రుద్ర విరాజ్ హీరోగా పరిచయమవుతూ అతనే దర్శకత్వం వహించిన సినిమానే 'వీరరాజు 1991'. అర్చన కథానాయికగా నటించిన ఈ సినిమా, మే 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. అయితే పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు వచ్చి వెళ్లిందనేది చాలామందికి తెలియదు. అలాంటి ఈ సినిమా ఒక వారంలోనే 'ఆహా' ఓటీటీ ట్రాక్ పైకి వచ్చేసింది. ఈ సినిమా కథేమిటనేది తెలుసుకుందాం. 

కథ: అది నెల్లూరు సముద్రతీరంలో ఒక గ్రామం. అక్కడి వాళ్లంతా మత్స్యకారులు. వాళ్లంతా సముద్రంపై ఆధారపడి  జీవనాన్ని కొనసాగించేవారే. చేపల వేట తప్ప వారికి మరో పని తెలియదు. ఆ గ్రామస్తులకు అండగా నిలిచే యువకుడే పోతురాజు (రుద్ర విరాజ్). నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న పోతురాజును, ఆయన మరదలు 'వల్లీ' (అర్చన) ఇష్టపడుతూ ఉంటుంది. పదవి - అధికారం లేకపోయినా, ఆ గ్రామస్తులను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి 'దేవరాజు' ( అజయ్ ఘోష్) ప్రయత్నిస్తూ ఉంటాడు. 

సముద్రం నుంచి పోతురాజు మనుషులు తెచ్చిన చేపలకు దేవరాజు రేటు నిర్ణయించవలసిందే .. ఆయన కొనవలసిందే. అందువలన పోతురాజు మినహా మిగతా వాళ్లంతా ఆయనకి భయపడుతూ ఉంటారు. దేవరాజు కొడుకే శేషు. ఆడపిల్లల వెంటపడటం .. వేధించడం ఆయన పని. అలాగే ఒకసారి అతను 'వల్లీ'ని వేధించబోయి, పోతురాజు చేతిలో తన్నులు తింటాడు. అప్పటి నుంచి శేషు - పోతురాజు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూ ఉంటుంది. 

ఈ సముద్రతీరం వైపుకు వచ్చిన ఒక్కొక్కరూ మిస్సవ్వడం మొదలవుతుంది. ఈ మిస్టరీని ఛేదించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు కూడా అదృశ్యమవుతూ ఉంటారు. దాంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తుంది. ఆ ఆఫీసర్ కి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? జరుగుతున్న సంఘటనలకు కారకులు ఎవరు?  వల్లీతో పోతురాజు వివాహం జరుగుతుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: సముద్రాన్ని నమ్ముకుని జీవించే ఒక జాలరి గూడెం. ఆ గూడానికి అండగా నిలిచే ఒక నాయకుడు .. ఆయను ఆరాధించే ఒక నాయిక. వాళ్ల జీవితాలు తన కనుసన్నలలో కొనసాగాలని భావించే ఒక ప్రతినాయకుడు. జల్సారాయుడిగా తిరుగుతూ పిల్ల విలనిజాన్ని ప్రదర్శించే అతని కొడుకు. ఇలా ఈ మూడు వైపుల నుంచి నడిచే కథ ఇది. ఇలా చూసుకుంటే .. ఇలాంటి కథలు ఇంతకుముందు చాలానే వచ్చాయి కదా .. ఇందులో కొత్తదనం ఏముంది? అనే ఆలోచన రావడం సహజమే.

ఆ కొత్తదనం కోసం దర్శకుడు కిడ్నాప్ లతో కథను మొదలుపెట్టాడు. అయితే ఈ కిడ్నాప్ ల ట్రాక్ పెద్దగా కిక్ ఇవ్వలేకపోయింది. ఆ వైపు నుంచి ప్రేక్షకులలో ఏ మాత్రం క్యూరియాసిటీని పెంచలేకపోయింది. హీరో పాత్రను .. విలన్ పాత్రను ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేయవలసింది. అజయ్ ఘోష్ విలనిజం వీక్ గా అనిపిస్తుంది. ఆయనను సరిగ్గా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది. 

 ఈ తరహా కంటెంట్ మాస్ ఆడియన్స్ కి వెంటనే ఎక్కేస్తుంది. అయితే అందుకు తగిన ఫైట్స్ కూడా పడాలి. అందుకు డైలాగ్స్ కూడా తోడుకావాలి .. ఆ డైలాగ్స్ కి సరైన బాడీ లాంగ్వేజ్ యాడ్ కావాలి. కానీ ఆ విషయాలను గురించి పెద్దగా పట్టించుకున్నట్టుగా అనిపించదు. ఫైట్స్ విషయంలోను కొత్తదనం వైపు వెళ్లలేదు. అందువలన ఒక రొటీన్ సినిమాగానే ఇది మిగిలిపోతుంది. 

పనితీరు: సముద్రం .. జాలరిగూడెం .. లోకల్ గా ఉండే హీరో - విలన్. ఈ పరిధిలోనే మెప్పించిన కథలు చాలా ఉన్నాయి. కథాకథనాలపై గట్టిగా కసరత్తు చేయకపోవడం వలన, ఆ జాబితాలోకి ఈ సినిమా చేరలేకపోయింది. అజయ్ ఘోష్ విలనిజానికి అతుకుడు మీసాలు అవసరం లేదు. ఆయన కళ్లు .. వాయిస్ చాలు. అతికించినట్టు తెలిసిపోయే ఆ మీసాలు, ఆయన పాత్రకు కనెక్ట్ కాకుండా అడ్డుపడుతున్నట్టుగా అనిపిస్తాయి. 

గూడెంలో జరిగే కథ కావడం వలన, నిర్మాణ విలువల గురించి చెప్పుకోవలసిన పని లేదు. దర్శకత్వం పరంగా .. నటన పరంగా .. రుద్ర విరాజ్ కి గల అనుభవ లేమి కనిపిస్తూనే ఉంటుంది. అతను ఇంకాస్త దృష్టి పెడితే, మాస్ యాక్షన్ వైపు నుంచి మరికొన్ని ప్రయత్నాలు చేయవచ్చు. ఫొటోగ్రఫీ .. సంగీతం .. ఎడిటింగ్ కథకి తగినట్టుగానే అనిపిస్తాయి.