మలయాళం నుంచి వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో 'కేరళ క్రైమ్ ఫైల్స్' ఒకటి. కొంతకాలం క్రితం స్ట్రీమింగ్ జరుపుకున్న మొదటి సీజన్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో సీజన్ 2ను కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చారు. 6 ఎపిసోడ్స్ గా సీజన్ 2 నిన్నటి నుంచి 'జియో హాట్ స్టార్'లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 2లోని కథ ఏ అంశం చుట్టూ తిరిగిందనేది చూద్దాం. 

కథ: ఈ కథ కేరళలోని త్రివేండ్రమ్ .. కొచ్చి .. త్రిసూర్ .. అలువ చుట్టూ తిరుగుతుంది. 'కొచ్చి' నడిబొడ్డున గల మ్యూజియంలో దొంగతనం జరుగుతుంది. 17వ శతాబ్దానికి చెందిన కొన్ని ఖరీదైన వస్తువులు దోపిడీ చేయబడతాయి. దాంతో డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగుతుంది. 'టెరి' అనే పోలీస్ డాగ్, మ్యూజియంలో చిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆ రోజు నుంచి అది అనారోగ్యం బారిన పడుతుంది. దాంతో దానిని డాగ్స్ రిటైర్మెంట్ హోమ్ కి తరలిస్తారు. అక్కడ అది చనిపోతుంది. 
 
ఇదిలా ఉండగా త్రివేండ్రంలోని ఓ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే 'అంబిలిరాజు', ఓ నేరస్థుడిని 'కొట్టరక్కర' కోర్టులో హాజరు పరచడానికి వెళతాడు. అలా వెళ్లిన అతను తిరిగి రాకపోవడం .. కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. ఎంతో మంచివాడిగా పేరున్న ఆయన ఏమైపోయినట్టు అనేది ఎవరికీ అర్థం కాదు. దాంతో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ కురియన్ అవర్ .. నోబుల్ .. ప్రవీణ్ రంగంలోకి దిగుతారు.

'కొట్టరక్కర'లోని కోర్టు సమీపంలో తమకి అంబిలి రాజు కానిపించాడనీ, ఆయన ఒక నీలం రంగు కారులో వెళ్లడం తాము చూశామని కొంతమంది పోలీస్ ఆఫీసర్ తో చెబుతారు. దాంతో ఆ కారు ఆనవాళ్లు పట్టుకుంటూ, పోలీస్  ఆఫీసర్ నోబుల్ 'అలువ' ప్రాంతానికి వెళతాడు. ఈ కేసు విషయమై అక్కడి పోలీస్ ఆఫీసర్ మనోజ్ ను కలుస్తాడు. అక్కడ అతనికి అంబిలి రాజు గురించి ఒక సీక్రెట్ తెలుస్తుంది. అదేమిటి? అంబిలిరాజు ఏమైపోయాడు? మ్యూజియంలో దొంగతనానికీ .. పోలీస్ డాగ్ చనిపోవడానికి కారకులు ఎవరు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: క్రైమ్ థ్రిల్లర్ .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ లను ఉత్కంఠ భరితంగా తెరకెక్కించడంలో మలయాళం మేకర్స్ మంచి నైపుణ్యాన్ని చూపిస్తారనే పేరు ఉంది. అందువలన ఇతర భాషల వారు సైతం మలయాళ సిరీస్ ల పట్ల ఆసక్తిని చూపుతుంటారు. అలా వచ్చిన ఈ సిరీస్ మొదటి సీజన్ మంచి ఆదరణ పొందింది. మరి సీజన్ 2 పరిస్థితి ఏమిటీ అంటే, ఈ సీజన్ కూడా అనూహ్యమైన మలుపులతో కొనసాగిందనే చెప్పాలి.

ఈ కథకు స్క్రీన్ ప్లే ప్రాణమని చెప్పాలి. ఒక వైపున అంబిలి రాజు అదృశ్యమైపోవడానికి గల కారణాలను అన్వేషిస్తూ ఉంటారు. మరో వైపున పోలీస్ డాగ్ చనిపోవడం గురించి పరిశోధన జరుగుతూ ఉంటుంది. ఈ రెండు అంశాలకు సంబంధించిన సస్పెన్స్ ను చివరివరకూ ఆడియన్స్ గెస్ చేయకుండా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి షిఫ్ట్ అవుతూ, ఎప్పటికప్పుడు ఆడియన్స్ లో కుతూహలాన్ని పెంచుతూ ఉంటుంది.

అయితే పోలీసులు .. స్టేషన్లు .. ఏరియాలు .. అనుమానితులు .. ఇలా తెరపైకి వచ్చే పాత్రలు .. లొకేషన్లు ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రేక్షకులకు కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. అసలు విషయం అర్థం కావాలంటే మరింత శ్రద్ధ పెట్టి ఈ సీజన్ ను ఫాలో కావలసి ఉంటుంది. ఏం జరిగి ఉంటుందనేది దర్శకుడు నేరుగా చెప్పకుండా ఆడియన్స్ ఊహకు వదిలేయడం బాగుంది. సహజత్వానికి దగ్గరగా నడిచే ఈ సీజన్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనే చెప్పాలి.

పనితీరు
: కథ .. స్క్రీన్ ప్లే .. ఈ సీజన్ కు ప్రధానమైన బలం అని చెప్పాలి. సందర్భానికి తగిన లొకేషన్స్ ఈ కథను మరింత సపోర్ట్ చేశాయి. పోలీస్ ఆఫీసర్స్ పాత్రలను పోషించిన ఆర్టిస్టులు .. అనుమానితులుగా తెరపై కనిపించినవారు కథకు సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్లారు. తమతో పాటు ఆడియన్స్ ను తీసుకుని వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. 

హేషం అబ్దుల్ వాహెబ్ నేపథ్య సంగీతం బాగుంది. జితిన్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మహేశ్ భువనేంద్ ఎడిటింగ్ వర్క్ కూడా నీట్ గా అనిపిస్తుంది. అనువాదమే అయినా పెద్దగా ఆ తేడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుండా చూసుకున్నారు. 

ముగింపు: కథ .. స్క్రీన్ ప్లే .. ప్రధానమైన పాత్రలను తీర్చిదిదిన తీరు .. నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ .. ఈ సిరీస్ కి హైలైట్ గా నిలిచాయి. అభ్యంతరకర సన్నివేశాలు .. సంభాషణలు లేకపోవడం కలిసొచ్చే అంశం. పోలీస్ కథలను .. ఇన్వెస్టిగేటివ్ కథలను ఇష్టపడేవారు ఈ సిరీస్ ను చూడొచ్చు.