మోహన్ లాల్ నుంచి రీసెంటుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ సినిమానే 'తుడరుం'. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. ఓ మాదిరి బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 230 కోట్లకి పైగా వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 30వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేమిటనేది ఒకసారి చూద్దాం. 

కథ: షణ్ముగం (మోహన్ లాల్) మంచి వయసులో ఉండగా సినిమాలలో ఒక ఫైట్ మాస్టర్ కి  అసిస్టెంట్ గా పనిచేస్తాడు. కొన్ని కారణాల వలన ఆ వృత్తికి దూరం కావలసి వస్తుంది. ఫైట్ మాస్టర్ అభిమానంతో ఇచ్చిన బ్లాక్ అంబాసిడర్ కారు అంటే షణ్ముగానికి చాలా ఇష్టం. ఆ కారునే టాక్సీగా నడుపుతూ అతను తన భార్యా బిడ్డలను పోషిస్తూ ఉంటాడు. ఆయనకి బెంజ్ అంటే మరింత ఇష్టం ఉండటం వలన, అందరూ ఆయనను 'బెంజ్' అనే పిలుస్తూ ఉంటారు. 

భార్య లలిత ( శోభన) కూతురు పవిత్ర ( అమృత వర్షిణి)  కొడుకు పవన్ (థామస్ మాథ్యూ) ఇదే అతని కుటుంబం. పిల్లలిద్దరూ టీనేజ్ లోనే ఉంటారు. పవన్ వేరే ఊర్లోని కాలేజ్ లో హాస్టల్లో ఉంటూ చదువుతూ ఉంటాడు. ఒక రోజున రిపేర్ కోసం బెంజ్ ఇచ్చిన కారును మణి అనే మెకానిక్ తీసుకుని వెళతాడు. ఆ కారులో గంజాయి దొరికిందని చెప్పి, పోలీస్ లు పట్టుకుంటారు. తన కారును విడిపించుకుని రావడానికి పోలీస్ స్టేషన్ కి బెంజ్ వెళతాడు. 

ఎస్ ఐ బెన్నీ (బినూ పప్పు)తో అంతకుముందే గొడవ కావడం వలన, సీఐ జార్జ్ ( ప్రకాశ్ వర్మ)తో బెంజ్ తన పరిస్థితిని చెప్పుకుంటాడు. తమ కొలీక్ సుధేష్ కూతురు పెళ్లి పక్క ఊర్లోనే జరుగుతుందనీ, అక్కడ తమను డ్రాప్ చేసి వెళ్లమని కారు కీస్ ఇచ్చేస్తాడు జార్జ్. ఆ రాత్రి వాళ్లు బెంజ్ ను ఫారెస్టులో చాలా దూరం తీసుకువెళతారు. తన కారు డిక్కీలో శవం ఉందనీ, దానిని పూడ్చడం కోసం తనని వాళ్లు అక్కడివరకూ తీసుకొచ్చారనే విషయం అప్పుడు బెంజ్ కి అర్థమవుతుంది. పోలీసులు హత్య చేసింది ఎవరిని? అది తెలుసుకున్న బెంజ్ ఏం చేస్తాడు? అనేది కథ.                 

విశ్లేషణ: భగవంతుడు ప్రకృతిని ఒక సాక్షిగా పెట్టాడనీ, ప్రకృతి ఇచ్చిన సాక్ష్యంతోనే కర్మ వెంటాడుతూ ఉంటుందని అంటారు. అలా ఒక పాపానికి పాల్పడినవారిని 'కర్మ' ఎలా వెంటాడిందనేదే ఈ కథ. నేరస్థులను ఈ ప్రపంచం వదిలేసినా ప్రకృతి వదిలిపెట్టదనే సందేశంతో కూడిన కథ ఇది. కథ - కథనం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. ఆ తరువాత పాత్రలను డిజైన చేసిన తీరుకు .. లొకేషన్స్ కి మార్కులు పడతాయి. 

ఈ కథ మెయిన్ ట్రాక్ లో వెళ్లడానికి దర్శకుడు కొంత సమయాన్ని తీసుకున్నాడు. అయితే ఆయా పాత్రలను గురించి బలంగా చెప్పడానికి ఆ మాత్రం సమయం పడుతుందనే అనుకోవాలి. ఒక సామాన్యుడిని అతని స్థాయికి మించిన కేసులో .. అతను చేయని కేసులో ఇరికించడానికి పోలీస్ అధికారులు ప్రయత్నిస్తే, ఒంటరిగా అతను ఏం చేయగలుగుతాడు? అనే కోణం నుంచి దర్శకుడు ఈ కథను నడిపించిన తీరు హ్యాట్సాఫ్ అనిపిస్తుంది. 

ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. "అతణ్ణి చంపింది అడివికి రాజే ..  అందుకు అడవి మొత్తం సహకరించింది"అని. ఈ ఒక్క డైలాగ్ ఈ సినిమా కాన్సెప్ట్ ను మొత్తాన్ని చెప్పేస్తుంది. బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరిలో ఈ సినిమా కూడా చేరిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఏం జరిగి ఉంటుందనేది చివరివరకూ ప్రేక్షకుడు గెస్ చేయలేడు. ఈ సినిమా ఎందుకు ఇన్ని వందల కోట్లు రాబట్టిందనేది ఎండ్ కార్డు పడిన తరువాతనే మనకి అర్థమవుతుంది. 

పనితీరు: 'దృశ్యం' సినిమాను ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. అందుకు కారణం అది మధ్యతరగతి మనుషుల మధ్య నుంచి పుట్టిన కథ కావడమే. ఈ కథ కూడా అంతే .. తనకి జరిగిన అన్యాయాన్ని ఒక సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడు? న్యాయం .. ధర్మం అతని పక్షాన ఉండటం వలన, ప్రకృతి అతనికి ఎలా సహకరించింది అనేది దర్శకుడు చెప్పిన తీరు ప్రతి ఒక్కరికీ బలంగా కనెక్ట్ అవుతుంది. 

ఈ కథకు ఒక వైపు నుంచి స్క్రీన్ ప్లే కొమ్ముకాస్తే, మిగతా మూడు వైపుల నుంచి షాజీ కుమార్ ఫొటోగ్రఫీ .. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం .. నిషాద్ - షఫీక్ ఎడిటింగ్ సపోర్ట్ చేశాయి. ఎవరికి వారు మనసు పెట్టి చేసిన వర్క్ మనలను ఆకట్టుకుంటుంది. మొదటి అరగంట దాటిన తరువాత చివరి వరకూ ఈ కథ కదలనీయదు. మోహన్ లాల్ కెరియర్ లో చెప్పుకోదగిన సినిమాలలో ఇది ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. 

ముగింపు: సమాజంలో సామాన్యులకు ఎదురయ్యే సంఘటనలకు దగ్గరగా మలచబడిన కథ ఇది. ఒక నిజాన్ని బయటపెట్టడానికి ఈ ప్రకృతి ప్రళయాన్ని సృష్టించగలదని నిరూపించే కథ ఇది. చాలాకాలం తరువాత అనూహ్యమైన మలుపులతో సాగే ఒక బలమైన కథను, సహజత్వానికి దగ్గరగా చూడగలిగామనే భావన ఆడియన్స్ కి కలుగుతుంది.