తమిళంలో బ్లాక్ కామెడీ జోనర్లో రూపొందిన సినిమానే 'జాలీ ఓ జింఖానా'. రాజేంద్ర రాజన్ - పునీత రాజన్ నిర్మించిన ఈ సినిమాకి, శక్తి చిదంబరం దర్శకత్వం వహించాడు. క్రితం ఏడాది నవంబర్ 22వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. ప్రభుదేవా - మడోన్నా సెబాస్టీయన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: తంగసామి (వైజీ మహేంద్రన్)  కొత్తగా ఓ హోటల్ పెడతాడు. కూతురు చెల్లమ్మ (అభిరామి) .. మనవరాళ్లు భవాని (మడోనా సెబాస్టియన్) శివాని - యాళిని ప్రోత్సహించడంతోనే అతను ఆ నిర్ణయం తీసుకుంటాడు. అయితే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్లంతా ఆ హోటల్లో తినేసి రెండు లక్షలకు పైగా బిల్ చేస్తారు. వాళ్లంతా లోకల్ ఎమ్మెల్యే రాజు (మధుసూదన్) మనుషులు. బిల్ విషయంలో అతనితో తంగసామి గొడవపడతాడు. ఫలితంగా వాళ్లతో తన్నులు తినేసి హాస్పిటల్ పాలవుతాడు. అతన్ని బ్రతికించుకోవడానికి 25 లక్షలు అవసరవుతాయి.

ఆ డబ్బు కోసం భవాని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆమె ఎకౌంటులో 25 లక్షలు  పడతాయి. తాను అప్పు అడిగిన రాకెట్ రవి ఆ డబ్బు ట్రాన్స్ ఫర్ చేసి ఉంటాడని భావిస్తుంది. వెంటనే ఆ మొత్తాన్ని హాస్పిటల్ కి కట్టేసి తాతయ్యను కాపాడుకుంటుంది. అప్పుడు ఆమెను బొట్టు భవాని (సాయి దీనా) అనే లోకల్ రౌడీ వచ్చి కలుస్తాడు. ఎమ్మెల్యే రాజు మనుషులు తనకి పంపించవల్సిన  డబ్బును పొరపాటున ఆమెకు పంపించినట్టుగా చెబుతాడు. వెంటనే ఆ మొత్తం తన అకౌంటుకు బదిలీ చేయమని బెదిరిస్తాడు. 

భవాని ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులతో చెబుతుంది. 25 లక్షలు ఇవ్వకపోతే బొట్టు భవాని తమని బ్రతకనివ్వడని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ విషయంలో తమని కాపాడేది లాయర్  పూంగు (ప్రభుదేవా) మాత్రమేనని భావిస్తారు. సిటీలోని ఒక హోటల్లో బస చేసిన ఆయనను కలుసుకోవడానికి అంతా కలిసి వెళతారు. అక్కడ అతని డెడ్ బాడీ చూసి షాక్ అవుతారు.  ఆ సమయంలోనే అతనికి సంబంధించిన 10 కోట్ల విషయం వాళ్లకి తెలుస్తుంది. పూంగును హత్య చేసినదెవరు? ఆ నేరం తమపై పడకుండా వాళ్లు ఏం ప్లాన్ చేస్తారు? ఎమ్మెల్యే మనుషుల నుంచి తప్పించుకోగలుతారా? అనేది కథ.

విశ్లేషణ: ' పెనంలో నుంచి పొయ్యిలో పడటం' అనే సామెతను మరోసారి మనకి గుర్తుకు తెచ్చే కథ ఇది. ఒక రౌడీ వేధిస్తున్నాడని చెప్పి లాయర్ ను కలవడానికి వెళ్లిన తల్లీ కూతుళ్లు, ఆ లాయర్ హత్య చేయబడటం చూసి షాక్ అవుతారు. ఆయన శవంతో వాళ్లు పడే పాట్లే ఈ కథ. ఇది బ్లాక్ కామెడీ అని బలంగా చెప్పిమరీ వదిలారు. మరి ఆ స్థాయికి తగినట్టుగా ఈ సినిమా ఉందా అంటే .. లేదనే చెప్పవలసి ఉంటుంది.

'జాలీ ఓ జింఖానా' .. ఈ టైటిల్ లోనే కామెడీ అంతా ఉందని అనుకున్నారేమో .. దానినే సెట్ చేశారు. ఒక లాయర్ బ్రతికే ఉన్నాడని నమ్మించడం కోసం, అతని శవంతో విన్యాసాలు చేయిస్తూ  ఒక ఫ్యామిలీ పడే తంటాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తెరపై పాత్రలు పరిగెడుతూనే ఉంటాయి. వాళ్లతో పాటు కామెడీ పరిగెత్తిందా? అంటే, అసలు కామెడీ అంటూ ఉంటేనే గదా పరుగులు పెట్టడానికి? అనే సమాధానం రావడం ఖాయమేనని చెప్పాలి. 

పాత్రలన్నీ ఛేజింగ్ మోడ్ లోనే ఉంటాయి. ఆ పాత్రల మధ్య ఒక రకమైన గందరగోళాన్ని సృష్టించి, ఆ కన్ఫ్యూజన్ లో నుంచి కామెడీని పిండటానికి ట్రై చేశారా? అనే అనిపిస్తుంది. ఇది బ్లాక్ కామెడీ అనే విషయాన్ని బలంగా గుర్తుపెట్టేసుకుని, ప్రతి సన్నివేశంతో .. ప్రతి డైలాగ్ తో నవ్వించడానికి ప్రయత్నించడమే మైనస్ అయింది. లేకపోతే కొంతవరకూ వర్కౌట్ అయ్యేదేమో. 

పనితీరు: ఈ కథలో కొత్తదనం లేదు .. కథనం కూడా సాదాసీదాగా సాగిపోతుంది. కామెడీ సన్నివేశాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి. పాత్రలన్నీ కూడా కథ లేకుండా .. కామెడీ లేకుండా పరిగెత్తుతుండటం ప్రేక్షకులకు బాధ కలిగించే విషయం.
అశ్విన్ వినాయగమూర్తి నేపథ్య సంగీతం .. గణేశ్ చంద్ర ఫొటోగ్రఫీ .. రామర్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఎవరి పనితీరును గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీలేని ఒక పరిస్థితి. డాన్సులతో .. కామెడీతో తెరపై చాలా యాక్టివ్ గా కనిపిస్తాడని అనుకున్న ప్రభుదేవ పాత్రను, మొదటి నుంచి చివరివరకూ ఒక శవంలా చూపించడమే మైనస్ అయిందని అనుకోవాలి. 

ముగింపు: తెరపై శవాన్ని భరిస్తూ మిగతా పాత్రలు ఎంతగా ఇబ్బంది పడతాయో, నవ్వురాని కంటెంట్ తో ప్రేక్షకులు కూడా అంతే ఇబ్బంది పడతారని చెప్పాలి. కామెడీ కంటెంట్ లో ప్రతి సన్నివేశంలో కామెడీ ఉండనవసరం లేదు. ప్రతి పాత్ర కామెడీ చేయవలసిన పనిలేదని గతంలో వచ్చిన చాలా సినిమాలు చెప్పకనే చెప్పాయని మరిచిపోకూడదు.