ఈటీవీ విన్ నుంచి అప్పుడప్పుడు కొన్ని సందేశాత్మక చిత్రాలు పలకరిస్తూనే ఉన్నాయి. ఆ వరుసలో తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినిమానే 'అనగనగా .. '. సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథమేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: అది ఓ ఇంటర్నేషనల్ స్కూల్ .. రాజా రెడ్డి (అవసరాల) ఆ స్కూల్ కి చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ స్కూల్ కి ప్రిన్సిపాల్ గా భాగ్యలక్ష్మి (కాజల్ చౌదరి) ఉంటుంది. ఆమె భర్తనే వ్యాస్ (సుమంత్). వారి సంతానమే రామ్ (విహర్ష్). భాగ్యలక్ష్మి తో పాటు అదే స్కూల్లో 'వ్యాస్' పనిచేస్తూ ఉంటాడు. అతను పర్సనాలిటీ డెవలప్ మెంట్ టీచర్. పిల్లలకు పాఠాలను కథలుగా చెప్పడం వలన బలంగా గుర్తుంటుందని నమ్మే వ్యక్తి అతను. పిల్లలను ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేయవద్దనేది అతని అభిప్రాయం. 

పిల్లలు అతనిని ఇష్టపడుతూ ఉంటారు. కానీ మిగతా స్టాఫ్ తో పాటు చైర్మన్ కూడా వ్యాస్ పద్ధతి పట్ల అసహనంతో ఉంటాడు. తన స్కూల్ పేరు ప్రతిష్ఠలు తనకి ముఖ్యమనీ, అది దెబ్బతినకుండా చూసుకోమని భాగ్యలక్ష్మికి చైర్మన్ క్లాస్ తీసుకుంటూ ఉంటాడు. దాంతో పద్ధతి మార్చుకోమని భాగ్యలక్ష్మి తరచూ వ్యాస్ తో చెబుతూ ఉంటుంది. అతని కారణంగా రామ్ కూడా చదువులో వెనుక బడుతున్నాడని చిరాకు పడుతూ ఉంటుంది.

కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు తనని అర్థం చేసుకోవడం లేదు. ఫలితంగా తాను ఎన్నో స్కూల్స్ మారవలసి వచ్చింది. ఇప్పుడు ఈ స్కూల్లో ఉద్యోగం కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉందనే విషయం వ్యాస్ కి అర్థమవుతుంది. దాంతో తన ఉద్యోగానికి వ్యాస్ రాజీనామా చేస్తాడు. ఆ తరువాత అతను ఏం చేస్తాడు? అతను తీసుకున్న నిర్ణయం రామ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? వ్యాస్ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: ఒకప్పుడు పిల్లలు స్కూల్లో చదువుకోవడమే కాదు .. ఆడుకున్నారు కూడా. ఇప్పటి స్కూల్స్ లో విశాలమైన గ్రౌండ్స్ తో పాటు అనేక రకాల ఆటవస్తువులు ఉంటాయి. కానీ ఎక్స్ ట్రా క్లాసుల పేరుతో వాళ్లు క్లాస్ రూమ్స్ లోనే ఎక్కువగా ఉంటారు. ఇంటికి వెళ్లగానే హోమ్ వర్క్ .. ట్యూషన్. ఆ తరువాత తినేసి పడుకోవడమే. తమ గొప్పల కోసం పేరెంట్స్ .. తమ బిజినెస్ కోసం విద్యా సంస్థలు పిల్లలను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయనే ఒక అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.  

పిల్లలు చదువుకునే పాఠాలు వాళ్లకి క్లాస్ రూమ్ లోనే కాదు, జీవితంలోను పనికి రావాలి. పాఠాలను పిల్లలు ఇష్టంగా వినాలంటే కథల రూపంలో .. దృశ్య రూపంలో చెప్పాలనే ఒక ఆలోచనను రేకెత్తించే కథాంశాన్ని దర్శకుడు ఎంచుకున్న విధానం బాగుంది. విద్యా సంస్థలు తమ బిజినెస్ పై కంటే కూడా పిల్లల భవిష్యత్తుపై ఎక్కువ దృష్టి పెట్టాలనీ, పిల్లలను మానసికంగా ఉల్లాసంగా ఉంచినప్పుడే నేర్చుకున్న విషయం వాళ్లకి గుర్తుంటుందనే ఒక సందేశాన్ని  ఇచ్చిన సినిమా ఇది.

 పనితీరు:  దర్శకుడు ఎంచుకున్న ఈ లైన్ బాగానే ఉంది. అయితే అసలు కథను ఎక్కించడానికి చుట్టూ అల్లుకోవలసిన వినోదపరమైన అంశాలను వదిలేశాడు. కేవలం తాను అనుకున్న అంశాన్ని సూటిగా చెప్పడానికి ట్రై చేశాడు. దాంతో కథ అంతా కూడా  కాస్త సీరియస్ గానే కొనసాగుతుంది. కథలుగా చెబితేనే పాఠాలు ఎక్కుతాయనేది ఎంత నిజమో, ఒక సందేశానికి వినోదాన్ని జోడించి చెబితేనే ఎక్కుతుందనేది కూడా అంతే నిజం.

ఇక పిల్లలు చదువు పై దృష్టి పెట్టాలంటే ఎలాంటి వాతావరణం ఉండాలి .. సిలబస్ ఎలా ఉండాలనే విషయాలను చెప్పడానికి ట్రై చేయడం బాగుంది. అలాంటి సమయంలోనే కాస్త విషాదాన్ని జోడించే ప్రయత్నం చేయడం వలన ఆడియన్స్ డైవర్ట్ అవుతారు. స్ఫూర్తిని పొందే ట్రాక్ లో నుంచి టెన్షన్ పడేస్థాయికి వస్తారు. పిల్లలు ఎక్కువగా చూసే ఈ తరహా కంటెంట్ లో ఇలాంటి ఒక ట్విస్ట్ కరెక్టు కాదేమో అనిపిస్తుంది. నటీనటులంతా తమ పాత్రలకి తగిన నటనను ప్రదర్శించారు. పవన్ పప్పుల ఫొటోగ్రఫీ .. చందు రవి సంగీతం .. వెంకటేశ్ చుండూరు ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.   

 ముగింపు: తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి చేసిన ప్రయత్నం బాగుంది. కానీ ఆ సందేశాన్ని ఆడియన్స్ వరకూ తీసుకెళ్లగలిగే వినోదాన్ని జోడించలేకపోవడమే వెలితిగా అనిపిస్తుంది.