తమిళంలో ఇటీవల విడుదలైన ఒక సినిమాను గురించి ఇతర భాషా ప్రేక్షకులు సైతం ఎక్కువగా మాట్లాడుకున్నారు. అంతగా వారిని ప్రభావితం చేసిన ఆ సినిమా పేరే 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. 10 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం ఒక రికార్డ్. అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి తెలుగులోనూ 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: ధర్మదాస్ ( శశికుమార్) వాసంతి (సిమ్రాన్) భార్యాభర్తలు. వారి సంతానమే నీతూ షాన్( మిథున్) మురళి (కమలేశ్). ఈ ఫ్యామిలీ శ్రీలంక నుంచి భారత్ కి అక్రమంగా వస్తుంది. ఒక పోలీస్ టీమ్ కి దొరికిపోయినా, తెలివిగా తప్పించుకుంటారు. వాసంతి అన్నయ్య ప్రకాశ్ (యోగిబాబు) వాళ్లు ఇక్కడ ఉండటానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తాడు. తాము శీలంక నుంచి వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచుతారు. కేరళ నుంచి వచ్చినట్టుగా చెబుతూ ఆ కాలనీలోని వాళ్లను నమ్మిస్తారు.

అయితే వాళ్లు తమకి తెలియకుండానే ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో అద్దెకి దిగుతారు. అప్పటి నుంచి వాళ్లు ఆ ఇంట్లో బిక్కుబిక్కుమంటూనే బ్రతుకుతుంటారు. ధర్మదాస్ కారు డ్రైవర్ గా ఉద్యోగం సంపాదించుకుంటాడు. చిన్న కొడుకును స్కూల్లో వేయగలుగుతాడు. ధర్మదాస్ పెద్దకొడుకు మాత్రం ప్రేమించిన అమ్మాయికి దూరంగా తనని తీసుకొచ్చిన తండ్రి పట్ల కోపంతో ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువగా పరిచయాలు పెంచుకోవద్దని ప్రకాశ్ చెప్పిన మాటలను వాళ్లెవరూ పట్టించుకోరు. 

ఇదిలా ఉండగా సిటీలో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్, పోలీసులకు తలనొప్పిగా మారుతుంది. అక్రమంగా చొరబడిన శరణార్థులే అందుకు కారణమని వాళ్లు భావిస్తారు. ఆ దిశగా వాళ్లు సెర్చ్ చేస్తూ ఉంటారు. సిటీలోకి ప్రవేశిస్తూ తనకి దొరికిపోయిన ధర్మదాస్ ఫ్యామిలీపై ఆ పోలీస్ కి అనుమానం వస్తుంది. దాంతో ఆ విషయాన్ని పై అధికారికి చెబుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ. 

విశ్లేషణ: 'టూరిస్ట్ ఫ్యామిలీ' .. ఓ సాదాసీదా టైటిల్. క్రేజీ కాంబినేషన్ కూడా కాదు. పెద్ద పేరున్న డైరెక్టర్ నుంచి వచ్చిన కంటెంట్ కూడా కాదు. అయినా ఈ సినిమాను సెలబ్రిటీలు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాంటి ఈ తమిళ సినిమా ఓటీటీకి రావడానికి చాలా సమయం పడుతుందని అనుకున్నారు ..  కానీ వచ్చేసింది. 

తోటివారితో మాట్లాడితే మనం గొప్పతనం తగ్గిపోతుంది. ముందుగా అవతలివారు పలకరిస్తేనే మనం పలకరించాలి. ఇంటికి వచ్చినవారితో ప్రేమగా మాట్లాడకుండా, ఎక్కడో ఉన్నవారితో ఫోన్లో బిజీగా ఉండే ఇరుకైన మనసుల మధ్య బ్రతుకుతున్న రోజులివి. పక్కింటివాడు ఎలా పోతే మనకేంటి? అనుకునే మనుషులలో మార్పు తెచ్చే కథ ఇది. బ్రతకడం కోసం వచ్చి ఎలా బ్రతకాలో నేర్పిన ఒక ఫ్యామిలీ కథ ఇది. 

వినడానికి ఇది చాలా సింపుల్ లైన్. కానీ దానిని తెరపైకి తీసుకొచ్చిన విధానం ప్రతి ఒక్కరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. భార్యాభర్తలు .. తండ్రీ కూతుళ్లు .. తండ్రీ కొడుకులు .. ప్రేమికులు .. యజమాని - పనివాడు .. ఇలా  దర్శకుడు అన్ని వైపుల నుంచి ఈ కథను మానవీయ కోణంలో ఆవిష్కరించాడు. ప్రతి పాత్ర మనలను ప్రశిస్తున్నట్టుగా ఉంటుంది .. ఆలోచింపజేస్తూ ఉంటుంది. ఎలా నడుచుకోవాలో .. ఎలా గెలుచుకోవాలో చెబుతుంది. 

పనితీరు: ఈ కథ తెరపై కాకుండా మన కాలనీలో .. మన కళ్లముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది మన కథ .. మన చుట్టూ ఉండే మనుషుల కథగా కనిపిస్తుంది. అందువల్లనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కనెక్ట్ అవుతుంది. అనూహ్యమైన మలుపులు .. భయంకరమైన బ్యాంగులు లేకుండా సహజత్వంతో సాగిపోతుంది .. ఆ సహజత్వమే ఈ కథకు ప్రధానమైన బలం అని చెప్పాలి. 

ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా, ఈ కథను ప్రేక్షకులకు మరింత చేరువుగా తీసుకుని వెళ్లారు. అరవింద్ విశ్వనాథన్ ఫొటోగ్రఫీ .. సీన్ రోల్డన్ సంగీతం .. భరత్ విక్రమన్ ఎడిటింగ్ ఈ కథకు కావాల్సినంత సపోర్ట్ చేశాయి. ఇలా అన్ని వైపుల నుంచి అన్నీ కుదిరిన ఈ కథ, సహాయం చేసినవారిని సైతం అనుమానించే సమాజాన్ని ఆలోచనలో పడేస్తుంది.  

ముగింపు: అన్ని బంధాలను టచ్ చేస్తూ సున్నితమైన హాస్యాన్ని .. బరువైన భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి తప్పకుండా కనెక్ట్ అవుతుంది. జీవితమంటే గొప్పగా బ్రతకడం కాదు .. నలుగురితో కలిసి బ్రతకడం .. నవ్వుతూ బ్రతకడం అనే పాఠం నేర్పుతుంది. మంచితనం మనలో ఉండాలి .. మంచి మనుషులు మనతో ఉండాలి అనే సందేశాన్ని అందించిన సినిమా ఇది.