తిరువీర్ కథానాయకుడిగా 'సిన్' రూపొందింది. 2020లో 7 ఎపిసోడ్స్ గా పలకరించిన ఈ సిరీస్ ను సినిమాగా వదిలారు. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 13 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 'సిన్' సినిమాలో ప్రధానమైన కథాంశం ఏ విషయం చుట్టూ తిరుగుతుంది? ఈ కథ ఎంతవరకూ కనెక్ట్ అవుతుంది? అనేది చూద్దాం. 

కథ
: ఆనంద్ (తిరువీర్) ఒక మధ్య తరగతి యువకుడు. తల్లి .. తండ్రి .. అన్న .. వదిన .. చెల్లెలు .. ఇది అతని కుటుంబం. అతను ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు. తనకి గల స్త్రీ వ్యామోహాన్ని పైకి  కనిపించనీయకుండా, మంచివాడిలా నటిస్తూ ఉంటాడు. సంప్రదాయ బద్ధమైన కుటుంబానికి చెందిన నందిత ( దీప్తి)తో ఆనంద్ వివాహం జరుగుతుంది. అతను ఎలాంటివాడు అనే విషయం మొదటి రాత్రి రోజునే నందితకు అర్థమైపోతుంది. 

 అదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన నీనా (జెన్నీ ఫర్)తో ఆనంద్ కి పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అప్పటి నుంచి నందిత పట్ల దారుణంగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. ఆమెను ఎలా వదిలించుకోవాలా అనే ఆలోచలలో పడతాడు. అదే సమయంలో నందిత పుట్టినరోజున ఆమెకి శుభాకాంక్షలు చెబుతూ అజ్ఞాత వ్యక్తి నుంచి ఒక ఫ్లవర్ బొకే వస్తుంది. దాంతో ఆమె పట్ల ఆనంద్ కి అనుమానం మొదలవుతుంది. 
 
నందితను ఇంట్లో నుంచి పంపించివేయడానికి సరైన కారణం దొరికిందని ఆనంద్ అనుకుంటాడు. మరో వైపు నుంచి ఆనంద్ అన్నయ్య, తన తమ్ముడు - మరదలు మధ్య వివాహ బంధం సరిగ్గా లేకపోవడాన్ని గమనిస్తాడు. నందితను వశపరచుకోవడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఒక వైపు నుంచి వదిలించుకోవడానికి భర్త .. వశపరచుకోవడానికి బావ ప్రయత్నిస్తూ ఉంటే నందిత ఏం చేస్తుంది? అమెరికా నుంచి నీనా ఎందుకు వస్తుంది?  ఆనంద్ కి ఆమె చేరువ కావడానికి కారణం ఏమిటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ
: సాధారణంగా ఉమ్మడి కుటుంబాలు చాలా బలంగా ఉంటాయి. అలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తులలో ఒక్కొక్కరికీ ఒక్కో బలహీనత ఉంటే, ఆ ఉమ్మడి కుటుంబం కూడా అంతే బలహీనంగా మారుతుంది. అద్దం ముందు భాగంలా ఆదర్శాన్ని మాత్రమే పైకి కనిపించేలా చేసేవారు ఎంతో మంది. అసలు రంగు కనిపించకుండా ముసుగులు వేసుకు తిరుగుతున్న ఆ కుటుంబంలోకి కొత్త కోడలు అడుగుపెడితే ఎలా ఉంటుందనేది ఈ కథ.

కొత్త కాపురం .. భర్త వింత ధోరణి .. ఇలా భార్యాభర్తల ట్రాక్ కాస్త వాస్తవానికి దగ్గరగానే అనిపిస్తుంది. అయితే అమెరికా నుంచి 'నీనా' రావడం .. ఆనంద్ కి దగ్గర కావడం మాత్రం వాస్తవానికి చాలా దూరంగా అనిపిస్తుంది. వాళ్లిద్దరినీ ఒకటిని చేసే సన్నివేశాలు మనకి కొరుకుడు పడవు. దాంతో నందితను ఆనంద్ అనుమానిస్తూ ఉంటే, 'నీనా' పాత్రను మనం సందేహించడం మొదలుపెడతాము.

అయితే ఈ కథలో దర్శకుడు ఒక ట్విస్ట్ ఇస్తాడు. అప్పటికప్పుడు అది మనకి ట్విస్ట్ లా అనిపించినప్పటికీ, ఆ ట్విస్ట్ కారణంగా హీరోయిన్ క్యారైక్టరైజేషన్ ఒక్కసారిగా అక్కడి నుంచి పడిపోతుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది అర్థం కాదు. ఇక వినోదానికి దూరంగా కంటెంట్ వెళ్లడం కూడా ప్రేక్షకులకు కాస్త అసహనాన్ని కలిగిస్తుంది. కొన్ని అభ్యతరకరమైన సన్నివేశాల కారణంగా, ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కూడా కాదు.   

పనితీరు: ఆర్టిస్టులంతా ఎవరి పాత్రలో వారు బాగానే చేశారు. ఇక సాంకేతిక పరంగా చూసుకుంటే,సిద్  జే  - అజీమ్ మహ్మద్ ఫొటోగ్రఫీ .. సిద్ధార్థ్ సదాశివుని నేపథ్య సంగీతం .. అరుణ్ ఎడిటింగ్ ఓకే. 

ముగింపు: ఇది చాలా సాధారణంగా కనిపించే డిఫరెంట్ మూవీ. అభ్యంతరకర సన్నివేశాలు ఎక్కువే. ట్విస్ట్ అనేది ఆశ్చర్యపోయేలా ఉండాలి. కానీ ఈ సినిమాలో ట్విస్ట్ ఉలిక్కిపడేలా చేస్తుంది. ఈ ట్విస్ట్ ను జీర్ణించుకోవడం కామన్ ఆడియన్స్ కి కష్టమేనేమో.