తమిళంలో 'యుగి' అనే ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ రూపొందింది. కథిర్ .. ఆనంది .. నరేన్ .. నట్టి సుబ్రమణియన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, నవంబర్ 18 .. 2022లో థియేటర్లకు వచ్చింది. అలంటి ఈ సినిమా కాస్త ఆలస్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'కార్తీక: మిస్సింగ్ కేస్' టైటిల్ తో, ఈ నెల 13వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. 

కథ: కార్తీక (ఆనంది) ఓ యువకుడిని ప్రేమించి, తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటుంది. ఇద్దరూ కలిసి వేరే ఊర్లో కాపురం పెడతారు. కార్తీక భర్తకి యాక్సిడెంట్ జరుగుతుంది. దాంతో హడావిడిగా ఆమె హాస్పిటల్ కి పరిగెడుతుంది. అతను బ్రతకాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందని డాక్టర్ చంద్రిక (వినోదిని) చెబుతుంది. శ్రీమంతుడైన గురుప్రసాద్ ఫ్యామిలీ కోసం కార్తీక తన కడుపున ఒక బిడ్డను మోయడానికి అంగీకరిస్తే, ఆమె భర్త బ్రతకడానికి అవసరమైన డబ్బును వాళ్లు సర్దుతారని చంద్రిక చెబుతుంది. 

భర్తను బ్రతికించుకోవడం కోసం కార్తీక అందుకు అంగీకరిస్తుంది. హాస్పిటల్లో ఉన్న కార్తీక భర్త కోలుకుంటున్నదీ లేనిది చెప్పకుండా, డాక్టర్ చంద్రిక కాలయాపన చేస్తూ వెళుతుంది. అలా కార్తీక గర్భం దాల్చేలా చేస్తుంది. అయితే గురుప్రసాద్ .. ఆయన భార్య గొడవపడి విడిపోతారు. కార్తీక గర్భంలో పెరుగుతున్న బిడ్డ తమకి అవసరం లేదని తేల్చేస్తారు. దాంతో ఆమె నివ్వెరపోతుంది. ఈ విషయంలో డాక్టర్ చంద్రిక కూడా చేతులెత్తేస్తుంది.

తన కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతి .. తనని తన భర్త అపార్థం చేసుకుంటాడేమో అనే సంగతి తరువాత, ముందుగా తన భర్తను తనకి చూపించమని కార్తీక ఫైట్ చేయడం మొదలుపెడుతుంది. తరువాత నుంచి కార్తీక కనిపించకుండా పోతుంది. కార్తీక ఏమైపోయింది? ఆమె భర్త పరిస్థితి ఏమిటి? కార్తీక మిస్సింగ్ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తాయి? ఈ కేసు విషయంలో డిటెక్టివ్ 'నందా'కు, సీబీఐ ఆఫీసర్ సేతుమాధవన్ కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ.

విశ్లేషణ: ఇది తమిళంలో రూపొందిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినవాళ్లు అవసరాలలో .. ఆపదలో ఉన్నప్పుడు, కొంతమంది వాళ్లను తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని చూస్తారు. అలాంటి కఠినాత్ములకు ఒక సాధారణ యువతి ఎలా ఎదురు తిరిగింది? తన భార్య కోసం ఆమె భర్త ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది ఈ సినిమా కథ. 

నిజానికి ఇది చాలా తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో నిర్మించిన సినిమా. ఈ సినిమాలో ఈ మాత్రం కంటెంట్ ఉంటుందని ఎవరూ పెద్దగా ఊహించరు. ఒక మిస్సింగ్ కేసులో మరో మిస్సింగ్ కేసు ముడిపడి ఉండటం ఈ కథలోని మరో ట్విస్ట్. ఒక వైపు నుంచి సస్పెన్స్ .. మరో వైపు నుంచి ఎమోషన్ ను పెనవేస్తూ ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లిన తీరు బాగుంది. ప్రమాదం మరో వైపు నుంచి కూడా పొంచి ఉందని చెబుతూ, ఆలోచింపజేసే ఈ కథ ఆకట్టుకుంటుంది.              

దర్శకుడు నాలుగే ప్రధానమైన పాత్రలను ఎంచుకున్నాడు. ఈ నాలుగు పాత్రల చుట్టూనే కథను నడిపించాడు. ఈ నాలుగు పాత్రలను ఆయన డిజైన్ చేసిన తీరు, ఈ సినిమాను నిలబెట్టిందని చెప్పచ్చు. కథ ఎక్కడా కూడా మెయిన్ ట్రాక్ నుంచి పక్కకి వెళ్లదు. ప్రధానమైన పాత్రల పట్ల సానుభూతిని పెంచుతూ కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

పనితీరు:  ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించిన ఆనంది .. ప్రత్యేకమైన ఆకర్షణ అనే చెప్పాలి. తన భర్త కోసం తపించే ఒక సాధారణ యువతి పాత్రలో ఆమె మెప్పించింది. కళ్లతోనే ఆమె పలికించిన హావభావాలు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. ఇక మిగతా పాత్రలకు ఆయా ఆర్టిస్టులు న్యాయం చేకూర్చారు. 

పుష్పరాజ్ సంతోష్ ఫొటోగ్రఫీ .. రంజిన్ రాజ్ సంగీతం .. జోమిన్ మ్యాథ్యూ ఎడిటింగ్ కథను సపోర్ట్ చేశాయి. ఈ కథను సాధ్యమైనంత సహజంగా ప్రేక్షకులకు చేరవేయడంలో సక్సెస్ అయ్యాయి.

ముగింపు: ఈ సినిమా, ఓ మాదిరి బడ్జెట్ లో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను అందించిందనే చెప్పాలి. కొత్తగా పెళ్లైన ఒక జంట, ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమతో స్వార్థ శక్తులను ఎలా ఎదుర్కొన్నారు? అనే ఈ కథను .. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.