తమిళనాట విజయ్ సేతుపతికి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఆయన కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'ఏస్'. ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది మే 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. రుక్మిణి వసంత్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 13వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ కామెడీ జోనర్ నుంచి పలకరించిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూద్దాం.
కథ: కథానాయకుడు (విజయ్ సేతుపతి) 'దుబాయ్' సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు. అక్కడి నుంచి అతను మలేసియా చేరుకుంటాడు. మలేసియాలో చెత్త వ్యాపారం చేస్తూ జ్ఞానానందం (యోగిబాబు) జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తన స్నేహితుడు పంపిస్తానన్న బోల్ట్ కాశీ అనే వ్యక్తి కోసం ఎయిర్ పోర్టులో జ్ఞానానందం ఎదురుచూస్తూ ఉంటాడు. అక్కడ తారసపడిన కథానాయకుడిని చూసి, అతనే బోల్ట్ కాశీ అనుకుంటాడు. తన రహస్యాలు దాచిన కథనాయకుడు అదే పేరుకు ఫిక్స్ అవుతాడు.
బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి)ని తనకి తెలిసిన ఒక బేకరీలో పనికి పెడతాడు జ్ఞానానందం. ఆ బేకరిని నడుపుతున్న కల్పన (దివ్య పిళ్లై)ని జ్ఞానా నందం ఆరాధిస్తూ ఉంటాడు. జ్ఞానానందం ఏర్పాటు చేసిన షెల్టర్ లో ఉంటున్న బోల్ట్ కాశీకి, అక్కడే రుక్మిణి (రుక్మిణి వసంత్) పరిచయమవుతుంది. ఆ పరిచయం అభిమానంగా .. ప్రేమగా మారుతుంది. ఆమె చాలా నిజాయితీపరురాలని అతనికీ, అతను చాలా మాస్ అనే విషయం ఆమెకి అర్థమవుతాయి.
రుక్మిణీ తల్లి చనిపోతుంది. అప్పటి నుంచి స్టెప్ ఫాదర్ రాజదురై (పృథ్వీ) ఆమెను వేధిస్తుంటాడు. పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తేనే ఇంట్లో నుంచి వెళతానని పీడిస్తూ ఉంటాడు. అతను పోలీస్ కావడంతో రుక్మిణి మరింత భయపడుతూ ఉంటుంది. ఇక రెండు వారాలలో డబ్బు కట్టకపోతే బేకరీ సీజ్ చేస్తామని బ్యాంకువాళ్లు కల్పనకి నోటీసులు ఇస్తారు. వాళ్లను ఆ కష్టాల నుంచి బయటపడేసే డబ్బు కోసం, అక్కడి లోకల్ డాన్ ధర్మా (అవినాశ్)తోనే కాశీ జూదం ఆడతాడు. ధర్మా చేతిలో మోసపోయి రెండు కోట్లు అప్పుపడతాడు. ఇప్పుడు రుక్మిణీ .. కల్పనతో పాటు, కాశీకి కూడా డబ్బు చాలా అవసరం. ఆ డబ్బు కోసం కాశీ ఏం చేస్తాడు? ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ.
విశ్లేషణ: ఈ కథ అంతా మలేసియాలో జరుగుతుంది. పెద్ద బడ్జెట్ .. పెద్ద సినిమా మాదిరిగా కనిపించినప్పటికీ, కేవలం 6 పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. విజయ్ సేతుపతితో రొమాంటిక్ కామెడీ వర్కవుట్ అయిందా? అనేది అందరిలో తలెత్తే మొదటి సందేహం. అయితే యోగిబాబు వైపు నుంచి కొంత కామెడీ వర్కౌట్ అయిందిగానీ, విజయ్ సేతుపతి వైపు నుంచి రొమాన్స్ అనేది ఎక్కడా కనిపించదనే చెప్పాలి.
