సన్నీడియోల్ కథానాయకుడిగా రూపొందిన బాలీవుడ్ సినిమానే 'జాట్'. తెలుగులో 'క్రాక్' .. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదలైన ఈ సినిమా, 120 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ నెల 5వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఆంధ్రప్రదేశ్ - ప్రకాశం జిల్లా .. 'మోటుపల్లి' పరిసర గ్రామాల ప్రజలంతా భయంతో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతూ ఉంటారు. అందుకు కారకుడు రణతుంగా ( రణదీప్ హుడా). ఆయన .. ఆయన తమ్ముళ్లు సోములు (వినీత్ కుమార్) .. రామసుబ్బా రెడ్డి (అజయ్ ఘోష్) అక్కడి ప్రజలపై పెత్తనం చేస్తుంటారు. అవినీతి అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతూ ఉంటారు. 

ఈ విషయం ఒక పాప రాసిన లెటర్ ద్వారా రాష్ట్రపతి (రమ్యకృష్ణ)కి తెలుస్తుంది. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకుని యాక్షన్ తీసుకోమని సీబీఐ ఆఫీసర్ సత్యమూర్తి (జగపతిబాబు)కి రాష్ట్రపతి నుంచి ఆదేశాలు అందుతాయి. దాంతో ఆయన ఆ గ్రామానికి బయల్దేరతాడు. ఈ విషయం సెంట్రల్ మినిస్టర్ (రవిశంకర్) కి తెలుస్తుంది. ఎలాగైనా సత్యమూర్తిని వెనక్కి తిరిగిపోయేలా చేయాలని ఆయన భావిస్తాడు. 

ఇక ఇదే సమయంలో 'మోటుపల్లి' గ్రామ పరిసరాల మీదుగా వెళుతున్న ట్రైన్ కొన్ని కారణాల వలన అక్కడ ఆగిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న జాట్ (సన్నీడియోల్), అక్కడికి దగ్గరలోని ఓ కాకా  హోటల్ కి వెళతాడు. అక్కడికి వచ్చిన రణతుంగా మనుషులతో ఆయనకి గొడవ అవుతుంది. దాంతో రణతుంగా మనుషులను తీసుకునే జాట్ నేరుగా ఆయన ఇంటికి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? జాట్ ఎవరు? రణతుంగా నేపథ్యం ఏమిటి? అక్కడి గ్రామస్తులతో ఆయనకున్న గొడవేంటి? మినిస్టర్ తో ఆయనకున్న సంబంధం ఏమిటి?  అనేది మిగతా కథ.          

విశ్లేషణ: గోపీచంద్ మలినేనికి మాస్ ఆడియన్స్ నచ్చేలా యాక్షన్ కథలను ఎలా తెరకెక్కించాలనేది బాగా తెలుసు. ఇంతవరకూ ఆయన చేస్తూ వచ్చిన సినిమాలే అందుకు నిదర్శనం. తనకి బాగా తెలిసిన యాక్షన్ పాఠాన్ని బాలీవుడ్ ఆడియన్స్ కి చెప్పడం కోసం ఆయన రూపొందించిన సినిమానే 'జాట్'. 

ఇది యాక్షన్ జోనర్ కి చెందిన కథ కావడంతో .. యాక్షన్ సీన్స్ తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఆ తరువాత కూడా వెంటవెంటనే యాక్షన్ ఎపిసోడ్స్ తగులుతూనే ఉంటాయి. ఒక వైపున హీరో .. ఒక వైపున విలన్ .. మరో వైపున ప్రజలు .. ఇంకోవైపు నుంచి ప్రభుత్వం .. ఇలా ఈ నాలుగు వైపుల నుంచి కథ నడుస్తూ ఉంటుంది. హీరో - విలన్ ట్రాకుల వరకూ కాస్త బలంగానే కనిపిస్తాయి గానీ, మిగతా ట్రాకులు ఆ స్థాయిలో మెప్పించలేకపోయాయి. 

రమ్యకృష్ణ .. జగపతిబాబు పాత్రలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కథ ఆరంభంలో హడావిడిగా ఫ్లైట్ లో స్పాట్ కి బయల్దేరిన జగపతిబాబు, క్లైమాక్స్ లో అక్కడి చేరుకోవడం కరెక్టుగా అనిపించదు. యాక్షన్ సీన్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. వేటకొడవళ్లు .. ఎగిరిపడుతున్న తలలే తెరపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కథను అటు పరిగెత్తించి .. ఇటు పరిగెత్తించి తిరిగి తీసుకొచ్చి రొటీన్ గాటానికి కట్టేయడమే నిరాశను కలిగించే విషయం.   

పనితీరు: సన్నీడియోల్  .. రణదీప్ హుడా .. రెజీనా నటన ఆకట్టుకుంటుంది. మిగతా వాళ్లంతా పాత్ర పరిధిలో మెప్పించారు.  గోపీచంద్ మలినేని టేకింగ్ గురించి ఇక్కడి ఆడియన్స్ కి తెలుసు. యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేయించిన తీరు .. ఎమోషన్స్ ను  కనెక్ట్ చేయడానికి ట్రై చేసిన విధానం .. ట్విస్టులు రివీల్ చేసే పద్దతిలో ఆయన మార్క్ కనిపిస్తుంది.

 రిషి పంజాబి ఫొటోగ్రఫీ .. తమన్ నేపథ్య సంగీతం .. ఆకట్టుకుంటాయి. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే. యాక్షన్ ఎపిసోడ్స్ కొంతవరకూ ఆసక్తికరంగానే అనిపిస్తాయి. ఇంకాస్త కొత్తగా ట్రై చేయడానికి అవకాశం ఉందని కూడా అనిపిస్తుంది. 

ముగింపు: ఇది సన్నీడియల్ ఇమేజ్ కీ .. ఆయన పర్సనాలిటీకి తగిన కథనే. అలాగే గోపీచంద్ మలినేని మార్క్ కనిపించే కథనే. కాకపోతే రొటీన్ కి భిన్నంగా లేకపోవడమే కాస్తంత అసంతృప్తిని కలిగించే విషయం.