ఇంద్రరామ్ - పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన సినిమానే 'చౌర్యపాఠం'. దర్శకుడు త్రినాథరావు నక్కిన తన సొంత బ్యానర్ పై నిర్మించిన మొదటి సినిమా ఇది. నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు నుంచే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథమేమిటనేది ఒకసారి చూద్దాం. 

కథ: వేదాంత్ రామ్ (ఇంద్రరామ్) సినిమా దర్శకుడిగా మారడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో, బ్యాంక్ కి కన్నం వేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకు అనుకూలంగా ఉన్న బ్యాంక్ కోసం అతను 'ధనపాలే' అనే గ్రామాన్ని ఎంచుకుంటాడు. లక్ష్మణ్ .. బబ్లూ .. జాక్ అతనిని అనుసరిస్తారు. 'ధనపాలే' గ్రామంపై ఒక డాక్యుమెంటరీ తీయనున్నామని చెప్పి, ఆ గ్రామ సర్పంచ్ వసుధ (సుప్రియ) అనుమతి తీసుకుంటారు. 

సర్పంచ్ వసుధ .. ఆ గ్రామంలోని జమీందార్ ధనపాలేశ్వర (రాజీవ్ కనకాల) ఒకే తండ్రికి జన్మించిన పిల్లలు. అందువలన ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉంటుంది. వసుధ స్థానంలో సర్పంచ్ గా తాను కూర్చోవాలని ధనపాలేశ్వర ఆశపడుతూ ఉంటాడు. వసుధ అనుమతితో ఆ ఊరు స్కూల్ లో వేదాంత్ రామ్ టీమ్ బస చేస్తుంది. ఆ స్కూల్ లో నుంచి అక్కడికి దగ్గరలోనే ఉన్న బ్యాంక్ లోకి సొరంగ మార్గం త్రవ్వాలని వాళ్లంతా ప్లాన్ చేసుకుంటారు. 

ఆ బ్యాంకులో ఎకౌంటెంట్ గా అంజలి (పాయల్ రాధాకృష్ణ) పనిచేస్తూ ఉంటుంది. ఆమెను పరిచయం చేసుకుని, నిదానంగా ముగ్గులోకి దింపుతాడు వేదాంత్. అయితే ఈ బ్యాచ్ పై జమిందార్ కీ .. పోలీస్ ఆఫీసర్ కి డౌట్ వస్తుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? వేదాంత్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అసలు అతను ఆ గ్రామానికి వచ్చింది డబ్బుకోసమేనా? అనే అంశాలతో ఈ కథ నడుస్తూ ఉంటుంది. 

విశ్లేషణ: అన్యాయాలు .. అక్రమాలు ఎక్కువ కాలం పాటు సాగవు. ఎప్పుడో ఒకప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పడక తప్పదు. అలాంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అక్రమాలకు అంగబలం ఎక్కువగానే ఉన్నప్పటికీ, చివరికి అది నిజాయితీ ముందు దోషిగా నిలబడక తప్పదని మరోసారి నిరూపించిన కథ ఇది. 
  
'చౌర్య పాఠం' అనే టైటిల్ .. నక్కిన త్రినాథరావు నిర్మాతగా వ్యవహరించడం ఈ సినిమాపై ఆసక్తి కలగడానికి గల కారణంగా చెప్పుకోవచ్చు. దర్శకుడు తయారు చేసుకున్న లైన్ .. గ్రామీణ నేపథ్యం ఆసక్తిని కలిగిస్తాయి. హీరో .. ఆయన గ్యాంగ్ చేసే దొంగతనం వైపుకు ప్రేక్షకులను మళ్లిస్తూ, మరో వైపు నుంచి ఇచ్చిన ట్విస్ట్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. కాకపోతే రొటీన్ డ్రామా నుంచి దూరంగా వెళ్లలేకపోయింది.

జమీందార్ .. పోలీస్ ఆఫీసర్ .. సర్పంచ్ పాత్రలను కాస్త పవర్ఫుల్ గా డిజైన్ చేసుంటే బాగుండేదనిపిస్తుంది. అలాగే కామెడీకి కూడా కాస్త చోటిస్తే మరికొన్ని మార్కులు పడేవేమో. క్లైమాక్స్ ను దశలవారీగా సాగదీయడం కాస్త చిరాకు పెడుతుంది. 

పనితీరు: కథ రొటీన్ గా అనిపించేదే అయినా, స్క్రీన్ ప్లే విషయంలో దృష్టి పెడితే బాగుండేది. ఏ పాత్రకు ఎలాంటి ప్రత్యేకతలు లేకపోవడం వలన చాలా డల్ గా నడుస్తూ ఉంటాయి. సతీశ్ ఫొటోగ్రఫీ బాగుంది. గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన సన్నివేశాలను .. పాటలను చిత్రీకరించిన విధానం బాగుంది. డావ్ జాంద్ సంగీతం .. ఉతురా ఎడిటింగ్ ఫరవాలేదు. 

ముగింపు: రొటీన్ గా  కనిపించే కథ .. సాదాసీదాగా సాగే సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. పాత్రలను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుంటే .. స్క్రీన్ ప్లే పై మరికాస్త కసరత్తు చేసుంటే ఇంతకంటే బెటర్ అవుట్ పుట్ వచ్చేదేమో అనిపిస్తుంది.