మలయాళంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన సినిమానే 'అలప్పుజ జింఖానా'. ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ 10వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. అదే నెలలో 25వ తేదీన తెలుగు ప్రేక్షకులను పలకరించింది. విష్ణు విజయ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా,ఈ నెల 20వ తేదీ నుంచి 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: జోజో జాన్సన్ ( నస్లేన్) షిఫాస్ అలీ (ఫ్రాంకో ఫ్రాన్సిస్)  షిఫాస్ అహ్మద్ (సందీప్ ప్రదీప్)దీపక్ (గణపతి) డీజే (బేబీ జీన్) షణవాస్ (శివ హరిచరణ్) .. వీళ్లంతా కూడా 'అలప్పుజ'కి చెందిన కుర్రాళ్లు. అందరూ కూడా ఇంటర్ చదువుతూ ఉంటారు. చదువు పట్ల దృష్టి తక్కువ .. ఆకతాయి పనుల పట్ల ఆసక్తి ఎక్కువ అన్నట్టుగా వాళ్ల లైఫ్ సాగిపోతూ ఉంటుంది. అందువలన ఒక్క షణవాస్ మినహా మిగతా వాళ్లంతా ఫెయిల్ అవుతారు. 

అదే టౌన్ లో చదువుతున్న అనుపమ .. షెర్లిన్ .. నటాషా అనే ముగ్గురు అమ్మాయిలను లైన్లో పెట్టాలనే ప్రయత్నంలో జోజో ఉంటాడు. ఒకానొక సందర్భంలో .. ఒక గొడవ  విషయంలో జోజో బ్యాచ్ కి అమ్మాయిల ముందు అవమానం జరుగుతుంది. దాంతో తామంతా బాక్సింగ్ నేర్చుకుంటే బాగుంటుందని జోజో భావిస్తాడు. స్పోర్ట్స్ కోటాలో కాలేజ్ సీట్లు సంపాదించవచ్చని అందరినీ ఒప్పించి, వాళ్లతో పాటు 'అలప్పుజ జింఖానా' అనే అకాడమీలో చేరతాడు. 

అయితే అప్పటివరకూ తినితిరగడం అలవాటైన కారణంగా, బాక్సర్ కావడానికి అవసరమైన కసరత్తు చేయలేకపోతారు. అలాంటి సమయంలోనే వాళ్లకి ఆంటోని (లక్మన్ అవరన్) కోచ్ గా వస్తాడు. రాష్ట్రస్థాయి పోటీల వరకూ జోజో బ్యాచ్ ను తీసుకుని వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? తమ జిల్లాకు పేరు తీసుకురావాలన్న ఆ బ్యాచ్ కోరిక నెరవేరుతుందా? జోజోతో జోడి కట్టేది ఎవరు? అనేది మిగతా కథ.

విశ్లేషణ: కొంతమంది ఇంటర్ కాలేజ్ కుర్రాళ్ల మధ్య అమ్మాయిల విషయంలో గొడవ జరుగుతుంది. జోజో బ్యాచ్ అవతల యువకుడి చేతిలో తన్నులు తింటుంది. ఆ యువకుడు బాక్సింగ్ నేర్చుకోవడం వల్లనే తాము అతనిని ఎదిరించలేకపోయామని భావించిన జోజో బ్యాచ్, ఒక రకమైన ఆవేశంతో బాక్సింగ్ నేర్చుకోవడానికి బరిలోకి దిగుతుంది. ఆ తరువాత వాళ్లకి ఎదురయ్యే అనుభవాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. 

బాక్సింగ్ నేపథ్యంలో ఇంతవరకూ వచ్చిన సినిమాలను పరిశీలిస్తే, కేవలం హీరో మాత్రమే ఆ దిశగా ప్రయాణం చేయడం .. అందులో విజయం సాధించడం కనిపిస్తుంది. బాక్సింగ్ నేపథ్యం అనేది సీరియస్ గానే కొనసాగుతూ వచ్చింది. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఇంటర్ కాలేజ్ కుర్రాళ్ల బాక్సింగ్ చుట్టూ ఈ కథ కామెడీగా తిరుగుతుంది. తమ లవర్స్ ముందు ఓడిపోకూడదనుకున్న ఈ బ్యాచ్, తమ జిల్లాను గెలిపించాలనే స్థాయికి రావడమే ఈ కథలోని ప్రత్యేకత.

 ఏ రంగాన్ని ఎంచుకున్నప్పటికీ కాలక్షేపం కోసం కాకుండా కష్టపడితే సక్సెస్ లభిస్తుందనీ, ప్రాక్టీస్ చేస్తూ తోటివారిని ఎంకరేజ్ చేయడం సక్సెస్ ప్రధానమైన సూత్రాల్లో ఒకటనే సత్యాన్ని జోజో బ్యాచ్ గ్రహించడమే ఒక సందేశంగా కనిపిస్తుంది. అలాగే పోరాడే ధైర్యం ఉన్నవారినే అమ్మాయిలు ఇష్టపడతారనీ, అయితే ఆ పోరాటం దిశగా అడుగులు వేయడానికి పేరెంట్స్ ప్రోత్సాహం అవసరమనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్పిన సినిమా ఇది.

పనితీరు: సాధారణంగా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో హిట్ కొట్టినవి చాలా తక్కువ. ఆ ఆట పట్ల అవగాహన తక్కువగా ఉండటం .. అలాంటి కథలు సీరియస్ గా నడవడం అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అందువలన ఈ కథకి లవ్ .. ఫ్రెండ్షిప్ .. కామెడీని కలుపుతూ యూత్ కి కనెక్ట్ చేయడంలో దర్శకుడు చాలావరకూ సక్సెస్ అయ్యాడు. 

  ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. ఎవరూ కూడా తమ పాత్రలలో నుంచి బయటికి రాలేదు. జింషీ ఖాలిద్ ఫొటోగ్రఫీ .. విష్ణు విజయ్ నేపథ్య సంగీతం .. నిషాద్ యూసఫ్ ఎడిటింగ్ కథకు సపోర్టుగా నిలిచాయి. తెలుగు అనువాదంలోను సంభాషణలు ఇమిడిపోతూ అక్కడక్కడా నవ్వుతెప్పిస్తాయి. 'స్క్వైర్ షేప్ లో ఉన్న దీనిని పట్టుకుని 'రింగ్' అంటారేంట్రా' .. వంటి చిన్న చిన్న డైలాగులు చాలానే కనిపిస్తాయి. 

ముగింపు
: ఆకతాయితనంతో బాక్సింగ్ రింగ్ వైపు అడుగులు వేసిన హీరో బ్యాచ్, ఆ తరువాత దానిని ఎంత సీరియస్ గా తీసుకుందనేది కథ. ఆకతాయితనం ఆశయంగా మారడమే ముగింపు. సున్నితమైన లవ్ .. కామెడీ .. ఫ్రెండ్షిప్ ను కలుపుకుంటూ తెరకెక్కిన ఈ సినిమా, యూత్ కి నచ్చుతుందని చెప్పచ్చు.