నవీన్ చంద్ర ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్లో సినిమాలు .. సిరీస్ లు చేస్తూ వెళుతున్నాడు. అలా రీసెంటుగా ఆయన చేసిన సినిమానే 'బ్లైండ్ స్పాట్'. రాకేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 9వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లోని ఈ కథలో ఏముందో చూద్దాం. 

కథ: జైరామ్ (రవి వర్మ) ఓ బిజినెస్ మేన్. ఆయన భార్యనే దివ్య (రాశి సింగ్). జైరామ్ మొదటి భార్య సరస్వతి అనారోగ్య కారణంగా చనిపోతుంది. ఆమె కొడుకు వినోద్ మానసికంగా కాస్త దెబ్బతింటాడు. అలాంటి పరిస్థితుల్లోనే దివ్య ను పెళ్లి చేసుకుని జైరామ్ తన ఇంటికి తీసుకొస్తాడు. అయితే వాళ్ల కాపురం ఎక్కువ కాలం పాటు అన్యోన్యంగా సాగదు. తరచూ ఇద్దరూ గొడవపడుతూ ఉంటారు. ఆ ఇంట్లో పనిచేసే లక్ష్మితో జైరామ్ కి సంబంధం ఉందనే దివ్య అనుమానం కూడా అందుకు ఒక కారణం. 

ఒక రోజున జైరామ్ బిజినెస్ పనిపై ముంబైకి బయల్దేరతాడు. ఆయన అలా వెళ్లగానే దివ్య ఉరేసుకుని చనిపోవడాన్ని లక్ష్మి చూస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తుంది. కానిస్టేబుల్ రాంబాబును తీసుకుని, పోలీస్ ఆఫీసర్ విక్రమ్ (నవీన్ చంద్ర) అక్కడికి చేరుకుంటాడు. దివ్య ఒక అనాథ అనీ ..  జైరామ్ కి మాత్రం ఆదిత్య (అలీ రెజా) అనే తమ్ముడు ఉన్నాడని తెలిసి అతనిని కూడా అక్కడికి పిలిపిస్తాడు.

చనిపోయిన దివ్యపై జైరామ్ చాలా అసంతృప్తిగా ఉంటాడు. ఆమె విషయంలో లక్ష్మి చాలా అసహనంతో ఉందని విక్రమ్ గ్రహిస్తాడు. ఇక లక్ష్మి కూతురు మానస తొమ్మిదో తరగతి చదువుతూ ఉంటుంది. ఆమె కూడా దివ్యపై ద్వేషంతో ఉందని విక్రమ్ గమనిస్తాడు. ఇక తన తల్లిని కోల్పోయిన సరస్వతి కొడుకు వినోద్ కూడా దివ్య పట్ల కోపంతో ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. వీళ్లలో దివ్యను హత్య చేసింది ఎవరు? నేరస్థులను విక్రమ్ ఎలా పట్టుకుంటాడు? అనేది కథ. 

విశ్లేషణ: క్రైమ్ థ్రిల్లర్ కథలలో ఒక నేరం జరుగుతుంది. ఆ నేరం ఎందుకు జరిగింది? నేరస్థుడు ఎవరు? నేరస్థుడిని ఎలా పట్టుకుంటారు? వంటి అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. ఈ కథలో అలా కుతూహలాన్ని రేకేతించే అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే, కొంతవరకూ ఉన్నాయనే చెప్పాలి. కాకపోతే కథ దాదాపుగా ఒక ఇంట్లో జరగడమే అసంతృప్తిని కలిగిస్తుంది. 

ఒక హత్య .. కొంతమంది అనుమానితులు .. అన్నట్టుగానే ఈ కథ నడుస్తుంది. ఒక్కో పాత్రను అనుమానిస్తూ రాసుకున్న కారణాలు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. ఇక ఒక పాత్రపైకి ఆడియన్స్ దృష్టిని మరల్చి .. మరో పాత్రను దోషిగా నిలబెట్టడం అనే విషయంలో పాత సూత్రాన్నే పాటించినా, ట్విస్ట్ బాగానే ఉందనిపిస్తుంది. ఆ ట్విస్ట్ వెనుక ఫ్లాష్ బ్యాక్ కూడా నమ్మబుల్ గానే ఉంటుంది.

సాధారణంగా ఒక మర్డర్ జరిగిందంటే .. అక్కడ పోలీసుల హడావిడి .. ఆధారాలు సేకరించేవారు ..ఇతర టీమ్ లు రంగంలోకి దిగడంవంటి ఒక వాతావరణం మనం చూస్తుంటాము. కానీ ఈ సినిమాలో  ఒక వైపున శవం .. మరో వైపున కుటుంబ సభ్యులు .. మధ్యలో ఇంటరాగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్. ఈ స్పాట్ లోనే సగానికి పైగా కథను కానిచ్చేశారు. ఇక్కడే కాస్త బోర్ అనిపిస్తుంది.               
పనితీరు: దర్శకుడు ఎంచుకున్న లైన్ ఫరవాలేదు. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ కూడా బాగానే ఉంది. అయితే కథ నాలుగు రకాలుగా .. నాలుగు చోట్ల పరిగెత్తాలి. ఒకే లొకేషన్ లో నిదానంగా సాగే కథను నింపాదిగా కూర్చుని చూడటం కొంచెం కష్టమైన పనే. ఈ సినిమా విషయంలో అలాంటి అనుభవమే ప్రేక్షకులకు ఎదురవుతుంది. ఫొటోగ్రఫీ ..  నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ గురించి మాట్లాడుకునే స్థాయి సన్నివేశాలు మనకి కనిపించవు. 

ముగింపు: ఒక అరడజను పాత్రలతో .. ఒక ఇంట్లో ప్లాన్ చేసిన సినిమా ఇది. 90 శాతం కథ ఇంట్లోనే నడుస్తుంది. చిన్న బడ్జెట్ లో ఈ మాత్రం కంటెంట్ ను ఇవ్వడాన్ని సరిపెట్టుకోవచ్చు. చివర్లో ట్విస్ట్ ఉంది .. కాకపోతే అక్కడి వరకూ నడిచే కథ రొటీన్ గానే అనిపిస్తుంది. బడ్జెట్ ను .. కథా పరిధిని ఇంకాస్త పెంచుకుని .. మిగిలిన అంశాలు కూడా జోడిస్తే మరింత బెటర్ గా ఉండేదేమో.