పై ఇంకాస్త గట్టిగా కూర్చుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. 

సుందర్ .. కేథరిన్ .. వాణి భోజన్ .. హరీశ్ పేరడి నటన పాత్ర పరిధిలో సాగుతుంది. వడివేలు కామెడీ మాత్రం కాస్త అతిగా .. ఇంకాస్త రొటీన్ గా అనిపిస్తుంది. కృష్ణస్వామి కెమెరా పనితనం .. సత్య నేపథ్య సంగీతం .. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ ఫరవాలేదు.

ముగింపు: సుందర్ సి. ఆసక్తికరమైన ట్విస్టులతో ఈ కథను చాలా వరకూ రక్తికట్టిస్తూ వచ్చాడు. వడివేలు సిల్లీ కామెడీ కాస్త చిరాకు పెడుతున్నా, మెయిన్ ట్రాక్ పట్టుకునే ఆడియన్స్ తమ ప్రయాణం సాగిస్తారు. ఎప్పుడైతే విలన్ అధీనంలోని 100 కోట్లను తమ సొంతం చేసుకోవడానికి హీరో మాస్టర్ ప్లాన్ గీస్తాడో, అక్కడి నుంచే కథలో గందరగోళం మొదలవుతుంది. అక్కడ దృష్టి పెట్టి ఉంటే బాగుండేదేమో.