కమెడియన్ గా చాలా వేగంగా ఎదుగుతూ వచ్చిన వారిలో సప్తగిరి కూడా కనిపిస్తాడు. కమెడియన్ గా చేస్తూనే, హీరోగానూ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన ఎక్కువ సమయాన్ని తీసుకోలేదు. అలా ఆయన హీరోగా చేసిన సినిమానే 'పెళ్లికాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది మార్చి 21న థియేటర్లకు వచ్చింది. నిన్నటి నుంచి ఈ సినిమా 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: అన్నపూర్ణ (అన్నపూర్ణమ్మ) స్నేహితురాలు సుగుణ, తన కూతురుకు ఫారిన్ సంబంధం చేసి, వాళ్లతో పాటు విదేశాలకు వెళ్లిపోతుంది. అయితే అప్పటికే అన్నపూర్ణ కూతురు లక్ష్మీకి వివాహమై పోవడం వలన, ఫారిన్ వెళ్లాలనే కోరిక నెరవేరకుండా పోతుంది. దాంతో అన్నపూర్ణ తన మనవరాలు కృష్ణప్రియ (ప్రియాంక శర్మ)కు ఫారిన్ సంబంధం చేయాలనీ, ఆమెతో పాటు కుటుంబమంతా విదేశాలకు వెళ్లిపోవాలని బలంగా నిర్ణయించుకుంటుంది. మిగతా వాళ్లంతా కూడా అదే ఆలోచనతో ఉంటారు. 

అదే ఊరుకు చెందిన ప్రసాద్ (సప్తగిరి) మలేషియాలో ఒక హోటల్లో మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన తండ్రి గోపాలరావు (మురళీధర్ గౌడ్)కి తన కొడుకు రెండు కోట్ల కట్నం తీసుకురావాలనే కోరిక ఉంటుంది. అలా చేయడం వల్లనే తన పూర్వీకుల పరువు ప్రతిష్ఠలు కాపాడినట్టు అవుతుందనేది అతని నమ్మకం. ఆ కారణంగా ప్రసాద్ కి సంబంధాలు కుదరకపోవడం .. అతని వయసు 40కి దగ్గర పడటం జరిగిపోతుంది. 

ఈ నేపథ్యంలోనే అందరూ అతనిని 'పెళ్లికాని ప్రసాద్' గా చెప్పకుంటూ ఉంటారు. ఫారిన్ వెళ్లాలనే ఆశ ఉన్న కృష్ణప్రియ, ప్రసాద్ ఆ ఊరికి వచ్చినప్పుడు లైన్లో పెడుతుంది. ఆ ఫ్యామిలీకి ఫారిన్ పిచ్చి ఉందని తెలియని ప్రసాద్, ఆమె గాలానికి చిక్కుతాడు. తాను ఫారిన్ లో జాబ్ మానేసిన విషయాన్ని చెప్పకుండా, పైసా కట్నం తీసుకోకుండా ఆమె మెడలో మూడుముళ్లు వేసేస్తాడు. పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనేదే మిగతా కథ. 

విశ్లేషణ: సప్తగిరికి మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఆయన హీరోగా చేసినప్పటికీ, ఆ కథ కామెడీ ప్రధానంగానే ఉండేలా చూసుకుంటూ వెళుతున్నాడు. అలాంటి కామెడీ కంటెంట్ ఈ సినిమాలో ఉందా అంటే, ఉందనే చెప్పాలి. ఓటీటీ ఆడియన్స్ ను హాయిగా నవ్వించే కామెడీ వర్కౌట్ అయిందా అంటే అయిందనే అనాలి. ఓ మాదిరి బడ్జెట్ లోనే, ఫరవాలేదనిపించే అవుట్ పుట్ ను దర్శకుడు ఇచ్చాడనే అనుకోవాలి. 

ఈ కథలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. తన కొడుకు రెండు కోట్లు కట్నం తేవలసిందే అని భీష్మించుకు కూర్చున్న తండ్రి .. మరో వైపున ఫారిన్ లో సెటిలైన వాడినే పెళ్లి చేసుకోవాలనే హీరోయిన్. వాళ్లిద్దరి ఆశలను ఆవిరిచేస్తూ ఫారిన్ లో జాబ్ మానేసి వచ్చిన హీరో, కాణీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ లైన్ వినోదభరితంగా సాగుతుంది. 

కథా కథనాలతో పాటు, గ్రామీణ వాతావరణం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. అత్యాశతో ఆరాటపడే రెండు కుటుంబాల చుట్టూ దర్శకుడు సన్నివేశాలను అల్లుకుంటూ వచ్చిన తీరు మెప్పిస్తుంది. మొదటి నుంచి చివరివరకూ ఎక్కడ బోర్ కొట్టకుండా నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ మాత్రం బడ్జెట్ లో .. ఈ స్థాయి ఎంటర్టైన్ మెంట్ ఓకే అనిపిస్తుంది. 

పనితీరు: కామెడీ విషయంలో సప్తగిరి వంకబెట్టలేం. డబ్బు బలహీనత కలిగిన పాత్రలో మురళీధర్ గౌడ్ కూడా బాగా చేశాడు. అయితే హీరోయిన్ ఎంపిక వైపు నుంచి మాత్రం కాస్త తక్కువ మార్కులే పడతాయని చెప్పాలి. అన్నపూర్ణ .. ప్రమోదిని నటన సరదాగా అనిపిస్తుంది. శేఖర్ చంద్ర సంగీతం .. సుజాత సిద్ధార్థ్ ఫొటోగ్రఫీ .. మధు ఎడిటింగ్ ఫరవాలేదు. 

ముగింపు: కథ .. కథనం .. గ్రామీణ నేపథ్యం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. డబ్బు ఆశ .. విదేశీ వ్యామోహం కలిగినవారి మధ్యలో 'పెళ్లికాని ప్రసాద్' ఎలా నలిగిపోయాడనే ఈ కథాంశం  సరదాగా నవ్విస్తుంది. ఆశించిన వినోదాన్ని అందిస్తుంది.