తమిళంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ 'డీమన్'. రమేష్ పళనివేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2023లో సెప్టెంబర్ 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. సచిన్ మణి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందనేది చూద్దాం. 

కథ: విఘ్నేశ్ (సచిన్ మణి)కి సినిమా డైరెక్టర్ కావాలనే కోరిక బలంగా ఉంటుంది. ఫ్రెండ్స్ తో కలిసి అందుకు అవసరమైన ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. అలాగే 'కార్తీక'తో కలిసి ప్రేమవ్యవహారం కూడా నడుపుతూ ఉంటాడు. ఒక హారర్ కథను రెడీ చేసుకోవాలనుకున్న విఘ్నేశ్, ప్రశాంతంగా కథను రాసుకోవాలనే ఉద్దేశంతో, ఒక ఫ్లాట్ ను రెంట్ కి తీసుకుంటాడు. 

అపార్టుమెంటులో అన్నీ త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఉంటాయనీ, ఆ ఒక్క ఫ్లాట్ మాత్రమే డబుల్ బెడ్ రూమ్ వచ్చిందని విఘ్నేశ్ తో ఓనర్ కృష్ణ చెబుతాడు. అందువల్లనే తక్కువకి ఇచ్చానని అంటాడు. ఆ ఫ్లాట్ లోకి దిగిన రోజు రాత్రి నుంచి విఘ్నేశ్ కి భయంకరమైన కలలు రావడం .. చిత్రమైన సంఘటనలు ఎదురవుతూ ఉండటం మొదలవుతుంది. తన చుట్టూ రకరకాల ప్రేతాత్మలు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది.

విఘ్నేశ్ తన ఫ్రెండ్స్ తో ఈ విషయం చెప్పినప్పటికీ, వాళ్లు పెద్దగా పట్టించుకోరు. మానసిక వ్యాధితో తాను బాధపడుతున్నానేమో అనే అనుమానం కూడా అతనికి కలుగుతుంది. అయితే రాన్రాను ఆ ఫ్లాట్ లో ఉండటానికీ .. నిద్రపోవడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. అతను ఏమైపోతాడోనని ఫ్రెండ్స్ కంగారుపడుతూ ఉంటారు. ఆ ఫ్లాట్ లో తిరుగుతున్న ప్రేతాత్మలు ఎవరివి? అవి విఘ్నేశ్ ను ఎందుకు టార్గెట్ చేస్తాయి? దర్శకుడు కావాలనే విఘ్నేశ్ కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: హారర్ థ్రిల్లర్ సినిమాలలో దెయ్యాలు ఉంటాయని తెలిసే ఆడియన్స్ చూస్తారు. దెయ్యాలుగా మారింది ఎవరు? అందుకు కారణం ఏమిటి? వాటి కారణంగా హీరో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయవలసి వస్తుంది? వాటి బారి నుంచి బయటపడటానికి అతను ఏం చేస్తాడు? అనే ఒక కుతూహలం ఆడియన్స్ లో ఉంటుంది. అలాంటి ఒక కుతూహలంతో ఈ సినిమా ముందు కూర్చున్న ప్రేక్షకులకు నిరాశ తప్పదనే చెప్పాలి. 

దెయ్యాల సినిమా అనగానే నాలుగు గోడలు దాటి బయటికి వెళ్లకూడదు అన్నట్టుగా, ఒక బంగ్లాకి గానీ .. ఒక ఫ్లాట్ కి గాని పరిమితమవుతూ ఉంటాయి. ఈ కథా కూడా అదే మార్గంలో నడుస్తుంది.  పాడుబడిన బంగ్లాలలో దెయ్యాల గోల భయపెట్టినట్టుగా, సిటీ మధ్యలో ఉన్న ఫ్లాట్ లోని దెయ్యాలు భయపెట్టలేవు. ఎందుకంటే దెయ్యాలు ఉండటానికి కూడా ఒక వాతావరణం కల్పించాలి .. ఈ కథలో అదే లేదు. 

ఈ తరహా సినిమాలలో దెయ్యాలు భయపెట్టడం ఒక ఎత్తయితే, అవి దెయ్యాలుగా మారడానికి దారితీసిన ఫ్లాష్ బ్యాక్ కూడా అంతే ముఖ్యం. ఈ రెండు విషయాలలోను ఈ సినిమా బలహీనంగానే అనిపిస్తుంది. ఇక అసలు విషయాన్ని రివీల్ చేయడానికి దర్శకుడు చాలా సమయాన్ని ఖర్చు చేశాడు. అంతసేపు ఓపిక పట్టినందువలన ఏమైనా ప్రయోజనం ఉందా అంటే అదీలేదు. దెయ్యాలకు భయపడుతూ హీరో చేసే ఏకాపాత్రాభినయమే ఎక్కువగా ఉంటుంది. 

పనితీరు: కథ .. స్క్రీన్ ప్లే .. దెయ్యాల మేకప్ తో సహా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆనంద్ కుమార్ ఫొటోగ్రఫీ .. రోనీ రాఫెల్ నేపథ్య సంగీతం .. రవికుమార్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.

ముగింపు: దెయ్యాల బారిన పడిన హీరో, అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడనేది కథ. అయితే ఈ కథ ఆసక్తికరంగా కాకుండా నిదానంగా .. రొటీన్ గా సాగింది. ఈ తరహా సినిమాలలో ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన పాత్రను పోషించవలసి ఉంటుంది. కానీ అలా జరగలేదు. భయపెట్టవలసిం ఈ సినిమా, కాసేపు చిరాకుపెడుతుంది అంతే.