ఈ కథలో హీరో బృందంలోని వాళ్లకి డబ్బు చాలా అవసరమవుతుంది. అందుకు గల కారణాలు కరెక్టుగానే అనిపిస్తాయి. కానీ ఆ డబ్బు కోసం హీరో చేసే పనులే సహజత్వానికి చాలా దూరంగా .. సిల్లీగా కనిపిస్తాయి. హీరోయిన్ స్టెప్ ఫాదర్ ట్రాక్ .. హీరో - విలన్ ట్రాక్ ఏ మాత్రం కొత్తదనం లేకుండా కొనసాగుతాయి. యాక్షన్ సన్నివేశాలు ఓకేగా అనిపిస్తాయి గానీ, ఎమోషన్స్ మాత్రం కనెక్ట్ కావు. ఇక కథ అంతా మలేసియాలోని స్లమ్ ఏరియాలో .. గందరగోళంలో సాగడం మరో ఎత్తు.
కథ మొదలైన దగ్గర నుంచి కూడా పెద్దగా బలం లేని సన్నివేశాలే తెరపై కదులుతూ ఉంటాయి. యోగిబాబు తన మార్క్ తో ఆ సన్నివేశాల మధ్యలో దారిచేస్తూ మనలను ముందుకు తీసుకుని వెళుతూ ఉంటాడు. క్లైమాక్స్ చేరుకునేవరకూ కథలో పెద్దగా కదలిక కనిపించదు. తక్కువ పాత్రల చుట్టూ కథను అల్లిన తీరు గొప్పగా అనిపించినప్పటికీ, ఆ కథలో ఆశించినస్థాయి బలం లేకపోవడం ప్రేక్షకులకు కాస్త నిరాశను కలిగిస్తుంది.
పనితీరు: విజయ్ సేతుపతిలోని నటుడిని కొత్తగా చూపించే ప్రయత్నమేదీ జరగలేదు. అయినా ఎప్పటిలానే ఆయన నటన ఆకట్టుకుంటుంది. రుక్మిణి వసంత్ ఆకర్షణీయమైన రూపం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అనే చెప్పాలి. మోడ్రన్ డ్రెస్ లలో ఆమె గ్లామరస్ గా మెరిసినప్పటికీ, చీరకట్టులోనే ఆమెకు ఎక్కువ మార్కులు ఇవ్వగలమని అనిపిస్తుంది. యోగి బాబు స్టైల్ .. దివ్య పిళ్లై లుక్ కూడా సినిమాకి కొంతవరకూ హెల్ప్ అయ్యాయి.
ఆర్ముగ కుమార్ కథ .. స్క్రీన్ ప్లే ఓ మాదిరిగా అనిపిస్తాయి. సాంగ్స్ పరంగా మలేసియాలోని గొప్ప లొకేషన్స్ ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదు. కరణ్ బి రావత్ ఫొటోగ్రఫీ .. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఫెన్నీ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సాగతీతను ట్రిమ్ చేస్తే బాగుండుననే భావన కలుగుతుంది.
ముగింపు: మలేసియాలో చాలా తక్కువ పాత్రల చుట్టూ అల్లిన కథ ఇది. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. రొమాన్స్ దిశగా పూర్తిస్థాయి కసరత్తు జరగలేదు. అందువల్లనే బలం తగ్గిన సన్నివేశాలు తేలిపోతుంటాయి. కామెడీ పేరుతో అప్పటికప్పుడు తెరపై జరిగే ఒక హడావిడి తప్ప, మరెలాంటి ఫీల్ ను కలిగించలేకపోయిన కథ ఇది.
'ఏస్'(అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Ace Review
- విజయ్ సేతుపతి హీరోగా 'ఏస్'
- మలేసియాలో జరిగే కథ ఇది
- అక్కడక్కడా ఆకట్టుకునే సన్నివేశాలు
- క్లైమాక్స్ వరకూ కనిపించని మలుపులు
- కొత్తదనానికి దూరంగా సాగే కంటెంట్
Movie Name: Ace
Release Date: 2025-06-13
Cast: Vijay Sethupathi, Rukmini Vasanth, Yogibabu, Avinash, Pruthvi Raj, Divya Pillai
Director: Armuga Kumar
Music: Sam CS
Banner: 7cs Entretainment
Review By: Peddinti
Ace Rating: 2.00 out of 5
Trailer