మంచు మనోజ్ .. నారా రోహిత్ .. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమా 'భైరవం'. కెకె రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకి, విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. ఈ రోజునే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో క్రితం ఏడాది వచ్చిన 'గరుడన్' సినిమాకి ఇది రీమేక్. అక్కడ 40 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ కథ, ఇక్కడి ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందనేది చూద్దాం. 

కథ: ఈ కథ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 'దేవీపురం' గ్రామంలో మొదలవుతుంది. ఆ గ్రామానికి ప్రధామైన బలం అక్కడ వెలసిన వారాహీదేవి అమ్మవారు. ఆ గ్రామస్తులంతా ఆ తల్లిని తమ ఇష్టదేవతగా కొలుస్తూ ఉంటారు. ఆ దేవాలయానికి సంబంధించిన వ్యవహారాలను గజపతి (మంచు మనోజ్)వరదా ( నారా రోహిత్) చూసుకుంటూ ఉంటారు. గజపతి నాయనమ్మ నాగరత్నమ్మ (జయసుధ) ఆ ఆలయానికి ధర్మకర్తగా ఉంటుంది.

గజపతి జమీందారు వారసుడు. అయినా ప్రస్తుతం అతను ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఆయన భార్య నీలిమ (ఆనంది). వరదా శ్రీమంతుల కుటుంబం నుంచి వచ్చిన నిజాయితీపరుడు. ఆయన భార్య పూర్ణిమ ( దివ్య పిళ్లై). గజపతి - వరదా ఇద్దరూ ప్రాణ స్నేహతులు. గజపతి కుడిభుజం క్రింద శ్రీను (బెల్లంకొండ శ్రీను) ఉంటూ ఉంటాడు. అనాథ అయిన అతను తాను నమ్మినవారికి కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు. పాల వ్యాపారం చేసే వెన్నెల అతణ్ణి ప్రేమిస్తూ ఉంటుంది. 

'దేవీపురం' గ్రామంలో వారాహీదేవి అమ్మవారి కోసం గతంలో ఒక భక్తుడు 75 ఎకరాల భూమిని సమర్పిస్తాడు. ఆ భూమి పత్రాలు అమ్మవారి నగలతో పాటు లాకర్లో ఉంటాయి. ఆ పత్రాలను .. ఆ భూమిని దక్కించుకోవాలని మినిస్టర్ వెదురుపల్లి (శరత్ లోహితస్య) ప్లాన్ చేస్తాడు. ఆ డాక్యుమెంట్స్ తనకి ఇస్తే, 40 కోట్లు ఇస్తానని గజపతితో డీల్ మాట్లాడతాడు. అప్పుడు గజపతి ఏం చేస్తాడు? వరదా ఎలా స్పందిస్తాడు? ఈ ఇద్దరి మధ్యలో శ్రీను పాత్ర ఏమిటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఈ సినిమా టైటిల్ 'భైరవం'. ఈ కథలో వారాహీదేవికి క్షేత్రపాలకుడు భైరవుడు. చిన్నప్పటి నుంచి కూడా శ్రీను పాత్రకి భైరవుడు పూనుతుంటాడు. అందువలన ఈ సినిమాకి ఈ టైటిల్ సెట్ చేశారు. టైటిల్ కి తగిన కథనే మనకి తెరపై కనిపిస్తూ ఉంటుంది. ఒక విలేజ్ .. ఒక గుడి .. రెండు కుటుంబాల మధ్య ఈ కథ తిరుగుతూ ఉంటుంది. స్నేహం - విశ్వాసం అనే రెండు ప్రధానమైన అంశాలను కలుపుకుని వెళుతూ ఉంటుంది.

వారాహీ అమ్మవారి పట్ల వరదాకు అపారమైన విశ్వాసం .. అలాగే గజపతి పట్ల శ్రీనుకి విపరీతమైన విశ్వాసం. గజపతి - వరదా మధ్య బలమైన స్నేహం. స్నేహధర్మాన్ని ఎవరు పాటించారు? ఒకరిపట్ల ఒకరికి గల విశ్వాసాన్ని ఎవరు నిలబెట్టుకున్నారు? అనే అంశాల చుట్టూ ఈ కథ నడుస్తూ ఉంటుంది. 'గరుడన్' సినిమా ఆధారంగా రూపొందిన ఈ సినిమా, ఆ సినిమా స్థాయిలో కనెక్ట్ అయిందా అంటే కాలేదనే చెప్పాలి. 

'గరుడన్' సినిమాలో సూరి పాత్రను డిజైన్ చేసిన తీరు వేరు. చాలా బలహీనంగా ఆ పాత్ర కనిపిస్తుంది. అతను ఒక మర్డర్ చేశాడంటే ఎవరూ నమ్మనంత సెన్సిటివ్ గా కనిపిస్తాడు. అందువలన తప్పనిసరి పరిస్థితుల్లో అతను తనకంటే బలవంతులను ఢీకొట్టే సన్నివేశాలు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఆ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ ను పెట్టారు. నటన పరంగా అతను మెప్పించినప్పటికీ, కథా పరంగా ఆడియన్స్ ముందుగానే గెస్ చేయడానికి అవకాశం ఏర్పడింది.    

పనితీరు: ఈ కథలో .. ఒక రాజకీయనాయకుడు అమ్మవారిపట్ల ప్రజలకు గల విశ్వాసంపై దెబ్బ కొట్టాలనుకుంటాడు. తన స్వార్థం కోసం ఇద్దరు స్నేహితులను విడదీస్తాడు. ఆ ఆరాచక శక్తిని ఓ అనాథ యువకుడు ఎలా తుదముట్టించాడు అనేదే కథ. మంచు మనోజ్ .. బెల్లంకొండ శ్రీనివాస్ .. నారా రోహిత్ పాత్ర పరిధిలో మెప్పించారు. ఇందులో దైవం వైపు నుంచి .. స్నేహం వైపు నుంచి .. ఫ్యామిలీ వైపు నుంచి ఎమోషన్స్ ఉన్నాయి కానీ, ఆశించిన స్థాయిలో అవి కనెక్ట్ కాలేదు. 

బెల్లంకొండ జోడిగా అదితి శంకర్ పాత్రను సరిగ్గా డిజన్ చేయలేదనే చెప్పాలి. ఆ పాత్రకి ఆమె అతకలేదని కూడా అనాలి. ఇక జయసుధ పాత్ర ఇలా కనిపించి అలా మాయమవుతుంది. ఆ మాత్రం దానికి జయసుధను ఎందుకు తీసుకున్నారనేది అర్థం కాదు. అలాగే సంపత్ రాజ్ .. అజయ్ రత్నం .. శరత్ లోహితస్య వంటి ఆర్టిస్టులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదని అనిపిస్తుంది. హరి కె వేదాంతం కెమెరా పనితనం .. శ్రీచరణ్ పాకాల సంగీతం .. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఫరవాలేదు.

ముగింపు
: తమిళ సినిమాతో పోల్చుకుంటే, బలమైన ఎమోషన్స్ .. యాక్షన్ సీన్స్ ను బ్యాలన్స్ చేయడం తెలుగులో కుదరలేదని అనిపిస్తుంది. తమిళ సినిమాలో 'సూరి' పాత్రనే హైలైట్. బలహీనమైన ఆ పాత్ర బలవంతులతో తలపడటాన్ని ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. తెలుగు విషయానికి వచ్చేసరికి ఆ మేజిక్ మాత్రం మిస్సయ్యిందనే చెప్పాలి.