రానా - వెంకటేశ్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'రానా నాయుడు' 2023 మార్చిలో స్ట్రీమింగ్ కి  వచ్చింది. సుపర్న్ వర్మ - కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, యాక్షన్ క్రైమ్ జోనర్లో ప్రేక్షలకులను పలకరించింది. సీజన్ 1లో 10 ఎపిసోడ్స్ గా పలకరించిన ఈ సిరీస్, ఇప్పుడు 8 ఎపిసోడ్స్ గా అందుబాటులోకి వచ్చింది. సీజన్ 2లో ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: రానా నాయుడు (రానా) తన ఫ్యామిలీని సేఫ్  గా ఉంచాలనీ, ఆర్ధికంగా ఫ్యామిలీని సెటిల్ చేయాలని భావిస్తాడు. అందుకోసం అప్పటివరకూ చేస్తూ వచ్చిన పనులను మానేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ రానా నాయుడిని తిరిగి తనదారికి తెచ్చుకోవాలని ఓబీ మహాజన్ (రాజేశ్ జైష్) ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన కారణంగా జైలు నుంచి బయటికి వచ్చిన గ్యాంగ్ స్టర్ రౌఫ్ మీర్జా ( అర్జున్ రామ్ పాల్), తన కజిన్ ను చంపిన రానా నాయుడిపై ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం వెయిట్ చేస్తుంటాడు.  

ఓబీ మహాజన్ .. రానా నాయుడిని బ్లాక్ మెయిల్ ద్వారా తన దారికి తెచ్చుకోవడం కోసం, ఆయన భార్య మీదికి పోలీస్ ఆఫీసర్ నవీన్ జోషీని ఉసిగొల్పుతాడు. ఈ విషయం తెలియని రానా నాయుడు భార్య నైనా ( సుర్వీన్ చావ్లా) ఆయన ఆకర్షణలో పడుతుంది. డబ్బుకోసం నాగా నాయుడుతో కలిసి బ్యాంకు దొంగతనానికి పాల్పడిన తేజు, పోలీసులకు దొరికిపోతాడు. తల్లి పట్టించుకోని కారణంగా రానా నాయుడు కూతురు నిత్య, రేహాన్ తో కలిసి షికార్లు చేస్తూ ఉంటుంది.

విరాజ్ ఒబెరాయ్ కూతురు అలియా (కృతి కర్బందా)తో కలిసి క్రికెట్ కి సంబంధించిన బిజినెస్ చేయాలని రానా నాయుడు భావిస్తాడు. ఆమె తన పట్ల ఆకర్షితురాలైనా ఆయన పట్టించుకోడు. అలాంటి పరిస్థితుల్లోనే రేహాన్ ను .. అతని తండ్రిని రౌఫ్ హత్య చేస్తుంటే రానా నాయుడి కూతురు 'నిత్య' చూస్తుంది. దాంతో ఆమెను చంపాలని రౌఫ్ నిర్ణయించుకుంటాడు. భార్య .. కూతురు విషయాలు, అన్న జైల్లో ఉన్న సంగతి రానా నాయుడికి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: 'రానాయుడు సీజన్ 2' స్ట్రీమింగులోకి రాగానే, ఇది సీజన్ 1కి మించి ఉందా? .. లేదా? అనే ఒక ప్రశ్న అందరిలో తలెత్తడం సహజం. మొదటి సీజన్ విషయంలో తెలుగు ఆడియన్స్ వైపు నుంచి కాస్త ఘాటైన విమర్శలే వచ్చాయి. అందువలన ఆడియన్స్ మొదటి సందేహం ఆ వైపు నుంచే ఉంటుంది. మొదటి సీజన్ లో కంటే ఈ సీజన్ లో బూతులు .. హద్దులు దాటిన శృంగార సన్నివేశాల విషయంలో చాలావరకూ నియంత్రణ పాటించారనే చెప్పాలి. 

రానా నాయుడు సీజన్ 1లో అలా వదిలేసిన ట్రాకులను .. సీజన్ 2 లో కొనసాగించారు. మొదటి 3 ఎపిసోడ్స్ కాస్త నిదానంగా నడుస్తాయి. 4 ఎపిసోడ్ నుంచి కథ ఊపందుకుంటుంది. మొత్తం కథలో  రానా .. అర్జున్ రామ్ పాల్ పాత్రలు ప్రధానమైనవిగా కనిపిస్తాయి. ఈ రెండు పాత్రలను హైలైట్ చేశారు. వెంకటేశ్ పాత్రకి కూడా ఓ మాదిరి ప్రాముఖ్యత మాత్రమే దక్కింది. మిగతా వారి పాత్రలు అవసరమైనంత బలం లేకపోవడం వలన తేలిపోతాయి. 

కుటుంబం కోసం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి .. వాళ్ల కోసం కష్టపడాలి. అయితే అందుకు తగిన మార్గాలు ఎంచుకోవాలి. మనం ఎంచుకునే మార్గం సరైనది కాకపోతే .. మనం కుటుంబం ముందే దోషిగా నిలబడవలసి వస్తుంది .. అనే సందేశాన్ని ఇచ్చిన తీరు బాగుంది. అక్కడక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు .. డైలాగ్స్ ఉన్నప్పటికీ, అవి హద్దులు దాటకుండా చూసుకున్నారు. 

పనితీరు: కథాకథనాలను భారీతనంతో కలిపి నడిపించిన తీరు బాగుంది. యాక్షన్ కి అక్కడక్కడా ఎమోషనల్ టచ్ ఇస్తూ వెళ్లిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఇక వెంకటేశ్ పాత్రతో కాస్త కామెడీ టచ్ ఇచ్చారు. రొమాంటిక్ టచ్ ఉండనే ఉంది. ఏ పాత్రను అనామకంగా వదిలేయకుండా వేసిన స్క్రీన్ ప్లే .. ఆ పాత్రల మధ్య నడిపించిన డ్రామా బాగుంది. అయితే కొన్ని పాత్రలు బలహీనంగా అనిపించడం మాత్రం అసంతృప్తిని కలిగిస్తుంది.   

రానా బాడీ లాంగ్వేజ్ .. అర్జున్ రామ్ పాల్ నటన బాగున్నాయి. వెంకటేశ్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కృతి కర్బందా కూడా అందంగా మెరిసింది. ఆమె పాత్ర నిడివిని పెంచితే బాగుండేదని అనిపిస్తుంది. మిగతా ఆర్టిస్టులు కూడా సహజత్వాన్ని తీసుకొచ్చారు. ఓబీ మహాజన్ .. విరాజ్ ఒబెరాయ్ .. పాత్రలకు పవర్ జోడించి ఉంటే, కంటెంట్ ఇంకాస్త స్ట్రాంగ్ గా కనిపించేదనే భావన కలుగుతుంది. జాన్ స్కిమిద్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జాన్ సీవర్ట్ నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. నైనాద్ ఎడిటింగ్ ఫరవాలేదు.             
      
ముగింపు: మొదటి 3 ఎపిసోడ్స్ నిదానంగా సాగినా, ఆతరువాత కథ ఊపందుకుంటుంది. రానా - అర్జున్ రాంపాల్ పాత్రలు ఈ సీజన్ లో హైలైట్ అయ్యాయి. మిగతా పాత్రలు కాస్త బలహీనపడ్డాయి. యాక్షన్ .. ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుంటాయి. బూతులు .. మోతాదు మించిన శృంగార సన్నివేశాల విషయంలో నియంత్రణ పాటించడం ఆశించిన పరిణామమే.