కథలో కొత్తదనం ఉంటే నూతన తారల చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఈ విషయాన్ని గతంలో నూతన తారలు నటించిన చాలా సినిమాల విజయాలు ఈ విషయాన్ని నిరూపించాయి. తాజాగా ఈ కోవలోనే నూతన నటీనటులతో రూపొందిన చిత్రం 'ఒక బృందావనం' ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందిందా? ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉందా? లేదా తెలుసుకుందాం.. 

కథ: అమెరికాకు వెళ్లి స్థిరపడాలని కలలు కనే రాజా విక్రమ్‌ (బాలు) ఓ ఈవెంట్‌ సంస్థలో కెమెరామెన్‌గా పనిచేస్తుంటాడు. అమెరికాకు వెళ్లాలని, అందుకోసం డబ్బు సంపాందించాలని విక్రమ్‌ ప్రయత్నిస్తుంటాడు. తండ్రి (వంశీ నెక్కంటి) పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుసుకోని తన ప్రాజెక్ట్‌ వర్క్‌లో భాగంగా కొంత మంది వ్యక్తుల లైఫ్‌ జర్నీని ఓ డాక్యుమెంటరీ తీయాలని మహీ (షిన్నోవా) ఇంటి నుంచి బయటికి వచ్చేస్తుంది.  అనుకోకుండా తనకు పరిచయమైన విక్రమ్‌ను ఈ డాక్యుమెంటరీని షూట్‌ చేయడానికి కెమెరామెన్‌గా పెట్టుకుంటుంది మహీ. 

తన అమెరికా వెళ్లడానికి కావాల్సిన డబ్బు కోసం ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్‌ అవుతాడు విక్రమ్‌.    అనాథశ్రమంలో ఉండే చిన్నారి నైనిక (సాన్విత)  జోసెఫ్‌ను (శుభలేఖ సుధాకర్‌) అన్వేషిస్తుంది.  అయితే నైనిక స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించడంతో ఆమె గురించి డాక్యుమెంటరీ తీయాలని ప్లాన్‌ చేస్తుంది మహీ. అయితే అమెరికా వెళ్లాలనుకున్న రాజా విక్రమ్‌ కల ఫలించిందా? ఇంతకు జోసెఫ్‌ ఎవరు? అతడిని నైనిక ఎందుకు కలవాలని అనుకుంటుంది. రాజా, మహీ జర్నీ నైనికతో ఎలా కొనసాగింది? తెలియాలంటే సినిమా చూడాలి. 

విశ్లేషణ:  ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి చాలా రోజుల తరువాత ఓ బ్యూటిఫుల్‌ జర్నీని చూసిన ఫీల్‌ కలుగుతుంది. ఈ మధ్య కాలంలో కరువైన మానవ సంబంధాలు, అనుబంధాలు, ఎమోషన్స్‌ ఇలా అన్నీ ఈ చిత్రంలో జోడించాడు దర్శకుడు. ఓ పాప చుట్టు అల్లుకున్న కథ, దాని చుట్టు అల్లుకున్న పాత్రలు బాగున్నాయి. భిన్నమైన లక్ష్యాలున్న మనుషులు, ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు  చేసే జర్నీ అందరి హృదయాలకు హత్తుకుంటుంది. 

ఫస్టాఫ్‌లో సినిమాలోని పాత్రలు పరిచయం, వాళ్ల ఎస్టాబ్లిష్‌ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. అందుకే ఫస్టాఫ్‌ కాస్త స్లోగా అనిపిస్తుంది. కానీ సెకండాప్‌ మాత్రం అందరిని అలరించేలా ఉంటుంది. సెకండాఫ్‌లో ఎమోషన్స్‌ అందర్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని సన్నివేశాలు ఎంతో భావోద్వేగానికి గురిచేస్తాయి. జోసెఫ్‌ కోసం నైనిన అన్వేషణ, ఆమె పడే తాపత్రయం సున్నిత హృదయాలను కదిలిస్తుంది. అయితే దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్‌, పాయింట్‌ కొత్తగా ఉన్న కథనంపై మరింత శ్రద్ద పెట్టి ఉంటే సినిమా మరింత బెటర్‌గా ఉండేది. 

ఫస్టాఫ్‌లో కూడా ఆడియన్స్‌కు చెప్పాలనుకున్న పాయింట్‌ను కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలతో చెప్పి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అయినా దర్శకుడు చేసిన ఈ హానెస్ట్‌ అటెంప్ట్‌ను ప్రశంసించాల్సిందే.  ఆడియన్స్‌ చాలా రోజుల తరువాత ఓ ఫీల్‌ గుడ్‌ సినిమాను చూసిన భావనతో ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటికొస్తారు. 

నటీనటుల పనితీరు: రాజా విక్రమ్‌గా బాలు ఎంతో సహజంగా నటించాడు. బాడీలాంగ్వేజ్‌ కూడా విభిన్నంగా అనిపిస్తుంది. షిన్నోవా నటనలో పరిణితి కనిపించింది. నూతన హీరోయిన్‌ అనే భావన ఎక్కడా కూడా కలగలేదు. నైనిక పాత్రలో నటించిన సాన్విత ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. శుభలేఖ సుధాకర్‌ పాత్ర, ఆయన నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. దర్శకుడు సత్య బొత్సను గురించి ఈ సినిమా చేసిన వాళ్లు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. 

సినిమాటోగ్రఫీ, సంగీతం సినిమా స్థాయిని పెంచాయి. సంభాషణలు కూడా అర్థవంతంగా ఉన్నాయి. నిర్మాణ విలువలతో పాటు చిత్ర నిర్మాణం పట్ల నిర్మాతల అభిరుచి ఈ సినిమాలో కనిపించింది. కమర్షియల్‌ సినిమాలు కాకుండా కొత్తదనంతో కూడిన ఫీల్‌గుడ్‌ సినిమాలు చూసే ఆడియన్స్‌ను ఈ సినిమా అలరించే అవకాశం ఉంది.