తెలుగులో ఇంతవరకూ వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలా తక్కువ. అలాంటి ఒక జోనర్ నుంచి రూపొందిన సినిమానే 'ఘటికాచలం'. నిఖిల్ దేవాదుల .. ప్రభాకర్ .. ఆర్విక గుప్తా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, మే 31వ తేదీన థియేటర్లకు వచ్చింది. యధార్థ సంఘటన ఆధారంగా అంటూ వచ్చిన ఈ సినిమా, నిన్నటి నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: కౌశిక్ (నిఖిల్ దేవాదుల) డాక్టర్ కోర్స్ చేస్తూ ఉంటాడు. తనకి ఇష్టం లేకపోయినా, తండ్రి మాట కాదనలేక ఆ కోర్స్ వైపు వెళతాడు. అతను రోజూ కాలేజ్ కి వెళ్లడానికి మరో కారణం ఉంది. ఆ కారణం పేరే 'సంయుక్త'. ఆమెను తను ఎంతగానో ఆరాధిస్తూ ఉంటాడు. ఆమె కూడా అతనిని అభిమానిస్తూ ఉంటుంది. అయితే అదే కాలేజ్ లో చదువుతున్న జార్జ్ కూడా సంయుక్తను ప్రేమిస్తూ ఉంటాడు. అందువలన జార్జ్ పట్ల కౌశిక్ కోపంగా ఉంటాడు. 

 మొదటి నుంచి కూడా కౌశిక్ ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. అయితే రాన్రాను ఆయన ధోరణి మరింత మారిపోతూ ఉంటుంది. తన శరీరాన్ని ఎవరో తమ అధీనంలో పెట్టుకుని తనని ఆదేశిస్తున్నట్టు .. తనని నియంత్రిస్తున్నట్టు కౌశిక్ కి అనిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ ప్రకారంగానే అతను చాలా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. దాంతో తల్లిదండ్రులతో పాటు అంతా ఆయనను చూసి భయపడే పరిస్థితి వస్తుంది.

కౌశిక్ ను కుందన్ భాగ్ కి చెందిన ఘటికాచలం అనే ప్రేతాత్మ ఆవహించిందని అతని పేరెంట్స్ నమ్ముతారు.  ఈ విషయంలో నిజానిజాలను తేల్చుకోవడం కోసం కౌశిక్ తండ్రి పరశురామ్ ఓ రోజున కుందన్ భాగ్ వెళతాడు. ఘటికాచలం గురించి వాకబు చేస్తాడు. అప్పుడు ఆయనకి ఎలాంటి  నిజాలు తెలుస్తాయి. ఘటికాచలం ఎవరు? ఆయనకి .. కౌశిక్ కి గల సంబంధం ఏమిటి? కౌశిక్ ను మామూలు మనిషిని చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: థ్రిల్లర్ జోనర్ లోని సినిమాలు భయపెడుతూ .. సస్పెన్స్ లో పెడుతూ ముందుకు వెళుతూ ఉంటాయి.  ఈ జోనర్ కి చెందిన కొన్ని కథల్లో హారర్ కూడా కలిసిపోయి, ఏం జరుగుతుందో అనే ఒక ఉత్కంఠ పెరుగుతూ పోతుంది. కథ నిదానంగా చిక్కబడుతూ, భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇలాంటి లక్షణాలు 'ఘటికాచలం'లో లేకపోవడం, ఈ జోనర్ ను ఇష్టపడేవారికి నిరాశను కలిగించే విషయం. 

ఈ తరహా కథలు బయటికి వెళ్లడానికి భయపడిపోతూ ఉంటాయి. నాలుగు గోడల మధ్యనే తమ సమయాన్నంతా గడిపేస్తాయి. పాత్రలు వెతుక్కుంటూ ఆ నాలుగు గోడల మధ్యకు వస్తాయేగానీ, కథ మాత్రం కాలు బయటికి పెట్టదు. బడ్జెట్ కి కథ భయపడుతుందని గ్రహించి, మనమే ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ లోపల ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంటుంది. అలా చూడవలసిన కథనే ఇది.          

థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సినిమాలలో కథ తక్కువగా ఉంటుంది. స్క్రీన్ ప్లే .. కెమెరా పనితనం .. సౌండ్ ఎఫెక్ట్స్ పైనే అవి ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి. కథ కంటే కూడా కెమెరా .. సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రమే ప్రేక్షలులను భయపెడతాయి. అయితే ఈ సినిమా విషయంలో అది జరగలేదు. హీరో లవ్ ట్రాక్ గానీ .. ఫ్యామిలీ సీన్స్ గాని .. ఫ్లాష్ బ్యాక్ ను గాని సరిగ్గా డిజైన్ చేయలేదు. కథలో ఎలాంటి కొత్తదనం లేదు .. దేనికీ బలమైన రీజన్ లేదు. చివర్లో మాత్రం కాస్త హడావిడి కనిపిస్తుంది అంతే. 

పనితనం
: కథాకథనాలు చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకు తగినట్టుగానే తమ పనిని పూర్తి చేశాయి. ప్రత్యేకంగా చెప్పుకునే స్థాయిలో ప్రభావితం చేసినట్టుగా అనిపించదు. హీరో పాత్రకి హారర్ టచ్ ఇచ్చినా .. సైకోగా చూపించినా పెద్దగా ప్రయోజనం లేకపోవడం బాధాకరమే.    

ముగింపు: కొన్ని సినిమాలు కొత్త కంటెంట్ తో భయపెడతాయి. మరికొన్ని సినిమాలు పాత కథలతోనే బాధపెడతాయి. ఆ రెండో కోవలోకి చెందిన సినిమానే ఇది.