రీతూ వర్మ .. సూర్య వశిష్ఠ .. శివ కందుకూరి ప్రధానమైన పాత్రలను పోషించిన వెబ్ సిరీస్ 'దేవిక & డానీ'. కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ రోజు నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. 7 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ కోసం కొన్ని రోజులుగా ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తూ వస్తున్నారు. అలాంటి ప్రేక్షకులకు ఈ సిరీస్ ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

కథ: దేవిక (రీతూ వర్మ) సంప్రదాయ బద్ధమైన కుటుంబానికి చెందిన యువతి. ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామీణ ప్రాంతంలో ఆమె కుటుంబం నివసిస్తూ ఉంటుంది. ఆమె తల్లి కౌసల్య .. (రజిత) తండ్రి స్వామినందన్ (శివన్నారాయణ). ఆమె తాతయ్య యోగి నందన్ (రామరాజు)కి కొన్ని శక్తులు ఉంటాయి. ఆయనకి చనిపోయినవారి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. దేవిక ఒక స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ప్రతిరోజూ బస్సులో ఆ స్కూల్ కి వెళ్లి వస్తూ ఉంటుంది.

దేవికకి జగ్గీ (సుబ్బరాజు)తో నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్లి ముహూర్తం 3 నెలల వరకూ లేకపోవడంతో, అప్పటివరకూ వెయిట్ చేయవలసి వస్తుంది. అయితే దేవిక జాతకం చూసిన ఓ జ్యోతిష్కుడు ఈ మూడు నెలలలో ఆమె మరొకరితో ప్రేమలోపడే అవకాశం ఉందని చెబుతాడు. ఆ మాట విన్న దగ్గర నుంచి దేవిక తండ్రి ఆందోళన చెందుతూనే ఉంటాడు. అయితే ఈ విషయాన్ని ఆయన తన మనసులోనే దాచుకుంటాడు.   

ఒక రోజున ఆమె దగ్గరికి డానీ (సూర్య వశిష్ఠ) వచ్చి పరిచయం చేసుకుంటాడు. తాను చూస్తున్నది అతని ఆత్మననీ .. అతను చనిపోయి కొంతకాలమైందని తెలుసుకుని దేవిక షాక్ అవుతుంది. తన వలన 'గాయత్రి' కుటుంబానికి అన్యాయం జరిగిందనీ, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి గాను తనకి సహకరించమని డానీ ఆత్మ కోరుతుంది. గాయత్రి ఎవరు? ఆమెకి డానీ చేసిన అన్యాయం ఎలాంటిది? జగ్గీతో నిశ్చితార్థం చేసుకున్న దేవిక, నిజంగానే వేరొకరితో లవ్ లో పడుతుందా? అనే అంశాలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతుంది. 

విశ్లేషణ: రీతూ వర్మ ఇంతవరకూ చేసిన సినిమాలు .. పాత్రలు కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆమెకి మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు 'దేవిక & డానీ' ప్రమోషన్స్ కారణంగా కూడా ఈ సిరీస్ అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చింది. రీతూ వర్మ చేసింది అంటే, కంటెంట్ లో గట్టి పాయింట్ ఉండే ఉంటుందనే ఒక అంచనాకు రావడం సహజమే. మరి ఆ అంచనాలను ఈ సిరీస్ అందుకోగలిగిందా అంటే, లేదనే చెప్పాలి.

'దేవిక & డానీ' .. రెండూ ఇంగ్లిష్ లో 'D'తో స్టార్ట్ కావొచ్చు. కానీ తెలుగులో రాయడానికి .. పలకడానికి కూడా మ్యాచ్ కాని పేర్లు ఇవి. దర్శకుడు ఎంచుకున్న లైన్ .. చెప్పాలనుకున్న పాయింట్ కొత్తవేమీ కాకపోయినప్పటికీ, మ్యాజిక్ చేయొచ్చు . కానీ ఆ స్థాయి ఆవిష్కరణ జరగలేదు. పాత్రలు .. సన్నివేశాలు వెంటనే రియాక్ట్ కావు. నిదానంగా .. నింపాదిగా కదులుతూ ఉంటాయి. దేవిక - డానీ పాత్రల పరిచయం కృతకంగా మొదలు కావడంతోనే ప్రేక్షకులు నిరాశాకి లోనవుతారు. 

ఇక రామరాజు పాత్ర ఇంట్రడక్షన్ ఇంట్రెస్టింగ్ గా ఇచ్చారు. ఈ పాత్ర వైపు నుంచి ఆసక్తికరమైన అంశం ఏదో ఉందని ప్రేక్షకులు అనుకునేలోపు, అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దంటూ నీరు గార్చారు. శివ కందుకూరి పాత్ర విషయానికి వస్తే, చెప్పుకోదగినదేం కాదు. సుబ్బరాజు పాత్ర .. ఆయన యాక్టింగ్ కొంతవరకూ హెల్ప్ అయ్యాయి. అలాగే అభినయశ్రీ .. షణ్ముఖ్ రోల్స్ ను ఇంకాస్త  పవర్ఫుల్ గా డిజైన్ చేసి వాడుకోవడానికి అవకాశం ఉంది. ఒక మంచి పాత్ర కోసం కోవై సరళను తీసుకున్నారు గానీ, ఎమోషన్స్ వైపు నుంచి ఆమెను ఉపయోగించుకోలేకపోయారు. ఇన్నింటి మధ్య కాస్త ఉపశమానం కలిగించేవి ఏవైనా ఉన్నాయంటే, అవి విలేజ్ లొకేషన్స్ అనే చెప్పాలి.  

పనితీరు: రీతూ వర్మ .. సుబ్బరాజు నటన కొంతవరకూ ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలను మరింత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుంటే బాగుండేది. సోనియా సింగ్ ఆకర్షణీయంగా మెరిసింది. వెంకట్ దిలీప్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జై క్రిష్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. కార్తికేయన్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. 

ముగింపు: ట్రైలర్ తో అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చిన ఈ సిరీస్, నిదానంగా సాగే కథాకథనాలతో .. రొటీన్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుంచింది.