భారీ బడ్జెట్‌ చిత్రాలు నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ అప్పుడప్పుడూ నూతన తారలతో చిన్న బడ్జెట్‌ చిత్రాలు కూడా నిర్మిస్తోంది. అందులో భాగంగానే మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం '8 వసంతాలు'. నూతన తారలు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?  ఆడియన్స్‌కు ఈ చిత్రం ఎలాంటి వినోదాన్ని అందించిందో తెలుసుకుందాం... 

కథ: శుద్ధి అయోధ్య (అనంతిక సునీల్‌కుమార్‌) యువ రచయిత్రి. నాన్న చనిపోవడంతో అమ్మతో కలిసి ఊటిలో ఉంటూ.. మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటూ మరో వైపు  పుస్తకాలు రచన చేస్తుంటుంది. తన రచనలతో ఎంతో మంది అభిమానుల్ని సంపాందించుకుంటుంది. రచనలు, మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న వరుణ్‌, (హను రెడ్డి) శుద్ది అయ్యోధ్యను ప్రేమిస్తాడు. ఆమెతో తన మనసులోని మాటను చెబుతాడు. 

అయితే కొంత సమయం తరువాత తన అభిప్రాయాన్ని చెబుతానని చెప్పిన శుద్ధి తన మనసులోని ప్రేమను  వరుణ్‌కు తెలియజేసే సమయానికి అతని జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ కారణంగా ఆమె ప్రేమను తిరస్కరించి విదేశాలకు వెళ్లిపోతాడు. ఆ తరువాత శుద్ధి జీవితంలకి వచ్చిన సంజయ్‌ (రవి దుగ్గిరాల) ఎవరు? అసలు వరుణ్‌ ఆమె ప్రేమను ఎందుకు ఒప్పుకోలేదు? శుద్ధి ఎనిమిది వసంతాల ప్రేమ ప్రయాణంలో జరిగిందేమిటి? చివరకు ఏం జరిగింది? శుద్ది ఎవరిని వివాహాం చేసుకుంది? అనేది మిగతా కథ.

విశ్లేషణ: పొయోటిక్‌గా సాగే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడానికి ప్రయత్నించాడు దర్శకుడు ఫణీంద్ర నర్శిరెట్టి. సినిమాలోని ప్రతి విజువల్‌, ప్రతి సన్నివేశం ఎంతో కవితాత్మకంగా ఉంటాయి. ముఖ్యంగా సినిమాలోని విజువల్స్‌ అందర్ని ఆకర్షిస్తాయి. ప్రథమార్థం ఫర్వాలేదనిపించినా, సెకండాఫ్‌ ఫోర్స్‌ఫుల్‌గా ఉంటుంది.  ప్రతి సన్నివేశంలో భావుకత నిండిన సంభాషణలు ఉంటాయి. అయితే అవి కొన్ని చోట్ల అందంగా ఉంటాయి. మరికొన్ని చోట్ల కృతిమంగా అనిపిస్తాయి. 

ప్రతి సన్నివేశాన్ని కవితాత్మకంగా మలిచే క్రమంలో దర్శకుడు కథలో, పాత్రల్లో ఉండే ఎమోషన్‌ సంగతి మరిచిపోయాడు. దీంతో సినిమాలో కలర్‌ఫుల్‌ సన్నివేశాలు కనిపించినా పెద్దగా మనం వాటితో కనెక్ట్‌ కాలేం. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న లవ్‌ ఫెయిల్యూర్‌, లవ్‌ బ్రేకప్‌ సన్నివేశాల్లో భావోద్వేగాలతో లేకపోవడంతో ఆడియన్స్‌ పెద్దగా ఈ సన్నివేశాలతో కనెక్ట్‌ కాలేరు. ముఖ్యంగా కాశ్మీర్‌లో వచ్చే వరుణ్‌, శుద్ది అయోధ్య సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా, కలర్‌ఫుల్‌గా ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తాయి. 

అయితే ఈ సన్నివేశాల్లో ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతాయి. అయితే అంచనాలకు తగిన విధంగా సెకండాఫ్‌లో కంటెంట్‌ బలంగా లేకపోవడంతో ఆడియన్స్‌ నిరాశపడక తప్పదు.  ఆడియన్స్‌ కన్వీన్స్‌ కాలేని అంశాలతో నిండి ఉన్న ద్వితీయార్థం గాడి తప్పుతుంది. ముఖ్యంగా ప్రేమకథ స్ట్రాంగ్‌గా లేకపోవడమే ఈ లవ్‌స్టోరీకి మైనస్‌. సంజయ్‌ పాత్రకు రాసుకున్న సీన్స్‌ విసుగు తెప్పించే విధంగా ఉంటాయి.ఇలాంటి పొయెటిక్‌ లవ్‌స్టోరీకి విజువల్స్‌తో పాటు కంటెంట్‌ కూడా మరింత బలంగా ఉంటేనే ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఈ విషయంలోనే లోపం జరిగిందనే అనే భావన కలుగుతుంది.   

నటీనటులు, సాంకేతి వర్గం పనితీరు: అనంతిక సునీల్‌కుమార్‌ నటన ఈ సినిమాకు మేజర్‌ హైలైట్‌. ఆమె క్యూట్‌నెస్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆమె స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఎంతో బాగుంది. ముఖ్యంగా వారణాశిలో జరిగిన యాక్షన్‌ సన్నివేశాల్లో ఆమె మంచి ప్రతిభను కనబరిచింది. హను రెడ్డి నటన కొత్తవాడైన మంచి మార్కులే పడతాయి. నటనతో పాటు హావాభావాలతో కూడా మెప్పించాడు. రవి దుగ్గిరాల నటన ఫర్వాలేదు. 

ఈ సినిమాకు మరో హీరో సినిమాటోగ్రాఫర్‌ విశ్వనాథ్‌ రెడ్డి అని చెప్పాలి. ఆయన ప్రతిభకు ఈ చిత్రం నిదర్శనం. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో బ్యూటిఫుల్‌గా చిత్రీకరించాడు. ఊటీ, కశ్మీర్‌ లోకేషన్స్‌ల్లో ఆయన చిత్రీకరించిన సన్నివేశాలు మణిరత్నం సినిమాలను గుర్తు చేస్తుంది. హెషామ్‌ సంగీతం సినిమాకు మరింత వన్నెను తెచ్చింది. దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తను చెప్పాలనున్న కథను పొయోటిక్‌ వేలో చెప్పాలనుకోవాలనే ఆలోచన వైవిధ్యంగా ఉన్న కథలో కొత్తదనం, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో సినిమా పూర్తిస్థాయిలో సంతృప్తి నివ్వదు. 

సంభాషణలు రాసుకోవడంలో దర్శకుడు చేసిన కసరత్తులు, కథను, స్క్రీన్‌ప్లేను మరింత స్ట్రాంగ్‌గా తీర్చిదిద్ది ఉంటే ఈ 8 వసంతాలు అందరిని అలరించే విధంగా ఉండేది. అయితే కథలో కొత్తదనం, భావోద్వేగాలు ఆశించకుండా విజువల్స్‌ కోసం అయితే ఈ '8 వసంతాలు' చూడొచ్చు..!