'క్రిమినల్ జస్టీస్' వెబ్ సిరీస్ ఇంతకుముందు మూడు సీజన్లు స్ట్రీమింగులోకి వచ్చాయి. ఈ మూడు సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. నాలుగో సీజన్ ఈ రోజు నుంచే అందుబాటులోకి వచ్చింది. 'క్రిమినల్ జస్టీస్ ఏ ఫ్యామిలీ మేటర్' అనే పేరుతో, 7 భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగుకు వచ్చింది. జియో హాట్ స్టార్ లోకి అడుగుపెట్టిన సీజన్ 4 నుంచి ముందుగా 3 ఎపిసోడ్స్ ను వదిలారు. 

కథ: రాజ్ (మహ్మద్ జీషన్)  ఓ కార్పోరేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. భార్య అంజూ (సృవీన్ చావ్లా) .. కూతురు 'ఇరా' (ఖుషీ భరద్వాజ్)  .. ఇదే ఆయన ఫ్యామిలీ. టీనేజ్ లోకి అడుగుపెట్టిన 'ఇరా', ఒక రకమైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. అందువలన ఆమె కేర్ టేకర్ గా రోషిణి (ఆషా నేగి) ని నియమిస్తారు. రాజ్ హాస్పిటల్లో ఆమె నర్స్ గా పనిచేస్తూ ఉంటుంది. కొన్ని కారణాల వలన రాజ్ - అంజూ మధ్య దూరం పెరుగుతుంది. విడాకులు తీసుకుకోవాలనే ఆలోచనలో వాళ్లు ఉంటారు. 

ఈ నేపథ్యంలో రాజ్ - రోషిణి మధ్య శారీరక సంబంధం ఏర్పడుతుంది. ఒక రోజున 'ఇరా' బర్త్ డే ఫంక్షన్ కావడంతో, రోషిణి కూడా అక్కడికి వెళుతుంది. అయితే ఆ ఫంక్షన్ లో రోషిణికి అవమానం జరుగుతుంది.  దాంతో ఆమె అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోతుంది. ఆ మరుసటి రోజున రోషిణి ఫ్లాట్ కి పనిమనిషి కమల వెళుతుంది. అక్కడ రక్తం మడుగులో రోషిణి పడిఉండటం .. ఆమె పక్కనే రాజ్ కూర్చుని ఉండటం చూసి షాక్ అవుతుంది. 

పోలీసులు రాజ్ ను అరెస్ట్ చేసి తీసుకుని వెళతారు. ఈ కేసు పోలీస్ ఆఫీసర్ గౌరికి అప్పగించబడుతుంది. దాంతో అన్ని వైపుల నుంచి ఆమె ఈ కేసును పరిశోధిస్తూ ఉంటుంది. అయితే లాయర్ మాధవ్ మిశ్రా (పంకజ్ త్రిపాఠి)ని అంజూ కలుసుకుంటుంది. ఈ హత్య రాజ్ చేసి ఉండడనే అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. దాంతో ఆయన రంగంలోకి దిగుతాడు. అప్పుడు అతనికి తెలిసే నిజాలేమిటి?  రోహిణిని హత్య చేసింది ఎవరు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ
: సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన థ్రిల్లర్ కథలు మర్డర్ తోనే మొదలవుతూ ఉంటాయి. ఆ మర్డర్ చేసే అవసరం .. అవకాశం ఎవరెవరికి ఉన్నాయనే విషయాన్ని హైలైట్ చేస్తూ కథ మలుపులు తీసుకుంటూ ఉంటుంది. చివరికి తెరవెనకనున్న అసలు హంతకుడిని బయటకి తీసుకు రావడం జరుగుతూ ఉంటుంది. అదే రూట్లో ఈ కథ కూడా కొనసాగుతూ ఉంటుంది. 

సీజన్ 4 లో ఇప్పుడు వదిలింది 3 ఎపిసోడ్స్ మాత్రమే. అందువలన ఇన్వెస్టిగేషన్ ఆరంభంలోనే ఉంది. కథలో ఇంకా అనేక మలుపులు చోటుచేసుకోవలసి ఉంది. అసలైన హంతకుడిని పట్టుకోవడానికి కథానాయకుడు ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు? అనే అంశాలు ఈ సీజన్ రేటింగును నిర్ణయించనున్నాయి. గతంలో మాదిరిగానే ఈ సిరీస్ తన మార్క్ ను కంటిన్యూ చేసిందని చెప్పుకోవాలి. 

పనితీరు: ఈ సిరీస్ కి క్రైమ్ కథలు ప్రాణం. ఎంచుకునే కథలు .. వాటిని నడిపించిన విధానం ఈ సిరీస్ కి ఇంతవరకూ విశేషమైన ఆదరణ లభిస్తూ వచ్చేలా చేశాయి. సీజన్ 4 కి సంబంధించిన విషయంలోను అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని ఉంటారనే అనిపిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. 

నిర్మాణ పరమైన విలువలకు వంకబెట్టవలసిన పనిలేదు. ఫోటోగ్రఫి .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకి తగినట్టుగా సాగాయి. ఈ సీజన్ ద్వారా ఎన్ని ఎపిసోడ్స్ ను అందిస్తారు? ఆ ఎపిసోడ్స్ కంటెంట్ ను ఎలా డిజైన్ చేశారు? అనేది పూర్తిగా స్ట్రీమింగ్ లోకి వచ్చిన తరువాత మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.